Pirates
-
ఓటీటీలో హైజాక్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. సముద్రంలో షిప్పులను హైజాక్ చేసే నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించిన లూటేరే వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం రెండు ఎపిసోడ్లను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ హైజాక్ థ్రిల్లర్ సిరీస్ లూటేరే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రధానంగా షిప్ హైజాక్ నేపథ్యంలోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. సోమాలియా సముద్రపు దొంగల చుట్టూ తిరిగే ఈ సిరీస్‌పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వచ్చే వారంలో మిగిలిన ఎపిసోడ్లను కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. లూటేరే వెబ్ సిరీస్‌ను ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా క్రియేట్ చేయగా.. ఆయన తనయుడు జై మెహతా డైరెక్షన్లో తెరకెక్కించారు . సోమాలియా పైరేట్స్ ఓ షిప్‌ను హైజాక్ చేయడం.. దానిని విడిపించడానికి జరిగే ప్రయత్నాలు చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, ప్రీతికా చావ్లా, చందన్ రాయ్ సన్యాల్ ప్రధాన పాత్రలు పోషించారు. Time to drop the anchor! ⚓🚢#HotstarSpecials #Lootere is now streaming. Watch now: https://t.co/KnAtofkAqW pic.twitter.com/NSqwm5GUnG — Disney+ Hotstar (@DisneyPlusHS) March 21, 2024 -
సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..!
సముద్రపు దొంగలకు సంబంధించిన కథలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. చాలామంది ఈ కథలంటే చెవికోసుకుంటారు. ఈ కథలకు దశాబ్ధాల చరిత్ర ఉంది. సముద్రపు దొంగల చిత్రాలు కూడా ఎంతో విచిత్రంగా ఉంటాయి. వీరు టోపీ ధరించడంతోపాటు నల్లని ప్యాంటు వేసుకోవడాన్ని మనం గమనించే ఉంటాం. ముఖ్యంగా ముఖానికి ఒక పట్టీ ఉంటుంది. అది ఒక కంటిని కప్పివేస్తూ ఉంటుంది. దీని వెనుక అనేక కథనాలు ఉన్నాయి. ఆ కామెడీ టీవీ సిరీస్‌లో.. దీనిని ఫ్యాషన్ అని కొందరు చెబుతుంటారు. కొన్ని కథలలో ఆ సముద్రపు దొంగకు ఒక కంటికి గాయమయ్యిందని, లేదా ఆ కన్ను లేదని అందుకే అలా పట్టీ కట్టుకున్నట్లు చెబుతారు. స్పాంజ్‌బాబ్ స్క్వేర్ప్యాంట్లు అనే అమెరికన్ కామెడీ టీవీ సిరీస్‌లోని సముద్రపు దొంగ పాత్రకు చిన్నప్పటి నుంచి ఒక కన్నువుండదు. దీంతో అతను తన కంటికి పట్టీ కట్టుకుంటాడు. అయితే సముద్రపు దొంగల పాత్రలన్నింటికీ కంటికి పట్టీ ఉండదు. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ మూవీ సిరీస్‌లోని సముద్రపు దొంగల కంటికీ పట్టీ ఉండదు. స్ఫూర్తిగా నిలిచిన క్యారెక్టర్ అరేబియా గల్ఫ్‌లో రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీ అనే సముద్రపు దొంగ తన దృష్టిని ఒకే చోట నిలిపి ఉండాలనే ఉద్దేశంలో ఒక కంటికి గంతలు కట్టుకునేవాడని చెబుతారు. ఈ తరహా పాత్రలు, చిత్రాలను సృష్టించడానికి చిత్రకారులు.. రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీను ప్రేరణగా తీసుకుని ఉండవచ్చని చెబుతారు. శాస్త్రీయ కోణంలో.. శాస్త్రీయంగా చూస్తే మన కళ్ళు అకస్మాత్తుగా చీకటి లేదా కాంతిని చూడాల్సి వచ్చినప్పుడు అవి సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తాయి. అకస్మాత్తుగా చీకటి పడినప్పుడు, మన కంటిలోని కనుబొమ్మ విస్తరిస్తుంది. తద్వారా ఎక్కువ కాంతి లోపలికి ప్రవేశిస్తుంది. కానీ ఆ కాంతి చీకటిలో చూడటానికి సరిపోదు. అప్పుడు రోడాప్సిన్ అనే రసాయనం విచ్ఛిన్నమై మన మెదడుకు నరాల ద్వారా సందేశాలను పంపుతుంది. అప్పుడు మసక చీకటిలో కూడా కళ్లు కొంతమేరకు చూడగలుగుతాం. సముద్రపు దొంగలు చీకటిలో చూసేందుకు ఒక కంటిని, వెలుతురులో చూసేందుకు మరో కంటిని సిద్ధంగా ఉంచుతారట. సముద్రపు దొంగలు ఒక కంటికి పట్టీ కట్టడంవలన మసక చీకటిలో వారు సరిగ్గా చూడటానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదట. మసక చీకటిలో చూసేందుకు వారు ఒక కంటికి ఉన్న పట్టీని తొలగించి, దానిని మరొక కంటికి దానిని అమరుస్తారుట. ఇది కూడా చదవండి: ‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’ -
నైజీరియాలో 19 మంది భారతీయుల విడుదల
అబుజా: ప్రైవేటు బోటులో ప్రయాణిస్తున్న భారతీయులను గత నెలలో కిడ్నాప్ చేసిన నైజీరియా సముద్ర దొంగ లు వారిని విడిచిపెట్టారు. డిసెంబర్ 15న ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట ఎమ్టీ డ్యూక్ పడవలో వెళుత ున్న 20 మందిని సముద్ర దొంగలు కిడ్నాప్ చేశారు. అయితే, ప్రయాణికుల్లోఒకరు మరణించారని నైజీరియాలోని భారత కార్యాలయం ఆదివారం తెలిపింది. మిగిలిన 19 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది. కిడ్నాప్ వార్త తెలిసిన వెంటనే స్పందించిన నైజీరియా ప్రభుత్వానికి ఆ దేశంలోని భారత అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆఫ్రికా తీరంలో భారతీయుల కిడ్నాప్
న్యూఢిల్లీ: ఆఫ్రికా పశ్చిమ తీరంలో 20 మంది భారతీయులను సముద్ర దొంగలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ వ్యవహారాన్ని భారత అధికారులు నైజీరియా అధికారులకు చేరవేశారు. హాంకాంగ్ జెండాతో ఉన్న పడవలో వీరు ప్రయాణిస్తుండగా కిడ్నాప్ అయినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 10 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై నైజీరియా అధికారులతో మాట్లాడామని విదేశాంగ శాఖ తెలి పింది. నైజీరియా తీరం వెంట ఇలా జరగడం ఈ ఏడాది ఇది మూడోది. -
నైజీరియా తీరంలో భారతీయుల కిడ్నాప్
న్యూఢిల్లీ: నైజీరియా తీరంలో హాంకాంగ్ జెండాతో వెళ్తున్న ఒక నౌకపై మంగళవారం సముద్ర దొంగలు దాడి చేశారని ఏఆర్ఎక్స్ మారిటైమ్ అనే సంస్థ తెలిపింది. నౌకలోని 19 మంది సిబ్బందిని బందీలుగా తీసుకెళ్లారని, వారిలో 18 మంది భారతీయులని తెలిపింది. సమాచారం తెలియగానే నైజీరియాలోని భారతీయ దౌత్యాధికారులు నైజీరియా ప్రభుత్వాన్ని సంప్రదించి, భారతీయులు విడుదలయ్యేందుకు సహకరించాలని కోరారు. -
పైరేట్స్ ఆఫ్ ది వరల్డ్
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సముద్రపు దొంగల బెడద సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఇటీవల కొన్నేళ్లుగా సముద్రపు దొంగల బెడద విపరీతంగా పెరిగిపోయింది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల అపహరణ, సిబ్బంది నిర్బంధం, సరుకుల దోపిడీ, దాడుల వార్తలు మళ్లీ నిత్యకృత్యంగా మారాయి. ప్రత్యేకించి ఈ నెల ఒకటో తేదీన భారతదేశానికి చెందిన సరుకుల నౌక మాందావిని పైరేట్లు అపహరించి, అందులోని 11 మంది సిబ్బందిని నిర్బంధించిన విషయం తెలిసిందే. ఆ నౌక దుబాయ్ నుంచి యెమెన్ అల్ ముకాలా రేవుకు వెళుతుండగా సోమాలియా సమీపంలోని హోబ్యో వద్ద పైరేట్లు దాడి చేశారు. గత నెలలో ఏరిస్ 13 అనే చమురు నౌకను పుంట్లాండ్ తీరం నుంచి పైరేట్లు అపహరించుకుపోయారు. తాజాగా.. ఏడెన్ తీరంలో ఒక చైనా నౌకను పైరేట్ల దాడి నుంచి బయటపడటానికి భారత నౌకాదళ సిబ్బంది సాయం చేశారు. ఈ సముద్రపు దోపిడీలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలకు ఈ ప్రమాదం విస్తరిస్తోంది. పైరేట్ల ముప్పు తీవ్రంగా ఉన్న పది ప్రాంతాలివీ... ► మలక్కా జలసంధి: హిందూ మహాసముద్రంలో ఉన్న మలక్కా జలసంధి వద్ద పైరేట్ల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఇది భారత్ – చైనా సముద్రయాన మార్గాల్లో చాలా ముఖ్యమైనదే కాదు.. సూయిజ్ కెనాల్, ఈజిప్ట్, యూరప్‌ల వాణిజ్యయాన గవాక్షం కూడా. ► దక్షిణ చైనా సముద్రం: దక్షిణ చైనా సముద్రంలో మలేసియన్లు, ఇండోనేసియన్లు పైరసీకి పాల్ప డుతున్నారు. వారిని అత్యంత ప్రమాదకరమైన వారిగా పరిగణిస్తారు. మలేసియా జలాల్లో ప్రధానంగా దోపిడీలు జరుగుతుండటం ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారింది. ► ఏడెన్ సింధుశాఖ: ఎర్ర సముద్రానికి గవాక్షమైన ఏడెన్ సింధుశాఖలో కూడా పైరేట్ల బెడద చాలా ఎక్కువ. సూయిజ్ కెనాల్‌కు దారితీసే ముఖ్యమైన వాణిజ్య మార్గంలో ఉన్న ప్రాంతమిది. భౌగోళికంగా సోమాలియాకు దగ్గరగా ఉండటంతో ఆ దేశపు పైరేట్లు ఇక్కడ బీభత్సం సృష్టిస్తున్నారు. ► గినియా సింధుశాఖ: వాయవ్య – దక్షిణ ఆఫ్రికా (అంగోలా)లో చాలా భాగం విస్తరించి ఉన్న గినియా సింధుశాఖ యూరప్ దేశాలు, అమెరికా దేశాలకు చమురు రవాణా చేసే చాలా ముఖ్యమైన మార్గం. దీంతో ఈ ప్రాంతం నుంచి ప్రయాణించే నౌకలపై పైరేట్ల ఆగడాలు పెరుగుతున్నాయి. ► బెనిన్: ఆఫ్రికాలోని బెనిన్ ప్రాంతం కూడా సముద్రపు దొంగల దాడుల ప్రమాదం ఎక్కువగా ఉండే జాబితాలో చేరింది. అంతర్జాతీయ సముద్రయాన సంస్థలు ఇక్కడ పైరసీని నిరోధించడానికి చర్యలు చేపడుతున్నా ఇంతవరకూ సానుకూల ఫలితాలు కనిపించలేదు. ► నైజీరియా: ఆఫ్రికా పశ్చిమ ప్రాంతాన గల నైజీరియాను.. సముద్రపు దొంగల దాడులకు మరో కేంద్రంగా పరిగణిస్తున్నారు. దీనిని సముద్ర వాణిజ్య రవాణాకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా జాబితాలో చేర్చారు. పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం నుంచి సరుకుల రవాణా చేయాలంటే.. ఆ సరుకులకు బీమా కవరేజీ చాలా ఎక్కువగా చేయించాల్సిన పరిస్థితి. ► సోమాలియా: సోమాలియాలో సముద్రపు దోపిడీలు అత్యధికం. ఈ దేశంలో అంతర్యుద్ధం, ప్రభుత్వ అసమర్థతల వల్ల ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతుండటంతో పాటు సోమాలియా సముద్ర జలాల్లో సముద్ర వ్యర్థాలు భారీ స్థాయిలో ఉండటం కూడా ఇక్కడ పైరసీ భారీగా ఉంటోంది. ఈ మార్గం గుండా ప్రయాణించే సరుకులకు బీమా చేయడానికి కూడా భారీ మొత్తం చెల్లించాల్సిందే. ► ఇండోనేసియా: ఇండోనేసియాలో కూడా పైరసీ అధికంగా ఉంది. అనాంబాస్, నాటునా, మెరుండుంగ్ తదితర దీవులను పైరేట్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక్కడ రాత్రి పూట దాడులు చేయడం ఎక్కువ. ► అరేబియా సముద్రం: అరేబియా సముద్రంలోని ఒమన్ సింధుశాఖ వద్ద పైరేట్ల తాకిడి ఎక్కువ. ఏడెన్ సింధుశాఖ, సోమాలీ తీరాలతో పోలిస్తే ఇక్కడ అంతర్జాతీయ సముద్ర సంస్థలు కల్పించే భద్రత తక్కువ కావడం కూడా దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు. ► హిందూ మహాసముద్రం: సోమాలియా పైరేట్లు హిందూ మహాసముద్ర జలాల్లో దాడులకు పాల్పడుతున్నారు. సరకు నౌకలకు ఇది ప్రధానమార్గం కావడంతో.. ముఖ్యంగా భారతదేశపు నౌకలు, ఈ ప్రాంతం నుంచి ప్రయాణించే ఇతర దేశాల నౌకలనూ లక్ష్యంగా చేసుకుంటున్నారు. -
భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన చైనా
-
భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన చైనా
న్యూఢిల్లీ: పాకిస్థాన్, భారత్ మధ్య ఎంత వైరం ఉంటుందో దాదాపు చైనాకు భారత్‌కు మధ్య కూడా అంతే ఉంటుంది. అయితే, అది మాత్రం పైకి కనిపించదు. సైనికపరమైన పోటీ కూడా భారత్, చైనా మధ్య ఎప్పుడూ ఉంటుంది. అలాంటి, భారత్, చైనాలు ఓ నౌకను కాపాడేందుకు కలిసి ముందుకుసాగాయి. బ్రిటన్‌కు చెందిన ఓ గూడ్స్ నౌకపై సముద్రపు దొంగలు దాడి చేయగా దాని నుంచి రక్షించాయి. చైనా నావికా దళం సమీపంలోనే ఈ దాడి జరిగినా ఆ దేశం కంటే ముందు భారత్ స్పందించి సహాయం చేసినందుకు చైనా ధన్యవాదాలు తెలిపింది. ఇరు దేశాల మధ్య సముద్ర జలాల్లో పరస్పర సంరక్షణ, సమన్వయం ఇలాగే ఎప్పటికీ ఉండాలని పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన మారిటైం ట్రేడ్ ఆర్గనైజేషన్(యూకేఎంటీవో) తువాలుకు చెందిన ఎంవీఓఎస్ 35 అనే 21,000 టన్నుల నౌకను పర్యవేక్షిస్తోంది. ఇది మలేషియాలోని కెలాంగ్ నుంచి పోర్ట్ ఆఫ్ ఏడేన్‌కు వెళుతోంది. ఆ సమయంలో ఈ నౌకపై సముద్రపు దొంగల దాడి జరిగినట్లు యూకేఎంటీంవో నుంచి భారత్‌కు చెందిన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ ముంబయి, ఐఎన్ఎస్ తర్కాష్‌లకు అప్రమత్తతో కూడిన సమాచారం వచ్చింది. అదే సముద్రంలో చైనా, ఇటాలియన్, పాకిస్తాన్‌కు చెందిన నౌకా దళాలు కూడా ఉన్నాయి. వారికి కూడా సముద్రపు దొంగల అలర్ట్ వెళ్లింది. అయితే, వాటికంటే ముందు స్పందించిన భారత నేవీ వెంటనే ఒక హెలికాప్టర్ నుంచి పంపించి రాత్రికి రాత్రే రక్షణగా నిలిచింది. అప్పటికే ఆ నౌకలోని కెప్టెన్, ఇతర సిబ్బంది తమ ప్రాణాలు రక్షించుకునేందుకు లోపలికి వెళ్లి తాళం వేసుకున్నారు. అయినప్పటికీ ఆ షిప్ కెప్టెన్‌తో సంప్రదింపులు జరిపి వారికేం భయం లేదని హామీ ఇచ్చింది. ఈ లోగా చైనాకు చెందిన 18మంది నౌకా దళ సైనికులు కూడా అక్కడి చేరుకొని ఆ నౌకకు రక్షణ కల్పించారు. అయితే, భారత్ ఆర్మీ హెలికాప్టర్‌ను పంపించిన వెంటనే అక్కడి సముద్రపు దొంగలు పారిపోయినట్లు తెలుస్తోంది. శీఘ్రంగా స్పందించిన భారత్‌కు ఈ సందర్భంగా చైనా కృతజ్ఞతలు తెలిపింది. -
పోలీసుల అడ్డాలో దొంగల హల్చల్
– ఎస్బీఐ కాలనీలో నాలుగు ఇళ్లలో చోరీ – మహిళా గ్యాంగ్ పనే – రూ.5లక్షలకు పైగా అపహరణ నంద్యాల: పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు ఎక్కువగా నివాసం ఉన్న ఎస్బీఐ కాలనీలో మహిళా దొంగల గ్యాంగ్ హల్చల్ చేసింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి బుధవారం పట్టపగలు నాలుగు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. దీంతో పోలీస్ యంత్రాంగం షాక్‌కు గురైంది. స్థానిక ఎస్బీఐ కాలనీలో పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు అధికంగా నివాసం ఉన్నారు. ఈ కాలనీలో పట్టపగలు కూడా జనసంచారం అంతంత మాత్రమే. దీంతో మొహానికి ముసుగు ధరించిన ఇద్దరు మహిళలు, పదేళ్ల బాలుడు ఇల్లు అద్దెకు కావాలని కాలనీలో తిరిగారు. పీజీ కాలేజీ హాస్టల్ వద్ద ఉన్న ఎస్బీఐ ఉద్యోగి విజయ్‌కుమార్ ఇంట్లోకి వెళ్లి, తాళం తొలగించి, లోపలికి ప్రవేశించి ఇంట్లోని దాదాపు 25వేల నగదు, సెల్ఫోన్లు, రెండు జతల కమ్మలు కాజేశారు. తర్వాత సమీపంలోని మూడు అంతస్థుల భవనం వద్దకు వెళ్లి ఇల్లు అద్దెకు కావాలని విచారించారు. మొదటి అంతస్తులోకి వెళ్లి మహారాష్ట్ర ఎరువుల కంపెనీ ఉద్యోగి గోమాసరోజ్ పిషల్ ఇంటి గొళ్లెం తగిలించి లోపలికి జొరబడ్డాడు. ఇంట్లో ఉన్న రూ.1.50లక్షల విలువ చేసే ఆరు తులాల బంగారు ఆభరణాలను కాజేశారు. పక్కనే ఉన్న టీచర్ నిర్మల ఇంటి తాళాలు కూడా తొలగించి ఇంట్లోని రూ.40వేల నగదు, రెండు జతల కమ్మలు, ఒకచైన్, పాపిడి బిళ్ల, నాలుగు ఉంగరాలను కాజేశారు. తర్వాత సమీపంలో మరో ఇంట్లో దొంగతనానికి విఫలయత్నం చేశారు. పోలీసులకు షాక్.. ఎస్బీఐ కాలనీలో గతంలో చైన్‌స్నాచింగ్‌లు పెరిగాయి. అయితే రెండేళ్ల నుంచి ఎలాంటి దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు లేవు. ఈ ప్రాంతంలో సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కొందరు నివాసం ఉండటంతో స్థానికులు ధైర్యంగా ఉండేవారు. కాని మహిళల గ్యాంగ్ ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీకి యత్నించడంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు. హుటాహుటినా క్లూస్‌టీంను, జాగిలాన్ని రప్పించి వివరాలను సేకరించారు. అనంతపురం, చిత్తూరు, ప్రాంతాలకు చెందిన పోలీస్ స్టేషన్లోకి కూడా సమాచారాన్ని అందించి వివరాలను సేకరిస్తున్నారు. స్థానికుల ప్రమేయంతోనే ఈ చోరీలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటికి వచ్చేసరికి ఖాళీ బీరువాలు కనిపించాయి: సుశీల, బాధితురాలు ఉద్యోగ రీత్యా నా భర్త విజయ్‌కుమార్ బనగానపల్లెకు, నేను ఎస్సార్బీసీ కార్యాలయానికి ఉదయమే వెళ్లాం. సాయంత్రం వచ్చేసరికి తాళాలు తెరిచి ఉన్నాయి. పరిశీలించగా ఇంట్లోని నగదు, సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయి. క్లూ దొరికింది: గుణశేఖర్‌బాబు, సీఐ ఇద్దరు ముసుగు ధరించిన మహిళలు చోరీకి పాల్పడినట్లు క్లూ దొరికింది. స్థానికుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి. -
దేవరకొండలో దొంగల బీభత్సం
దేవరకొండ(నల్లగొండ): నల్లగొండ జిల్లా దేవరకొండలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని బీఎన్ఆర్ కాలనీ, హనుమాన్‌నగర్‌లో శుక్రవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. బీఎన్ ఆర్ కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రూ. 1.70 లక్షల నగలు ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచి ఉంచుకున్న 6 తులాల బంగారు ఆభరణాలు దొంగలించుకెళ్లారు. హనుమాన్‌నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి బీరువా ఎత్తుకెళ్లి.. సమీప అటవీ ప్రాంతంలో దాన్ని పగలగొట్టి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దోపిడీకి దొంగల విఫలయత్నం
నర్సంపేట : పట్టణంలోని సిద్దార్థ నగర్ కాలనీకి చెందిన అర్శనపల్లి మాధవరావు ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. అర్శనపల్లి మాధవరావు కుటుం బ సభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి ఇంటికి 10 రోజుల క్రితం వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపులను పగులగొట్టి బెడ్రూం డోర్లు తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉండడంతో డోర్లు తెరుచుకోలేదు. పనిమనిషి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి చూడగా డోర్లు తెరిచి ఉండడంతో చుట్టుపక్కల వారికి తెలిపింది. కాలనీ ప్రజలు హైదరాబాద్‌లో ఉన్న మాధవరావుకు సమాచారమివ్వడంతో ఇంటికి చేరుకున్నారు. టౌ¯ŒS సీఐ జా¯ŒSదివాకర్, ఎస్సై రాజువర్మ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలను సేకరించారు. అనంతరం డాగ్‌స్కాడ్ బృందం కూడా విచారణ చేయగా వివరాలు లభించలేదు. సీఐ చు ట్టు పక్కల కాలనీల్లో అద్దెకు ఉంటున్న విద్యార్థుల గదుల్లో తనిఖీలు చేపట్టి అనుమానితులను వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళితే ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస చోరీ ఘటనల నేపథ్యంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
బైంసాలో నలుగురు దొంగల అరెస్ట్
బైంసాలో నలుగురు బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి 18 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్, బైంసా, కరీంనగర్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వీళ్లు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిలో ఓ బాలనేరస్తుడు కూడా ఉన్నాడు. మీడియా ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
సముద్రపు దొంగలు విరుచుకుపడ్డారు
అంకారా: సముద్రపు దొంగలు విరుచుపడ్డారు. టర్కీకి చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై తెగబడ్డారు. నైజీరియా కోస్తా తీరంలో పులి అనే ఆయిల్ ట్యాంకర్‌తో ఉన్న నౌకను నిలిపి ఉంచగా అనూహ్యంగా పెద్ద గుంపుగా వచ్చి దాడి చేసి అందులోని కెప్టెన్‌ను, ఆరుగురు సిబ్బందిని ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టర్కీకి చెందిన కాప్టానోగ్లూ అనే షిప్పింగ్ కంపెనీకి చెందిన ఆయిల్ ట్యాంకర్ గల నౌకపై పైరేట్స్ దొంగతనానికి పాల్పడ్డారు. మాల్టా జెండాతో ఉన్న ఈ పులి ఆయిల్ ట్యాంకర్ ఐవరీ తీరంలోని అబిద్ జాన్, గాబన్ ప్రాంతాల నుంచి ఈ నౌక నైజీరియా వైపునుంచి వస్తుండగా ఈ దాడి జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
పీర్ల పండుగకు వెళ్తే కొల్లగొట్టారు
అనంతపురం క్రైం: స్వగ్రామంలో జరిగిన పీర్ల పండుగకు వెళ్లిన కొత్తకోట సర్పంచ్ నాగమణి ఇంట్లో దొంగలు పడి ఇంటిని కొల్లగొట్టారు. బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు... కొత్తకోట సర్పంచ్ నాగమణి, భర్త కేశవ్‌తో కలిసి స్థానిక ఆదిమూర్తినగర్‌లో లిటిల్‌ఫ్లవర్ స్కూల్ సమీపంలో నివాసముంటున్నారు. కేశవ్ నగరంలో కృష్ణ జీన్స్ నిర్వహిస్తున్నారు. పీర్ల పండుగ కావడంతో ఈనెల 15న సొంతూరు కొత్తకోటకు కుటుంబ సమేతంగా వెళ్లారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఇంటికొచ్చారు. ఇంటి తాళం తీయడానికి ప్రయత్నిస్తే గడియ పెకిలించి ఉంది. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో రెండు బీరువాలు ఉన్నాయి. దొంగలు ఒక బీరువా గడియను మెడ్డాయించి తలుపులు తెరిచారు. అందులో ఉన్న 8.20 తులాల బంగారం, రూ.10.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. మరో బీరువాలో డబ్బులున్నా దానిజోలికి వెళ్లలేదని బాధితులు వివరించారు. దొంగతనం ఎప్పుడు జరిగిందనేది అంతుచిక్కవడం లేదు. ఈ ప్రాంతం చాలా ప్రశాతంగా ఉంటుంది. గడియ పెకిలించే క్రమంలో చిన్నశబ్దం వచ్చినా చుట్టుపక్కల వారికి తెలిసే అవకాశం ఉంది. పక్కా ప్లాన్‌తో గడియ మెడ్డాయించి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు అర్థమవుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసి పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సోమశేఖర్‌రెడ్డి వచ్చి ఇంటిని పరిశీలించి బాధితులను పరామర్శించారు. -
దొంగలు దొరికారు..
రూ. 18 లక్షల విలువైన 61.6 తులాల బంగారం స్వాధీనం అనంతపురం క్రైం : అనంతపురం వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ ఆధ్వర్యంలో నలుగురు దొంగలను పట్టుకున్నారు. వీరినుంచి రూ. 18 లక్షలు విలువ చేసే 61.6 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ రాజశేఖర్‌బాబు శనివారం వన్‌టౌన్ పోలీస్‌స్టేసన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురం నగరం బుడ్డప్పనగర్‌కు చెందిన షికారి సద్‌సింగ్ అలియాస్ శీనా, నీరు షికారి అర్జున్, నీరు షికారి రామకృష్ణతో పాటు కదిరి పట్టణానికి చెందిన షేక్ అహ్మద్ అలియాస్ టీపాను అరెస్టు చేశారు. వీరిలో సద్‌సింగ్, అర్జున్, రామకృష్ణ ఒక గ్యాంగ్. వీరు ముగ్గురు స్వయానా బంధువులతో పాటు స్నేహితులు. తాగుడు, జూదం అలవాట్లకు మరిగిన వీరు దొంగతనాలకు ఎంచుకున్నారు. ఉదయం పూట తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తుంచుకుని రాత్రిపూట తాళాలు పగులకొట్టి ఆ ఇళ్లలో దొంగతనాలు చేసేవారు. ఎస్బీఐ కాలనీ, హౌసింగ్‌బోర్డుకాలనీ, హమాలీకాలనీ, వినాయకనగర్, నీరుగంటివీధి, అశోక్‌నగర్, కల్పనాజోష్కాలనీ, నవోదయకాలనీ, మరువకొమ్మకాలనీ, తారకరామాకాలనీల్లో ఈ ముటా గత రెండేళ్లలో 13 చోరీలకు పాల్పడింది. మరో నిందితుడు షేక్ అహ్మద్ కదిరి ప్రాంతంలో చిన్నచిన్న దొంగతనాలు చేశాడు. గతనెల 22న హౌసింగ్‌బోర్డుకాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దూరి దొంగతనం చేశాడు. ఒక పోలీసు ఒక దొంగను పట్టుకోవాలనే నినాదంతో జిల్లా పోలీసులు ముందుకెళ్తున్నారు. దొంగతనాలపై నిఘా పెంచారు. ఈ క్రమంలో అదనపు ఎస్పీ కే. మాల్యాద్రి పర్యవేక్షణలో అనంతపురం డీఎస్పీ నాగరాజ ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ గోరంట్లమాధవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా విడిపోయి దొంగలపై కన్నేశారు. ఈ క్రమంలో శనివారం నలుగురు దొంగల్లో ముగ్గురిని బీరప్పగుడి సమీపంలో, మరొక దొంగ షేక్ అహ్మద్‌ను కలెక్టర్ కార్యాలయం ఎదుట పట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వె ళ్లే సందర్భాల్లో ప్రజలు సంబంధిత పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఎస్పీ కోరారు. -
రెండిళ్లలో చోరీ
22 తులాల బంగారం, నగదు అపహరణ సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు అంతర్రాష్ట్ర ముఠా పనేనా...? నాగోలు: దొంగలు వరుసగా రెండిళ్ల తాళాలు పగులగొట్టి 22 తులాల బంగారు ఆభరణాలు, రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఎల్బీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఆర్కేపురం హరిపురికాలనీ రోడ్ నెం-2లో నివాసముండే బిల్డర్ ఎస్కే బాషా ఆదివారం తన ఇంటికి తాళం వేసి మియాపూర్ వెళ్లాడు. బాషా ఇంటి మొదటి అంతస్తులో తోటపల్లి శ్రీకాంత్, హరిత దంపతులు అద్దెకుంటూ అదే కాలనీలో కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఇంట్లో పూజ ఉండటంతో హరిత ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా వెళ్లారు. ఆరుగురు దొంగల పక్కింట్లో నుంచి లోపలికి ప్రవేశించి బాషా కార్యాలయ తాళాన్ని పగులగొట్టి అందులో ఉన్న కేబుల్ సెటప్‌బాక్స్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. తర్వాత శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లి.. బీరువా తాళం పగులగొట్టి బీరువాలోని 12 తులాల బంగారు నగలు, రూ.10 వేల నగదు అపహరించారు. సోమవారం ఇంటికి వచ్చిన శ్రీకాంత్ చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే కాలనీలోని ఫ్లాట్ నెం-17లో విశాఖపట్నానికి చెందిన వ్యాపారి వేగరాజు సత్యనారాయణ కుటుంబం ఉంటోంది. ప్రస్తుతం సత్యనారాయణ విశాఖలో ఉండగా, ఇంట్లో భార్య సునీత, కొడుకు ఆదిత్య ఉంటున్నారు. సునీతకు ఆరోగ్యం బాగోకపోవడంతో శనివారం విజయవాడకు వెళ్లింది. కుమారుడు ఆదిత్య ఆదివారం ఇంటికి తాళం వేసి స్నేహితుల వద్దకు వెళ్లాడు. తాళం పగులగొట్టి వీరింట్లోకి చొరబడ్డ దొంగలు పెంపుడు కుక్కకు మత్తు బిసెట్లు పెట్టి స్పహకోల్పోయేలా చేశారు. తర్వాత బీరువాలో ఉన్న 10 తులాల బంగారు నగలు, రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన ఆదిత్య చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు.. ఇంటి యజమాని బాషా తన ఇంటికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన విధానం మొత్తం రికార్డు అయింది. ఆరుగురు సభ్యుల ముఠా పదునైన ఆయుధాలు, ఇనుప రాడ్లు, టార్చ్లైట్లు, ఇతర సామగ్రితో ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడింది. అయితే, అక్కడే ఉన్న మరో సీసీ కెమెరాను గమనించిన దొంగలు దానిని తొలగించారు. ఎల్బీనగర్ సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, మురళీకృష్ణ ఘటనా చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీను స్వాధీనం చేసుకొని.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడింది కరుగట్టిన ముఠా కావచ్చని స్థానికులంటున్నారు. హిందీ పేపర్ లభ్యం.. హరిపురికాలనీ రోడ్ నెం-2లో ఇళ్లు చివరిగా ఉండటంతో పాటు ఇళ్ల పక్కన ఎక్కువగా ఖాళీ స్థలాలున్నాయి. దొంగలు మొదటగా రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివయ్య ఇంట్లోకి ప్రవేశించారు. వారు ఇంట్లో ఉండటంతో అక్కడే సిగరెట్లు తాగి నాగ్‌పూర్‌కు చెందిన ఓ హిందీ న్యూస్ పేపర్‌ను అక్కడే పడేసి గోడదూకి బయటకు వచ్చారు. పక్కనే ఉన్న బాషా, శ్రీకాంత్, సత్యనారాయణ ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో ఆ ఇళ్లో చోరీకి తెగబడ్డారు. చోరీకి పాల్పడిన ముఠా మన రాష్ట్రానికి చెందిందా? లేక పోలీసుల దృష్టి మరలించేందుకు హిందీ పేపర్‌ను ఘటనా స్థలంలో వదిలేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్, ఎల్బీనగర్ సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, మురళీకృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. -
మరో ముగ్గురు ‘ఎర్ర’ దొంగల అరెస్టు
చిత్తూరు (అర్బన్) : చిత్తూరులో ‘ఎర్ర’దొంగలను పోలీసులు వరసపెట్టి అరెస్టు చేస్తున్నారు. అరెస్టుల జాబితాలో సోమవారం మరో ముగ్గురు చేరారు. వీరి నుంచి ఫార్చునర్, ఐషర్ కార్లతో పాటు 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, ఓఎస్డీ రత్న నిందితులను అరెస్టు చూపించి వారి నేర చరిత్రను విలేకరుల సమావేశంలో వివరించారు... శామ్యూలు ... ఆయిల్ వ్యాపారం నుంచి... మిజోరం రాష్ట్రానికి చెందిన శామ్యూల్ (40) విద్యావంతుడు. ఎంఏ ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడు. ఐజ్వాల్ సమీపంలోని బాంగ్వా ఇతని స్వస్థలం. 2002వరకు కేకే ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ అనుమతితో ఇడిబుల్ ఆయిల్, ఎలక్ట్రికల్ గూడ్స్, కంప్యూటర్ పరికరాల వ్యాపారం, 2011 నుంచి కేకే పేరిట పాల డెయిరీ ప్రారంభించి పాలు, నెయ్యి పాకెట్లను దుకాణాలకు సరఫరా చేసేవాడు. అదే ఏడాది ఐజ్వాల్‌లో ఎర్రచందనం వ్యాపారం చేసే ఎల్ఫియాతో పరిచయం పెంచుకున్నాడు. అతని ద్వారా చెన్నైకు చెందిన నాగరాజు, వేలు, సెంథిల్ కుమార్, జాఫర్, అయ్యప్పన్ ద్వారా ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాడు. ఎర్ర చందనం దుంగలను దుబాయ్, సింగపూర్, హాంకాంగ్, చైనా, బర్మాలకు అమ్మేవాడు. ఇలా ఇప్పటి వరకు 50 టన్నుల ఎర్ర దుంగలను విక్రయించాడు. ఇతని నెలసరి సంపాదన రూ.20 లక్షలు. సింగారవేలు ... గోనెసంచుల అమ్మకం నుంచి... చెన్నైకు చెందిన సింగారవేలు అలియాస్ మారియప్పన్ గురుస్వామి (59) పుట్టింది బర్మాలో. అక్కడే ఆరో తరగతి వరకు చదివాడు. గోనెసంచుల వ్యాపారం చేసేవాడు. 40 ఏళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి చెన్నైకు వచ్చి స్థిరపడ్డాడు. 1987లో చెన్నైలోని ఓ టెక్స్టైల్స్ దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేసేవాడు. చెన్నైకు చెందిన షణ్ముగం, సుగంధి టాల్క్ సంస్థ భాగస్వాములు ధర్మరాజు, డేవిడ్‌తో కలిసి శ్రీగంధం వ్యాపారం చేశాడు. 2002లో వైఎస్సార్ జిల్లాకు చెందిన అలంకార్తో కలిసి 50 టన్నుల ఎర్రచందనం దుంగలను 5 లారీల్లో ముంబైకు చెందిన జైన్‌కు విక్రయించాడు. చిత్తూరు నగరానికి చెందిన అన్సర్బాయ్ ద్వారా ఆరు టన్నులను జైన్‌కు అమ్మాడు. 2012లో కోల్‌కత్తాకు చెందిన లక్ష్మణ్ ద్వారా 30 టన్నుల ఎర్రచందనాన్ని ఢిల్లీలోని స్మగ్లర్లకు అమ్మాడు. చిత్తూరుకు చెందిన కిషోర్, గోపి, డాబా శీనుతో కలిసి 100 టన్నుల ఎర్రదుంగల్ని ఢిల్లీకి చెందిన విక్రమ్‌కు విక్రయించాడు. నాగరాజు ... చీపుర్ల అమ్మకం నుంచి... మణిపూర్ రాష్ట్రంలోని మోరెకు చెందిన నాగరాజు(38) చీపురు కట్టల వ్యాపారిగా వ్యాపారం ప్రారంభించాడు. తల్లిదండ్రులతో కలిసి చెన్నైలో స్థిరపడ్డాడు. డిగ్రీ పూర్తిచేసి తొలుత ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2009లో బర్మా, చైనా దేశాల నుంచి చీపుర్లు, క్లీనింగ్ మెటీరియల్స్ చెన్నైకు దిగుమతి చేసుకుని దుకాణాలకు అమ్మేవాడు. 2011లో మిజోరంలో ఉన్న ఎల్ఫీయాతో పరిచయం ఏర్పడింది. చెన్నైకు చెందిన సెంథిల్, వేలు, అయ్యప్పన్, జాఫర్‌తో కలిసి చైనా, సింగపూర్, హాంకాంగ్, బర్మా, దుబాయ్‌కు ఎర్రచందనం విక్రయించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు సుమారు 100 టన్నుల ఎర్రచందనం విదేశాలకు ఎగుమతి చేశాడు. నెలకు రూ.15 లక్షల వరకు సంపాదించేవాడు. -
ఎస్బీఐలో దోపిడీకి యత్నం
తాళాలు పగులగొట్టి స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లిన దొంగ నగదు, బంగారం భద్రం వడ్డాది (బుచ్చెయ్యపేట), న్యూస్‌లైన్: బుచ్చెయ్యపేట మండలం పంచాయతీ వడ్డాది నాలుగురోడ్ల జంక్షన్లో ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శనివారం తెల్లవారుజామున దొంగలు చొరబడి దోపిడీకి యత్నించారు. దొంగలు బయట తాళాలతోబాటు లోపల స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించినా నగదు, ఆభరణాలు తీసుకెళ్లలేకపోయారు. శనివారం తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో స్టేట్‌బ్యాంక్ వెనుక గేటు బద్దలుకొట్టి కిటికీలోంచి దొంగలు ప్రవేశించి స్ట్రాంగ్‌రూమ్ తాళాలు పగులగొట్టారు. స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళ్లిన వెంటనే అలారం మోగడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అదే సమయంలో స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లిన వ్యక్తికి ఫోన్ రావడంతో దొంగ పరారైనట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. ముగ్గురు నలుగురు వ్యక్తులు ఈ దోపిడీకి ప్రయత్నించి ఉంటారని, లోపలకు వెళ్లిన వ్యక్తికి ఫోన్ ద్వారా బయట సమాచారం చేరవేసి దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరా ఆధారంగా తెలుస్తోంది. లోపలకు వెళ్లిన వ్యక్తి ముఖానికి ముసుగు ఉన్నట్లు సీసీ కెమెరా ద్వారా గుర్తించి, దొంగ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. చోడవరం సీఐ ఎ.విశ్వేశ్వరరావు, ఏఎస్ఐ అప్పారావు, హెచ్‌సీ సన్యాసిరావు, తదితరులు బ్యాంకును పరిశీలించారు. దొంగలు విడిచిపెట్టి వెళ్లిన గునపాం, పగులగొట్టిన తాళం కప్పలు, చెప్పులను స్వాధీనం చేసుకొని క్లూస్‌టీమ్ ద్వారా వేలిముద్రలు సేకరించి విచారణ చేస్తున్నారు. బ్యాంకు మేనేజర్ జోసెఫ్ రాజ్‌ను పోలీసులు విచారిస్తున్నారు.