దండకారణ్యంలో యుద్ధ మేఘాలు..?!
మూడు రాష్ట్రాల్లో విస్తరించిన, మావోయిస్టుల నిలయమైన దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయా..?
మావోయిస్టుల స్థావరాలపై దాడి దిశగా పోలీసు బలగాలు పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయా..?
అమర వీరుల వారోత్సవాల తర్వాత మావోయిస్టులు అలజడి లేకుండా మౌనంగా ఉండడం వెనుక వ్యూహం ఉన్నదా..?
ఔను..! విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. ఈ మూడు ప్రశ్నలకు సమాధానమిదే.
దుమ్ముగూడెం(భద్రాచలం):
తెలంగాణ సరిహద్దును ఆనుకుని దండకారణ్యం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోగల అటవీ ప్రాంతంలో తిష్ట వేసిన మావోయిస్టులను ఏరివేసేందుకు పోలీసు బలగాలు పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నట్టు తెలిసింది. ‘మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు’ పేరిట మావోయిస్టులు కొన్ని రోజుల కిందట దండకారణ్యంలో (ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో) సభ (ఇక్కడున్న ఫొటోలు చూడండి) నిర్వహించారు. సభాస్థలితోపాటు మరికొన్నిచోట్ల స్థూపాలు నిర్మించారు. ‘మావోయిస్టులు పుంజుకుంటున్నారనేందుకు ఇవి నిదర్శనాలు’గా బలగాలు భావిస్తున్నట్టు తెలిసింది.
ఎన్‌కౌంటర్.. ‘ప్రశాంతత’..
ఇటీవలి కాలంలో (వారోత్సవాలు ముగిసిన తరువాత) కిష్టారం పోలీస్ స్టేషన్ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఆ తరువాత నుంచి మావోయిస్టుల వైపు ఎలాంటి స్పందనగానీ, కదలికగానీ లేదు. దండకారణ్యం ప్రశాంతంగానే ఉంది. ‘ఇది, తుపాను ముందటి ప్రశాంతతా..?’ దండకారణ్యంలోని ఆదివాసీల నుంచి వ్యక్తమవుతున్న సందేహాలివి.
వ్యూహం.. ప్రతివ్యూహం
వ్యూహం.. ప్రతివ్యూహంతో ఇటు బలగాలు, అటు మావోయిస్టులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారా?! కిష్టారం పోలీస్ స్టేసన్ అటవీ ప్రాంతంలోగల బూరుగులంక, పాలాచలం తదితర అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఎక్కువగా ఉన్నట్టు పోలీసు నిఘా వర్గాలు గుర్తించాయని.. ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టేందుకు సీఆర్‌పీఎఫ్, కోబ్రా, కోయ కమాండోలు సిద్ధమవుతున్నాయని, వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయని తెలిసింది.
సంతకు బ్రేక్
కిష్టారం–గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లోని ధర్మపేట, చండ్రుగూడెం, కిష్టారం, గొల్లపల్లి, బూరుగులంకలో ప్రతి వారం వారపు సంతలు జరుగుతున్నాయి. ఈ వారం సోమవారం నుండి బుధవారం వరకు సంతలు కొనసాగాయి. శుక్రవారం జరిగే బూరుగులంక సంతకు బ్రేక్ పడింది. శుక్రవారం రోజున సంతకు రావద్దని పోలీసులు హెచ్చరించడంతో వ్యాపారులెవరూ వెళ్లలేదు.
తిప్పాపురంలో క్యాంప్..?
ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకుని ఉన్న చర్ల మండలం తిప్పాపురం అటవీ ప్రాంతంలో బేస్ క్యాంప్ ఏర్పాటుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అవసరమైన సామాగ్రితో బలగాలు అక్కడికి చేరుకుంటున్నట్టు సమాచారమందింది. తిప్పాపురం అటవీ ప్రాంతంపై మావోయిస్టులకు పట్టు ఉంది. దీనిని దెబ్బతీసే లక్ష్యంతోనే అక్కడ క్యాంప్ ఏర్పాటుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిని మావోయిస్టులు పసిగట్టారేమో.. ‘బేస్ క్యాంపులు ఏర్పాటు చేయవద్దు’ అంటూ పోస్టర్లు వేశారు.
మావోయిస్టులు అడ్డుకోవచ్చు...
బేస్ క్యాంప్ ఏర్పాటును మావోయిస్టులు అడ్డుకునేందుకు అవకాశముందంటూ పోలీసు వర్గాలను నిఘా వర్గాలు అప్రమత్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో, బలగాలు పక్కా ప్రణాళికతో, పకడ్బందీగా తిప్పాపురం వైపు ముందుకు కదులుతున్నాయి. ఒకవైపు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మరోవైపు క్యాంప్ ఏర్పాటుకు చురుగ్గా సన్నాహాలు సాగిస్తున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలు, మావోయిస్టుల బెదిరింపులనుబట్టి చూస్తే.. మావోయిస్టులది ‘తుపాను ముందటి ప్రశాంతత’ అనుకోవచ్చేమో కదా!
తిప్పాపురంలో ఎందుకంటే...
తిప్పాపురంలో క్యాంప్ ఏర్పాటు వెనుక తగిన కారణాలున్నాయి. ఈ ప్రాంతం.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోగల చర్ల మండలంలో ఉంది. దండకారణ్యం నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ఇక్కడి నుంచి వచ్చేందుకు అవకాశముంది. ఇప్పటికే తిప్పాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పట్టు ఉంది. మున్ముందు వారు అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా ఉండాలంటే.. ముందు వారిని అక్కడి నుంచి తరిమేయాలి. ఇది జరగాలంటే, అక్కడ బేస్ క్యాంప్ ఉండాలి. బలగాలు ఇప్పుడు ఈ ప్రయత్నంలోనే ఉన్నాయి.
ఐదు క్యాంపులు
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కుంట బ్లాక్‌లోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోగల పైడిగూడెం, ధర్మపేట, గొల్లపల్లి, ఎలకనగూడెం, దుమ్ముగూడెం మండలం గౌరారంలో బేస్ క్యాంపులు ఉన్నాయి. వీటి ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతా ల్లో మావోయిస్టుల కదలికలు కొంతవరకు తగ్గాయి. ఈ క్యాంపులు లేని దండకారణ్యంలో ని మిగతా ప్రాంతాల్లో వారు పుంజుకున్నారు.