
ముద్రగడ ఇంటి గేట్లు మూసివేత
కిర్లంపూడి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి గేట్లను శుక్రవారం ఉదయం పోలీసులు మూసివేశారు. తన భార్య పద్మావతితో కలిసి ముద్రగడ ఆమరణదీక్షకు దిగిన వెంటనే పోలీసులు ఆయన నివాసం ద్వారాలను మూసేశారు. గేట్లు తెరిచేందుకు ముద్రగడ అనుచరులు ప్రయత్నిచడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గేట్లు తెరిచే ఉంచాలని పోలీసులతో ముద్రగడ వాగ్వాదానికి దిగారు.
జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ కిర్లంపూడి చేరుకుని పోలీసు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. కిర్లంపూడితో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మొహరించారు. కాగా, కాపులకు రిజర్వేషన్లు కల్పించేవరకు తన దీక్ష కొనసాగుతుందని ముద్రగడ స్పష్టం చేశారు. భావోద్రేకాలకు లోనుకావొద్దని, అవాంఛనీయ సంఘటనలకు చోటివొద్దని మద్దతుదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.