గౌతంరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ సీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ట్రేడ్ యూనియన్ నాయకుడు పి.గౌతంరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులను మొహరించారు. దివంగత వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై వంగవీటి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణపురంలోని ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డిపై సెక్షన్ 153ఏ కింద విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు గానూ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో ఆయనపై కేసు పెట్టారు.
గౌతంరెడ్డి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత వంగవీటి రంగా, ఆయన సోదరుడు రాధాకృష్ణలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. గౌతంరెడ్డి వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండించి, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, తన తండ్రిపై గౌతంరెడ్డి వ్యాఖ్యలకు ఖండనగా ప్రెస్‌మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన వంగవీటి రాధాకృష్ణను ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు.