పోలీసుల అడ్డాలో దొంగల హల్‌చల్
పోలీసుల అడ్డాలో దొంగల హల్‌చల్
Published Wed, Mar 15 2017 9:24 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
– ఎస్‌బీఐ కాలనీలో నాలుగు ఇళ్లలో చోరీ
– మహిళా గ్యాంగ్ పనే
– రూ.5లక్షలకు పైగా అపహరణ
నంద్యాల: పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు ఎక్కువగా నివాసం ఉన్న ఎస్‌బీఐ కాలనీలో మహిళా దొంగల గ్యాంగ్ హల్‌చల్ చేసింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి బుధవారం పట్టపగలు నాలుగు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. దీంతో పోలీస్ యంత్రాంగం షాక్‌కు గురైంది.
స్థానిక ఎస్‌బీఐ కాలనీలో పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు అధికంగా నివాసం ఉన్నారు. ఈ కాలనీలో పట్టపగలు కూడా జనసంచారం అంతంత మాత్రమే. దీంతో మొహానికి ముసుగు ధరించిన ఇద్దరు మహిళలు, పదేళ్ల బాలుడు ఇల్లు అద్దెకు కావాలని కాలనీలో తిరిగారు. పీజీ కాలేజీ హాస్టల్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఉద్యోగి విజయ్‌కుమార్ ఇంట్లోకి వెళ్లి, తాళం తొలగించి, లోపలికి ప్రవేశించి ఇంట్లోని దాదాపు 25వేల నగదు, సెల్‌ఫోన్లు, రెండు జతల కమ్మలు కాజేశారు. తర్వాత సమీపంలోని మూడు అంతస్థుల భవనం వద్దకు వెళ్లి ఇల్లు అద్దెకు కావాలని విచారించారు. మొదటి అంతస్తులోకి వెళ్లి మహారాష్ట్ర ఎరువుల కంపెనీ ఉద్యోగి గోమాసరోజ్ పిషల్ ఇంటి గొళ్లెం తగిలించి లోపలికి జొరబడ్డాడు. ఇంట్లో ఉన్న రూ.1.50లక్షల విలువ చేసే ఆరు తులాల బంగారు ఆభరణాలను కాజేశారు. పక్కనే ఉన్న టీచర్ నిర్మల ఇంటి తాళాలు కూడా తొలగించి ఇంట్లోని రూ.40వేల నగదు, రెండు జతల కమ్మలు, ఒకచైన్, పాపిడి బిళ్ల, నాలుగు ఉంగరాలను కాజేశారు. తర్వాత సమీపంలో మరో ఇంట్లో దొంగతనానికి విఫలయత్నం చేశారు.
పోలీసులకు షాక్..
ఎస్‌బీఐ కాలనీలో గతంలో చైన్‌స్నాచింగ్‌లు పెరిగాయి. అయితే రెండేళ్ల నుంచి ఎలాంటి దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు లేవు. ఈ ప్రాంతంలో సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు కొందరు నివాసం ఉండటంతో స్థానికులు ధైర్యంగా ఉండేవారు. కాని మహిళల గ్యాంగ్ ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీకి యత్నించడంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు. హుటాహుటినా క్లూస్‌టీంను, జాగిలాన్ని రప్పించి వివరాలను సేకరించారు. అనంతపురం, చిత్తూరు, ప్రాంతాలకు చెందిన పోలీస్ స్టేషన్‌లోకి కూడా సమాచారాన్ని అందించి వివరాలను సేకరిస్తున్నారు. స్థానికుల ప్రమేయంతోనే ఈ చోరీలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇంటికి వచ్చేసరికి ఖాళీ బీరువాలు కనిపించాయి: సుశీల, బాధితురాలు
ఉద్యోగ రీత్యా నా భర్త విజయ్‌కుమార్ బనగానపల్లెకు, నేను ఎస్సార్బీసీ కార్యాలయానికి ఉదయమే వెళ్లాం. సాయంత్రం వచ్చేసరికి తాళాలు తెరిచి ఉన్నాయి. పరిశీలించగా ఇంట్లోని నగదు, సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి.
క్లూ దొరికింది: గుణశేఖర్‌బాబు, సీఐ
ఇద్దరు ముసుగు ధరించిన మహిళలు చోరీకి పాల్పడినట్లు క్లూ దొరికింది. స్థానికుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి.
Advertisement
Advertisement