రెడ్ టార్గెట్
►ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధంపై పోలీసుల దృష్టి
►ఓఎస్డీ నేతృత్వంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
►అటవీ ప్రాంతంలో ఇక నిరంతర కూంబింగ్
►50 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం
►తాజాగా రూ.13.40 లక్షల విలువైన 22 దుంగలు పట్టివేత
నెల్లూరు : జిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. నెల రోజులుగా స్మగ్లర్ల హడావుడి పెరగటంతో పోలీసులు వారి కదలికలపై దృష్టి సారించారు. జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. వీటిపై కన్నేసిన స్మగ్లర్లు అధికార పార్టీ నేతల సహకారంతో చెలరేగిపోతున్నారు. జిల్లా నూతన ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన పీహెచ్‌డీ రామకృష్ణ ఎర్ర చందనం అక్రమ రవాణ నిరోధంపై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. పోలీస్ ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్డీ) టీపీ విఠలేశ్వరరావును ఇన్‌చార్జిగా నియమించి పూర్తిస్థాయి ప్రణాళికతో స్మగ్లింగ్‌ను కట్టడి చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని వెంకటగిరి, డక్కిలి, రాపూరు మండలాల్లోని వెలుగొండ అటవీ ప్రాంతంతోపాటు ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని సీతారామపురం, ఉదయగిరి మండలాల్లోనూ ఎర్ర చందనం చెట్లు ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దున ఉన్న కడప, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లర్లు తమిళనాడు కూలీల సాయంతో యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు.
ఏటా 100 టన్నుల పైనే..
ఏటా సగటున జిల్లా నుంచి 100–150 టన్నుల ఎర్ర చందనం స్మగ్లింగ్ అవుతోందని అంచనా. రెండు నెలలుగా జిల్లాలో ఎర్ర చందనం ఆక్రమ రవాణా అధికమైంది. గ్రామాల్లోని టీడీపీ నేతల సహకారంతో ఈ వ్యవçహారం సాగుతోంది. గత నెల 23న వెంకటగిరి మండలం వల్లివేడు సమీపంలో టీడీపీ గ్రామ నేతకు చెందిన నీళ్ల ట్యాంకర్‌లో అక్రమంగా తరలిస్తున్న 24 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు డక్కిలి మండలం చీకిరేణిపల్లి వద్ద వ్యాన్‌లో తరలిపోతున్న మరో 11 దుంగలను పట్టుకున్నారు. వెంకటగిరి మండలం వల్లివేడు సమీపంలో ఎర్రచందనం దుంగలతో పట్టుబడిన నీళ్ల ట్యాంకర్ వెంకటగిరికి చెందిన టీడీపీ కీలక నేతది కావటంతో దీని వెనుక ఆయన ప్రత్యక్ష సహకారం ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని వెంకట గిరి సమీపంలో పట్టుకున్నా డక్కిలి పోలీస్ స్టేషన్‌కు తరలించటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ వ్యవహారాన్ని నీరుగార్చటానికి అధికార పార్టీ నేతలు అనేక రకాలుగా ప్రయత్నించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
తాజాగా 22 దుంగల పట్టివేత
తాజాగా సోమవారం సాయంత్రం 340 కిలోల బరువైన 22 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఒక వాహనాన్ని సీజ్ చేశారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన జగనాథ్ మోహన్, వెంకటగిరి మొక్కలపాడు గ్రామానికి చెందిన మన్నేటి ఈశ్వరయ్యతో కలిసి కొంతకాలంగా ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తుండగా.. వెంకటగిరి సీఐ మద్ది శ్రీనివాసులు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. వెంకటగిరి–నాయుడుపేట రోడ్డులోని మోడల్ స్కూల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటవీ ప్రాంతం నుంచి 240 కేజీల బరువైన 13 ఎర్ర చందనం దుంగల్ని తరలిస్తున్న వ్యక్తులు వాహనాన్ని వేగంగా నడు పుతూ పోలీసులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో స్మగ్లర్ల బృందంలోని తమిళనాడు ప్రాంతానికి చెందిన అన్నామలై పరమశివంను చెన్నైలో గాంధీనగర్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరమశివం నుంచి వంద కేజీల బరువున్న 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బృందంలో మరికొందరు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.