వామ్మో... పోకిరీలు!
వామ్మో... పోకిరీలు!
Published Fri, Jul 22 2016 12:09 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
ఊరి బయట బీసీ బాలికల వసతి గహాలు
చీకటిపడితే వేధిస్తున్న ఆకతాయిలు
అయినా చర్యలు తీసుకోని సంబంధిత అధికారులు
అనంతపురం ఎడ్యుకేషన్ : రుద్రంపేట సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న బీసీ బాలికల కళాశాలల విద్యార్థినులు పోకిరీల బెడదతో వణికిపోతున్నారు. నగర శివారు ప్రాంతం కావడం...జన సంచారం పెద్దగా లేకపోవడంతో కొందరు ఆకతాయిలు కళాశాలలకు వెళ్లే సమయంలోనూ తిరిగి వచ్చే సమయంలోనూ అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. ఇక్కడ బీసీ బాలికల కళాశాల వసతి గృహాలు (అనంతపురం అర్బన్, రూరల్) రెండూ ఉన్నాయి.
ఈ రెండు హాస్టళ్లలోనూ 480 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరందరూ ఇంటర్ మొదలుకొని పీజీ వరకు వివిధ కోర్సులు చేస్తున్నారు. వసతి గృహంలో ఉన్నంతవరకు బాగానే ఉన్నా...కళాశాలలకు వెళ్లాలంటే ఆడపిల్లలు వణికిపోతున్నారు. మూన్నెళ్ల కిందట కొందరు విద్యార్థినులు సాయంత్రం 6.30 గంటల సమయంలో రుద్రంపేట కూడలి నుంచి వసతి గృహం వైపు నడుచుకుంటూ వెళ్తుంటే ముగ్గురు పోకిరీలు వారికి ఎదురుగా వచ్చి వేధింపులకు గురి చేశారు. ఈ ఘటనతో భయాందోళనలు చెందిన అమ్మాయిలు పరుగు పరుగున వసతిగృహానికి వెళ్లారు. అలాగే పూటుగా తాగిన ఇద్దరు యువకులు ఒంటరిగా హాస్టల్‌కు వెళ్తున్న ఓ విద్యార్థినిని కామెంట్ చేసి వెకిలి చేష్టలకు పూనుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ అమ్మాయి బయటకు చెప్పుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఇలాంటి ఘటనలూ నిత్యకృత్యమయ్యాయని విద్యార్థినులు వాపోతున్నారు.
చీకటిపడితే చాలు తాగుబోతుల హల్‌చల్
విద్యార్థులు చదువుతున్న కొన్ని కళాశాలల సాయంత్రం వరకు ఉంటున్నాయి. దీంతో విద్యార్థినులంతా కిలోమీటర్ల దూరంలోని కళాశాల నుంచి నడుచుకుంటూ వచ్చేందుకు చాలా సమయం పడుతోంది. ఇక్కడికి వచ్చే సమయానికి చీకటి పడుతుండడంతో పోకిరీల బెడదతో వారంతా భయం భయంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది . దీంతో ప్రధాన రహదారి మీదుగా కాకుండా చిన్నచిన్న సందుల్లో హాస్టల్‌కు చేరుకుంటున్నామని కొందరు విద్యార్థినులు వాపోయారు. సాయంత్రం వేళ చీకటిపడితే చాలు తాగుబోతులు వసతి గృహం సమీపంలో హల్‌చల్ చేస్తుండడంతో అమ్మాయిలు దినదిన గండంగా కాలం గడుపుతున్నారు.
రక్షణ కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం
పోకిరీలు, ఆకతాయిల వేధింపుల విషయం గురించి విద్యార్థినులు బీసీ సంక్షేమశాఖ అధికారుల దృష్టికి పలు సందర్భాల్లో తీసుకెళ్లారు. చివరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వారు పెద్దగా పట్టించుకోకపోవడం అమ్మాయిలకు శాపంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సెక్యూరిటీని నియమించి రక్షణ కల్పించాలని అమ్మాయిలు కోరుతున్నారు. ఈ వసతి గృహాలకు బీసీ సంక్షేమశాఖ డీడీ కార్యాలయం, నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఉన్నా పోకిరీలు బరి తెగిస్తుండడం గమనార్హం.
పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం
కొందరు తాగుబోతులు, ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తున్న మాట వాస్తవమే. సాయంత్రం పూట ఈ సమస్యగా అధికంగా ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశాం. పోలీసుల నిఘా మరింత పెంచేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– పద్మ, హెచ్‌డబ్ల్యూఓ
Advertisement
Advertisement