
ఎల్.ఎన్.పేట/కొత్తూరు (శ్రీకాకుళం):వంశధార ప్రాజెక్టు పనులను తానే చేపట్టానని.. తానే పూర్తి చేశానని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మరోసారి అధికారం ఇస్తే వంశధార నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే విద్యుత్ చార్జీలు పెంచనని, అవకాశం కలిసి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత అంచలంచెలుగా 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని స్పష్టం చేశారు.
వలంటీర్లు తప్పుడు పనులు చేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని, 18 ఏళ్లు పైబడిన వారి నుంచి పింఛన్ వచ్చేంత వరకు ప్రతినెలా ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, హత్యాప్రయత్నం కేసు నమోదు చేశారని అన్నారు. పోలీసులు తమను కాపాడాలని, తర్వాత వారికి సహకరిస్తామని చెప్పారు.
వంశధార నిర్వాసితుల నిరసన
చంద్రబాబు కొత్తూరు మండలం గూనభద్ర వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేవలం టీడీపీ నాయకులు మాత్రమే హాజరయ్యారని, నిజమైన నిర్వాసితులకు అనుమతి ఇవ్వలేదని ఇరపాడుకు చెందిన జి.శాంతకుమార్, పాడలికి చెందిన జి.వెంకటరమణలతో పాటు పలువురు నిర్వాసిత మహిళలు వేదిక ముందు నిరసన తెలిపారు. దీనివల్ల నిర్వాసితులకు ఒరిగేదేమీ లేదన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు పోలీసు బలగాలతో తమను నెట్టేసిన చంద్రబాబు ఇప్పుడు తమ వద్దకు రావడం సరికాదని పాడలి ముంపు గ్రామానికి చెందిన పలువురు అన్నారు. వీరి నిరసనను టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఎస్‌ఐ గోవిందరావు సిబ్బందితో వచ్చి నిర్వాసితులను చెదరగొట్టారు. కార్యక్రమంలో కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు, కలమట వెంకటరమణ, కిమిడి కళావెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment