కొత్తూరు మండలం గులివిందల పేట వద్ద ధర్నాకు వెళుతున్న ఇరపాడు నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: హిరమండలం రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద చేపట్టిన 36 గంటల ధర్నాను సోమవారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. వంశధార రిజర్వాయర్ నిర్వాసితులకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేశారు. అయితే ఈ ధర్నా ఉదయం ప్రారంభించగానే అక్కడ ఉన్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాసితులు ఇంకా రావాల్సివుండగా వారిని కలెక్టరేట్‌కి రాకుండా అడ్డుకున్నారు. ధర్నాలో ఉన్న నాయకులు చౌదరి తేజేశ్వరరావు, టి.తిరుపతిరావు, కె.నారాయణరావు, ఎం.తిరుపతిరావు, జి.సింహాచలంను పోలీసులు ఆరెస్టుచేశారు. తర్వాత వారిని వ్యక్తిగత పూచీ కత్తులపై విడిచిపెట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్‌ఆర్ ప్యాకేజీని విడుదల చేయకుండా, నిబంధనలు పాటించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు 5 సెంట్లు ఇల్లు స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాని డిమాండ్ చేశారు.
నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు
హిరమండలం/కొత్తూరు: వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద 36 గంటల పాటు ధర్నా చేసేందుకు వెళుతున్న నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు. హిరమండలం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులను, వాహనాలను తనిఖీలు చేసి నిర్వాసితులను గుర్తించి వెనుకకు పంపివేశారు. హిరమండలం మండలం దుగ్గుపురం గ్రామానికి చెందిన ఎన్.ఢిల్లేశ్వరరావుతో పాటు పలువురు నిర్వాసితులను బస్ నుంచి దించివేశారు. వీరిలో ఒక్క ఢిల్లేశ్వరరావుని పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లి అదుపులో ఉంచారు. మధ్యాహ్నం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. అలాగే కొత్తూరు మండలంలోని ఇరపాడు గ్రామానికి చెందిన నిర్వాసిత యువకులను ధర్నాకు వెళ్లకుండా గులివిందల పేట వద్ద స్థానిక ఎస్‌ఐ విజయకుమార్ తన సిబ్బందితో కలిసి అడ్డుకొన్నారు. ఆటోలతో వెళుతున్న నిర్వాసితులను ఆటోలు దించి పోలీస్ స్టేషన్‌కు రావాలన్నారు. లేదా ఇంటికి వెళ్లిపోవాలని తెలిపారు. దీంతో చేసేది లేక గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. అలాగే కుంచాల సీతారాంతో పాటు 12 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
‘ధర్నా భగ్నం దారుణం’
శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ): వంశధార రిజర్వాయర్ నిర్వాసితులకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నాకు సిద్ధమైన సీపీఎం పార్టీ నాయకులను అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో సీపీఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో పౌరులకు స్వేచ్ఛ లేకుండా పోతోందని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కలెక్టరేట్ వద్ద 36 గంటలు ధర్నాకు బయలుదేరిన నిర్వాసితులను గ్రామాల నుంచి రాకుండా ముందస్తుగానే వారిని అడ్డుకోవడం టీడీపీ ప్రభుత్వానికి తగదన్నారు. జిల్లాలో ఎస్పీ తీరు చాలా దారుణంగా ఉందని తీరు మార్చుకోకుంటే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. ప్రజలమీద ప్రభుత్వం, పోలీసుల తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.