కృష్ణా జిల్లా సీతారాంపురం-పల్లెర్లముడి వద్ద పోలవరం కుడి కాల్వకు గండి పడింది.
సీతారాంపురం: కృష్ణా జిల్లా సీతారాంపురం-పల్లెర్లముడి వద్ద పోలవరం కుడి కాల్వకు గండి పడింది. దీంతో రామిలేరులోకి భారీగా వరద నీరు చేరుతోంది. కాల్వకు గండి పడడంతో పట్టిసీమ నుంచి నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. పట్టిసీమ నీటి సామర్థ్యం 8400 క్యూసెక్కులు. 12 మోటర్ల ద్వారా ప్రతిరోజు 4200 క్యూసెక్కులు నీరు కృష్ణా నదిలోకి వదులుతున్నారు. 50 శాతం నీటి సామర్థ్యానికే కాల్వకు గండిపడింది. హడావుడిగా కాల్వ పనులు చేయడం, నాణ్యత గురించి పట్టించుకోకపోవడం వల్లే గండి పడిందని అంటున్నారు.
గండి పడిన ప్రాంతాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. కాల్వలో 4500 క్యుసెక్కుల నీరు వెళుతుందని, ఆ నీటిని గుండెరు వద్ద కాల్వలోకి మళ్లిస్తున్నామని ఆయన చెప్పారు. మధ్యాహ్నానికి గండిపడిన చోట నీటి ప్రవాహం తగ్గే అవకాశముందన్నారు. నీటి ప్రవాహం తగ్గగానే గండి పుడ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రస్తుతం పట్టిసీమ నుంచి నీటి విడుదల నిలిపివేశామని చెప్పారు.