
పొట్టేలుపై పోలీసులకు ఫిర్యాదు
శత్రువుల్లా తలపడిన పొట్టేళ్లు
ఓ పొట్టేలు మృతి
మరో పొట్టేలుపై పోలీసులకు ఫిర్యాదు
చిత్తూరు : రెండు పొట్టేళ్లు శత్రువుల్లా తలపడ్డాయి. కొమ్ములతో ఢీకొంటూ అమీతుమీ తేల్చుకున్నాయి. ఓ పొట్టేలు అక్కడిక్కడే చనిపోయింది. బాధితురాలు తన పొట్టేలును మరో పొట్టేలు చంపేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గురువారం బి.కొత్తకోటలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక ఇందిరమ్మకాలనీకి చెందిన రవణమ్మ గొర్రెలు, పొట్టేళ్ల పెంపకంపై ఆధారపడి జీవిస్తోంది. గురువారం ఉదయం ఆమె గొర్రెలను మేపేందుకు సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లింది.
ఇదే సమయంలో ఇందిరమ్మ కాలనీకే చెందిన మరో వ్యక్తి తన గొర్రెల మంద తో అక్కడికి వచ్చాడు. గొర్రెలను తన మంద సమీపానికి తీసుకురావద్దని, వస్తే పొట్టేళ్లు కలియబడతాయని రవణమ్మ చెప్పింది. ఇంతలో రెండు మందల్లోని రెండు పొట్టేళ్లు తలపడ్డాయి. కొమ్ములతో ఢీకొన్నాయి. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన రవణమ్మ పొట్టేలు అక్కడిక్కడే మృతి చెందింది. దీనిపై రవణమ్మ పోలీసులను ఆశ్రయించింది.