
రేషన్ బియ్యం ఇస్తారా.. చావమంటారా..!
బీర్కూర్ : రేషన్ బియ్యం ఇస్తారా.. లేదంటే పురుగుల మందు తాగి చావమంటారా అని ఓ నిరుపేద కుటుంబం బీర్కూర్ తహసీల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. తమకు ఏడాది కాలంగా రేషన్ బియ్యం రావడం లేదంటూ బొప్పాస్‌పల్లికి చెందిన సంగ్రాంనాయక్ సోమవారం భార్య, పిల్లలతో కలిసి తహసీల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. కరువు కాలంలో నిరుపేదనైన నేను ఏం తిని బతకాలంటూ కన్నీరు పెట్టుకున్నాడు. సమస్య పరిష్కరించకపోతే కుటుంబ సభ్యులమంతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామన్నారు.
దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి బాధితుల నుంచి పురుగుల మందును స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ స్పందిస్తూ సంగ్రంగా సింగ్ కుటుంబ సభ్యుల ఆధార్‌నెంబర్లు ఎస్‌ఆర్‌డీహెచ్‌కు అనుసంధానం కాలేదన్నారు. దీంతో 8 నెలలుగా బియ్యం రావడం లేదని చెప్పారు. సమస్యను పరిష్కరించి వచ్చేనెల నుంచి రేషన్ బియ్యం మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.