పోలీస్‌కానిస్టేబుల్ ఎంపిక ప్రారంభం
మచిలీపట్నం : పోలీస్‌కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు పోలీస్‌పెరేడ్ గ్రౌండ్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలో ఎంపికయ్యేందుకు చెమటోడ్చారు. 1600 మీటర్లు, వంద మీటర్ల పరుగుపందెంలో ముందంజలో సాగేందుకు తమవంతు ప్రయత్నాలు చేశారు. 1600 మీటర్ల పరుగుపందెంకు ఎనిమిది నిమిషాల సమయం, 100 మీటర్ల పరుగుపందెంకు 15 సెక్షన్ల సమయం చొప్పున కేటాయించారు. లాంగ్‌జంప్ 3.8 మీటర్లుగా నిర్ణయించారు. గతంలో మాదిరిగా కాకుండా పరుగుపందెం పోటీలను సెన్సార్ ద్వారా ఎప్పటికప్పుడు రికార్డు చేశారు. అభ్యర్ధికి కేటాయించిన నెంబరు, సంబంధిత అభ్యర్ధి ఎంత సమయంలో పరుగుపందెంను పూర్తి చేశాడు, ఛాతీ కొలతలు, ఎత్తు తదితర వివరాలు సెన్సార్ ద్వారా కంప్యూటర్‌లో నిక్షిప్తమయ్యేలా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఎస్పీ జి విజయకుమార్ దగ్గరుండి మరీ పర్యవేక్షించారు.
366 మంది అభ్యర్థులు హాజరు :
పోలీస్‌కానిస్టేబుల్ పోస్టు కోసం సోమవారం నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కాగా సోమవారం 800 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంది. 366 మంది అభ్యర్థులు ఈ పరీక్షలలో పాల్గొన్నారు. మరో 150 మందికి పైగా అభ్యర్థులు సర్టిఫికెట్లు తదితర వివరాలు సక్రమంగా లేకపోవటంతో వెనుతిరగాల్సి వచ్చింది. 1600 మీటర్ల పరుగుపందెంలో పోలీస్‌పెరేడ్ గ్రౌండ్‌లో నాలుగు రౌండ్లు పరిగెత్తాల్సి ఉంది. కొంత మంది అభ్యర్థులు పరిగెత్తలేక సొమ్మసిల్లిపడిపోయారు. వారికి పెరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో వైద్యసేవలు అందించారు. విపత్కర పరిస్థితి ఎదురైతే అభ్యర్థులను ఆసుపత్రికి తరలించేందుకు 108ను సిద్ధంగా ఉంచారు. దేహదారుఢ్య పరీక్షలలో ఎంపికైన వారికి అప్పటికప్పుడే పాయింట్ల మెమోలను జారీ చేశారు. అభ్యర్థులు వారి సామాజిక వర్గాల వారిగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సర్టిఫికెట్ల పరిశీలన చేశారు.