
ఔనా.. అలా జరిగిందా?
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు సాధారణమే. ఆడుతున్న వారిని పట్టుకుని వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకోవడం మామూలే. పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రవేశపెట్టేలోపు దొరికిన సొమ్ములో కొంత పక్కదారిపడుతున్న విమర్శలు వింటున్నదే. ఈ తరహాలోనేగానీ... కాస్త అటు ఇటుగా... నీలకంఠాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని మొండెంఖల్‌లో ఓ సంఘటన చోటు చేసుకుంది. దాడిలో పట్టుబడ్డ సొమ్ము పక్కదారి పట్టించే సందర్భంలో ఓ సీఐ కక్కుర్తి పడ్డారు. ఇప్పుడది పీకకు చుట్టుకుంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కురుపాం మండలం నీలకంఠాపురం స్టేషన్ పరిధిలో గల మొండెంఖల్‌లో నెలరోజుల క్రితం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 18వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టి, అపరాధ రుసుం విధించి వదిలేశారు. అక్కడితో ఆ చాప్టర్ ముగిసిపోయింది. కానీ దాడుల సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల రాకను పసిగట్టిన పేకాట శిబిరంలోని ఒక వ్యాపారి తన వద్ద ఉన్న రూ.40 వేల నగదును పక్కనున్న ఖాళీ వాటర్ డ్రమ్‌లో పడేశారు. దీన్ని ఓ ముగ్గురు కానిస్టేబుళ్లు చూశారు. మామూలుగానే ఆ వ్యాపారితో కానిస్టేబుళ్లు సంప్రదింపులు చేసి, సెటిల్‌మెంట్ చేసుకుని కానిస్టేబుళ్లకు రూ. 10వేలు, వ్యాపారికి మిగతా రూ. 30వేలు వదిలేసినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న ఒక సీఐ రంగ ప్రవేశం చేసి, సదరు వ్యాపారికి ఫోన్ చేసి రూ. 30వేలు తెచ్చి ఇస్తావా? కటకటాల్లోకి తోసేయమంటావా అని గట్టిగా హెచ్చరించారు. భయపడిన ఆ వ్యాపారి తన స్నేహితుడి ద్వారా రూ. 30వేలు ఆయనకు ముట్టజెప్పారు.
ఏఎస్‌పీ దృష్టికి వ్యవహారం
వ్యవహారం వేగుల ద్వారా పార్వతీపురం ఏఎస్‌పీ సిద్ధార్ కౌశిల్ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. తప్పుడు వ్యవహారాలపై రాజీ పడని ఆయన నేరుగా రూ. 30వేలు ముట్ట జెప్పిన వ్యాపారిని పిలిపించగా, ఆయన మొండెంఖల్ సర్పంచ్‌తో కలిసి వెళ్లారు. జరిగిన ఘటనపై ఏఎస్‌పీ ఆరాతీశారు. ఏం జరిగిందో చెప్పాలన్నారు. తొలుత వ్యాపారి తటపటాయిం చినా తరువాత పేకాట దాడుల సమయంలో చోటు చేసుకున్న సంఘట న, ఆ తర్వాత జరిగిన సీఐ నిర్వాకాన్ని వ్యాపారి వివరించినట్టు సమాచా రం. మళ్లీ ఆయన ఎక్కడ మాట మార్చకుండా జరిగినదంతా రాయించుకున్నట్టు తెలిసింది. అలాగే, వ్యాపారి ఎవరితోనైతే సీఐకి రూ. 30వేలు పంపించారో ఆ మధ్యవర్తిని కూడా ఏఎస్‌పీ విచారించినట్టు తెలిసింది. ఇదంతా చూస్తుంటే ఈ వ్యవహారంలో సంబంధంలో ఉన్న కానిస్టేబుళ్లతో పాటు సీఐపై చర్యలు తప్పేలా లేవని అన్పిస్తోంది. అయితే ఈ విషయమై పార్వతీపురం ఏఎస్‌పీ సిద్ధార్‌కౌశిల్ వద్ద సాక్షి ప్రస్తావించగా... అదేం లేదే అని దాటవేశారు. ఒకవేళ ఎదైనా జరిగితే తప్పకుండా చర్యలుంటాయని చెబుతూనే భవిష్యత్‌లో అంతా తెలుస్తుందని తేల్చారు.