విధి వక్రించి.. వీధినపడి..
-
బీమా సొమ్ము ఇవ్వని టీడీపీ సభ్యత్వం
-
అక్కరకు రాని అమ్మ బ్యాంకు ఖాతా సొమ్ము
-
అనాథలుగా మారిన చిన్నారులు
బలభద్రపురం(బిక్కవోలు) : ఆటపాటలతో తల్లిదండ్రుల మధ్య గడపాల్సిన చిన్నారులు చిన్నతనంలోనే అండను కోల్పోయారు. ఆదుకోవలసిన ప్రభుత్వం మొండి చెయ్యి చూపగా, అండగా ఉండాలనుకున్న పిన్నమ్మ అవిటిదై మంచానికి పరిమితమైంది. దీంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. మండలంలోని బలభద్రపురం గ్రామానికి చెందిన మామిడి అప్పారావు, సూర్యకుమారి దంపతులు కూలీపనులు చేసుకుని జీవనం సాగిస్తూ వారి ఇద్దరు కుమార్తెలను ఎంతో ప్రేమగా చూసుకునేవారు.
2014వ సంవత్సరంలో అప్పారావు తన పొలంలో క్రిమి సంహారక మందు పిచికారీ చేస్తూ విషప్రభావానికి గురై ఇంటికి వచ్చాకా కుప్పకూలిపోయాడు. ఆ విషాదంనుంచి కోలుకోకుండానే తల్లి సూర్యకుమారి వ్యవసాయ పనులకు ఆమె మరిది తోడికోడలు వెంకటలక్షి్మతో కలసి బైక్‌పై వెళ్తుండగా పిఠాపురం సమీపంలో జల్లూరు వద్ద లారీ ఢీకొని అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటలక్షి్మ ఒక కాలు కోల్పోయి మంచానికే పరిమితమయింది. దీంతో ఆ చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఆదుకోని ప్రధాన మంత్రి బీమా యోజన
చిన్నారుల తల్లి సూర్యకుమారి అసంఘటిత కార్మికురాలు కావడంతో ఆమె పేరున అనపర్తి ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతా తెరిచారు. ప్రధాన మంత్రి బీమా యోజన పథకంలో భా గంగా ఏటా రూ.12 ఆమె ఖాతా నుంచి తీసుకుని బీమా కల్పించాల్సి ఉంది. ఈ పథకం కింద లబ్ధిదారు చనిపోతే రూ.2లక్షలు అ కుటుంబానికి అందచేయాల్సి ఉంటుంది. కాని ఇంత వరకు ఆ సొమ్ము అందలేదు. ఇద్దరు చిన్నారులను వెంటబెట్టుకుని వారి తాత ఏడాదిగా బ్యాంకు చుట్టూ తిరగుతున్నా పని మాత్రం కావడం లేదని వాపోయాడు.
బయటపడిన టీడీపీ సభ్యత్వంలోని డొల్లతనం
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి అంగవైకల్యంతో బాధపడుతున్న వెంకటలక్ష్మి టీడీపీ వీరాభిమాని. దీంతో 2014లో రూ.100లు చెల్లించి పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంది. పార్టీ నిబంధనల ప్రకారం సభ్యులు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరితే, ప్రత్యేక రాయితీలతో పాటు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50వేల వరకు తక్షణ సహాయంగా అందించాలి. కానీ నేటికీ పైసా కూడా ఇవ్వకపోడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. నిజమైన నిరుపేదలకు పార్టీలో న్యాయం జరగడం లేదని పైరవీకారులకు మాత్రమే పనులు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా కల్పనతో పాటు కష్ట కాలంలో ఆర్థిక సహాయం అందచేస్తున్నామన్న నేతల మాటలు నీటి మూటలేనని మామిడి వెంకటలక్ష్మి విషయంలో మరోసారి రుజువైంది.