ఈ దాష్టీకం ఇంకెంత కాలం..?
– ఆక్వా పార్క్‌ను వ్యతిరేకిస్తున్న వారిపై కొనసాగుతున్న వేధింపులు
– సెక్షన్ 144 ఎత్తివేతపై మీనమేషాలు
– ప్రభుత్వ ఒత్తిడితోనే కొనసాగుతున్న పోలీస్ క్యాంపులు
– ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు విపక్షాల యోచన
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ఈ వేధింపులు ఎంతకాలం. మమ్మల్ని భయపెట్టి ఫ్యాక్టరీ కట్టినా ఆ తర్వాత నిర్వహించగలరా? పోలీసుల మోహరింపుతో ఎంతకాలం ఈ ఫ్యాక్టరీ పనిచేస్తుంది..... ఇది స్థానిక గ్రామాల ప్రజల వాదన. దీనికి ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కరువైంది. తమను పోలీసులు వేధిస్తున్నా, అక్రమ కేసులు పెట్టి లోపల వేస్తున్నా తమకు అండగా నిలబడని అధికార పక్షంపై స్థానిక ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చిన నేతలు తమకు ఇబ్బంది కలిగిన సమయంలో తమకు అండగా నిలబడకుండా ముఖ్యమంత్రికి దాసోహం కావడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం కాదని మరోసారి రుజువయ్యిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుందుర్రు ఫ్యాక్టరీ విషయంలో ఆ పార్టీ నేతలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం విమర్శలకు దారి తీస్తోంది.
అక్కడ నిర్మిస్తున్న గోదావరి మెగా అక్వాఫుడ్ పార్కును స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం పేరుతో తుందుర్రు, జొన్నల గరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో గత నెల రోజులుగా 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల రోజుల్లో అక్కడ ప్రజలు పడని ఇబ్బందులు లేవు. 144 సెక్షన్‌ను అడ్డం పెట్టుకుని పోలీసులు చేసిన అరాచకాలపై ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే సరికి పోలీసుల సంఖ్యను తగ్గించినా 144 సెక్షన్ ఎత్తివేతపై నిర్ణయం మాత్రం తీసుకోలేదు.హత్యాయత్నం, బైండోవర్ కేసులతో మూడు గ్రామాల ప్రజలను భయబ్రాంతులను చేశారు. 37 మందిపై హత్యాయత్నం కేసు పెట్టి ఏడుగురిని జైల్లో పెట్టారు. వారికి బెయిల్ రాకుండా పదేపదే అడ్డుతగులుతున్నారు మరోవైపు 120 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో మగవారు గ్రామంలో అడుగుపెట్టడానికే భయపడే పరిస్థితి తీసుకువచ్చారు. బయట అజ్ఞాతంలో ఉన్న వారి కోసం రోజూ ఇళ్లకు వెళ్లి పోలీసులు బెదిరిస్తున్న పరిస్థితులు నేటికీ ఉన్నాయి. దీంతో కుటుంబాలు విచ్చిన్నం అయ్యాయి. భర్తలు అజ్ఞాతంలో, భార్యలు గ్రామాల్లో ఉండాల్సిన స్థితి ఇంకా కొనసాగుతోంది. ఫుడ్‌పార్కు నిర్మాణంపై ప్రజల్లో రోజురోజుకీ అపోహలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యలో వారికి అవగాహన కల్పించేందుకు సిద్దం అని యాజమాన్యం ప్రకటించినా రెవిన్యూ విభాగం నుంచి స్పందన కరువైంది. ఫ్యాక్టరీపై ప్రజల్లో అపోహలు వచ్చినప్పుడే రెవిన్యూ, పొల్యూషన్ కంట్రోల్ విభాగాలు ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నాలు పూర్తిస్థాయిలో చేయలేదు. ఏదో మండల కార్యాలయాల్లో పెట్టి మమ అనిపించారు. నిర్బంధంతో అణిచివేయాలని చూడటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ నిర్బందాన్ని వెంటనే ఎత్తివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనానీతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్‌లను కలిసి 144 సెక్షన్ ఎత్తివేయాలని, అక్రమ కేసులను కూడా ఎత్తివేయాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించినా ఇప్పటి వరకూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ఉద్యమాన్ని ఉదతం చేసేందుకు విపక్షాలు ప్రణాళిక సిద్దం చేస్తున్నాయి.