నీరసించిన ‘నాల్గో సింహాలు’ | police lazy in anantapur | Sakshi
Sakshi News home page

నీరసించిన ‘నాల్గో సింహాలు’

Published Sat, Jun 10 2017 11:09 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

నీరసించిన ‘నాల్గో సింహాలు’ - Sakshi

నీరసించిన ‘నాల్గో సింహాలు’

- అదుపు తప్పుతున్న శాంతిభద్రతలు
- రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు
- ఖాకీలనూ ఖాతరు చేయని వైనం
- దూషించినా, దాడి చేసినా ఏమీ అనలేని పరిస్థితి
- మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్లు తలాడిస్తున్న ‘పోలీస్‌ పెద్దలు’

 
అసాంఘిక, చట్టవ్యతిరేక శక్తులపై పంజా విసరాల్సిన ‘నాల్గో సింహాలు’ నీరసించిపోయాయి. కొన్ని గుంట నక్కలు చెప్పినట్లు తలాడిస్తున్నాయి. అయినప్పటికీ ‘వనరాజు’ మౌనంగానే ఉంటున్నారు. ‘వ్యవస్థను గాడిలో పెట్టాను. అది అలా నడుస్తూ ఉంటుంద’ని అనుకుంటున్నట్లున్నారు. ‘వనరాజు’ నెమ్మదించడంతో ‘కొన్ని సింహాలు’ వేటాడడం మర్చిపోయాయి. కొందరు ఆడించినట్లు ఆడుతున్నాయి.

(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
ఇటీవల అనంతపురం బైపాస్‌రోడ్డు పక్కన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి టెంటు వేసి విపక్ష నేతను తీవ్రపదజాలంతో దూషించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలోనే, అదీ డీఎస్పీ మల్లికార్జున వర్మ ఎదుటే టెంటు వేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి డీఎస్పీ ముందే కారు దిగి అక్కడికి వచ్చారు. ఆయన ఎదుటే విపక్షనేతను దుర్భాషలాడారు. అయినప్పటికీ డీఎస్పీ ప్రేక్షకపాత్ర పోషించారు. ఎమ్మెల్యే అనుకున్న పని పూర్తి చేశాక ఆయన వద్దకెళ్లి ఇక వెళ్లిపోవాలంటూ వినయంగా కోరారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్న తనను పోలీసులు అడ్డుకుంటారనే భయం కానీ, డీఎస్పీ పక్కనే ఉన్నారనే కనీస గౌరవం కానీ లేకుండా ఎమ్మెల్యే ప్రవర్తించినా చర్యలు తీసుకోలేదు. అలాగే శుక్రవారం పుట్టపర్తి ఎయిర్‌పోర్టులోకి తనను అనుమతించలేదంటూ మునిసిపల్‌ చైర్మన్‌ గంగన్న ఎయిర్‌పోర్టు ముందు బైఠాయించారు.

సీఐ, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. ఆయనపైనా ఎలాంటి చర్యలూ లేవు. దీన్నిబట్టి పోలీసువ్యవస్థ ఎటు వెళుతోందో? పోలీసులపై నేతలకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఉన్నతాధికారులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డిపైన, గంగన్నపైన కేసు నమోదు చేశామని చెప్పవచ్చు గానీ.. పోలీసులంటే వారికి ఏమాత్రమూ గౌరవం లేదనే విషయంపై అధికారులు దృష్టి సారించలేదు. ఈ రెండు ఘటనల్లోనూ పోలీసుశాఖ పరువు మంటగలిసిందనే కోణంలో వారు ఆలోచించి ఉంటే వారిద్దరిపైనా చర్యలు మరోలా ఉండేవి.

స్వయంకృతాపరాధం!
    కొందరు పోలీసుల వ్యవహారశైలి కారణంగానే అధికారపార్టీ నేతలు రెచ్చిపోతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. పనితీరుతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికి కోరుకున్న చోట  పోస్టింగులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో సీఐలు, ఎస్‌ఐలు కూడా వారికి మద్దతు పలికిన నేతలనే ‘సుప్రీం’లుగా భావిస్తూ.. డీఎస్పీలు, ఎస్పీతో తమకు పనిలేదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇటీవల నియమితులైన గుంతకల్లు అర్బన్‌ సీఐ రాజాగౌడ్, గుత్తి సీఐ ప్రభాకర్‌గౌడ్‌లకు కూడా ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ సిఫార్సులతోనే అక్కడ పోస్టింగులు వచ్చినట్లు ఎమ్మెల్యే సన్నిహితులతో పాటు కొందరు పోలీసులు కూడా చెబుతున్నారు. ఇలా చాలాచోట్ల ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి పోస్టింగులు ఇచ్చారు. దీంతో అధికారపార్టీ నేతలు ఏది చెబితే అక్కడి పోలీసులు అలా చేసే పరిస్థితి ఏర్పడింది.

పాదయాత్ర వ్యవహారంలోనూ విమర్శలు
శింగనమల నియోజకవర్గంలో ఇటీవల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మేలుకొలుపు పాదయాత్ర చేశారు. దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఎమ్మెల్సీ శమంతకమణి, ప్రభుత్వ విప్‌ యామినీబాల ఆ యాత్రను ఆపేయించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. లైసెన్స్‌డ్‌ తుపాకీ మిస్‌ఫైర్‌ అయిన ఘటనను ఆసరాగా తీసుకుని పోలీసులు కూడా మేలుకొలుపును ఆపేందుకు యత్నించారు. మైకులు అమర్చుకునేందుకు, పల్లెల్లో ప్రజలతో మాట్లాడేందుకు అనుమతించలేదు. అధికార పార్టీ నేతలను సంతృప్తి పరిచేందుకే ఇలా చేశారని విపక్షనేతలు గార్లదిన్నె సభలో పోలీసులపై మండిపడ్డారు. గన్‌మెన్ల తొలగింపులోనూ ఇదే ధోరణి ప్రదర్శించారు. గతంలో జేసీ బ్రదర్స్‌ ఒత్తిడితో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి గన్‌మెన్లను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య తర్వాత తిరిగి ఇచ్చారు.

మట్కా, పేకాటకు అండ
తాడిపత్రిలో మట్కా, పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌ ఎవరు నిర్వహిస్తున్నారో అక్కడి పోలీసులకు క్షుణ్ణంగా తెలుసని, పీఏబీఆర్‌ వద్ద పేకాట పరిస్థితీ అంతేనని, నిర్వాహుకులు, పోలీసుల మధ్య ఉన్న సత్సంబంధాలతోనే ఇవి యథేచ్ఛగా సాగుతున్నాయన్న  ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్లకు వచ్చే సామాన్యులకు న్యాయం చేయడంలోనూ కొందరు పోలీసులు రాజకీయ నాయకులు చెప్పినట్లే వింటున్నారు. ఇద్దరు కన్నకూతుళ్లను తనకు దూరంగా తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్నారని 2015లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చివరి కూతురిని కూడా తనకు అప్పగించకుండా తండ్రి వద్దకే పంపారని ఆ తల్లి బోరున విలపిస్తోంది. ఓ కీలక రాజకీయ నాయకుడి అండతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

అనంతపురం, ధర్మవరం, పెనుకొండలో కొందరు ‘మిడిల్‌ బాస్‌’లు అంతా తామై నడిపిస్తున్నారు. పంచాయితీలు, సెటిల్‌మెంట్లు వీరివద్ద జోరుగా నడుస్తున్నట్లు సమాచారం. ఈ పంచాయితీల్లో కూడా అధికార పార్టీ నేతల సిఫార్సులకే పెద్దపీట వేస్తున్నారు. జిల్లాలో పోలీసు వ్యవస్థ సరిగా నడవడం లేదని, పోలీసుబాసు ఇప్పటికైనా ప్రక్షాళన దిశగా దృష్టి సారించకపోతే రాప్తాడు, రుద్రంపేట హత్యల తరహా ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పోలీసుస్టేషన్లలో అధికార పార్టీ నేతల సిఫార్సులు మినహా సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement