చిత్తూరు (అర్బన్) : చిత్తూరులో ‘ఎర్ర’దొంగలను పోలీసులు వరసపెట్టి అరెస్టు చేస్తున్నారు. అరెస్టుల జాబితాలో సోమవారం మరో ముగ్గురు చేరారు. వీరి నుంచి ఫార్చునర్, ఐషర్ కార్లతో పాటు 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, ఓఎస్డీ రత్న నిందితులను అరెస్టు చూపించి వారి నేర చరిత్రను విలేకరుల సమావేశంలో వివరించారు...
శామ్యూలు ... ఆయిల్ వ్యాపారం నుంచి...
మిజోరం రాష్ట్రానికి చెందిన శామ్యూల్ (40) విద్యావంతుడు. ఎంఏ ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడు. ఐజ్వాల్ సమీపంలోని బాంగ్వా ఇతని స్వస్థలం. 2002వరకు కేకే ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ అనుమతితో ఇడిబుల్ ఆయిల్, ఎలక్ట్రికల్ గూడ్స్, కంప్యూటర్ పరికరాల వ్యాపారం, 2011 నుంచి కేకే పేరిట పాల డెయిరీ ప్రారంభించి పాలు, నెయ్యి పాకెట్లను దుకాణాలకు సరఫరా చేసేవాడు.
అదే ఏడాది ఐజ్వాల్‌లో ఎర్రచందనం వ్యాపారం చేసే ఎల్ఫియాతో పరిచయం పెంచుకున్నాడు. అతని ద్వారా చెన్నైకు చెందిన నాగరాజు, వేలు, సెంథిల్ కుమార్, జాఫర్, అయ్యప్పన్ ద్వారా ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాడు. ఎర్ర చందనం దుంగలను దుబాయ్, సింగపూర్, హాంకాంగ్, చైనా, బర్మాలకు అమ్మేవాడు. ఇలా ఇప్పటి వరకు 50 టన్నుల ఎర్ర దుంగలను విక్రయించాడు. ఇతని నెలసరి సంపాదన రూ.20 లక్షలు.
సింగారవేలు ... గోనెసంచుల అమ్మకం నుంచి...
చెన్నైకు చెందిన సింగారవేలు అలియాస్ మారియప్పన్ గురుస్వామి (59) పుట్టింది బర్మాలో. అక్కడే ఆరో తరగతి వరకు చదివాడు. గోనెసంచుల వ్యాపారం చేసేవాడు. 40 ఏళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి చెన్నైకు వచ్చి స్థిరపడ్డాడు. 1987లో చెన్నైలోని ఓ టెక్స్‌టైల్స్ దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేసేవాడు. చెన్నైకు చెందిన షణ్ముగం, సుగంధి టాల్క్ సంస్థ భాగస్వాములు ధర్మరాజు, డేవిడ్‌తో కలిసి శ్రీగంధం వ్యాపారం చేశాడు.
2002లో వైఎస్సార్ జిల్లాకు చెందిన అలంకార్‌తో కలిసి 50 టన్నుల ఎర్రచందనం దుంగలను 5 లారీల్లో ముంబైకు చెందిన జైన్‌కు విక్రయించాడు. చిత్తూరు నగరానికి చెందిన అన్సర్‌బాయ్ ద్వారా ఆరు టన్నులను జైన్‌కు అమ్మాడు. 2012లో కోల్‌కత్తాకు చెందిన లక్ష్మణ్ ద్వారా 30 టన్నుల ఎర్రచందనాన్ని ఢిల్లీలోని స్మగ్లర్లకు అమ్మాడు. చిత్తూరుకు చెందిన కిషోర్, గోపి, డాబా శీనుతో కలిసి 100 టన్నుల ఎర్రదుంగల్ని ఢిల్లీకి చెందిన విక్రమ్‌కు విక్రయించాడు.
నాగరాజు ... చీపుర్ల అమ్మకం నుంచి...
మణిపూర్ రాష్ట్రంలోని మోరెకు చెందిన నాగరాజు(38) చీపురు కట్టల వ్యాపారిగా వ్యాపారం ప్రారంభించాడు. తల్లిదండ్రులతో కలిసి చెన్నైలో స్థిరపడ్డాడు. డిగ్రీ పూర్తిచేసి తొలుత ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2009లో బర్మా, చైనా దేశాల నుంచి చీపుర్లు, క్లీనింగ్ మెటీరియల్స్ చెన్నైకు దిగుమతి చేసుకుని దుకాణాలకు అమ్మేవాడు. 2011లో మిజోరంలో ఉన్న ఎల్ఫీయాతో పరిచయం ఏర్పడింది. చెన్నైకు చెందిన సెంథిల్, వేలు, అయ్యప్పన్, జాఫర్‌తో కలిసి చైనా, సింగపూర్, హాంకాంగ్, బర్మా, దుబాయ్‌కు ఎర్రచందనం విక్రయించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు సుమారు 100 టన్నుల ఎర్రచందనం విదేశాలకు ఎగుమతి చేశాడు. నెలకు రూ.15 లక్షల వరకు సంపాదించేవాడు.
మరో ముగ్గురు ‘ఎర్ర’ దొంగల అరెస్టు
Published Tue, Jul 22 2014 4:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement