-
లేదు..లేదంటూనే ‘షాక్’ఇస్తున్న సర్కార్
-
ఇష్టానుసారంగా కరెంట్ కటింగ్‌తో జనం బేజార్
ఖమ్మం:
అదేంటో గానీ..కొంతకాలంగా కరెంట్ ఎప్పుడు పోతుందో..ఎంతసేపు తీస్తారో..తిరిగి ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అస్సలు విద్యుత్ కోతలే ఉండవని..పాలకులు గొప్పగా చెప్పినా..ఆచరణలో మాత్రం మళ్లీ పాతరోజులు వచ్చేశాయి. మరమ్మతుల పేరిట సరఫరా ఆపేస్తున్నామని అధికారులు చెబుతుంటే..షరా మామూలే..అని సర్దుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఈ ఏడాది ఇంకా పూర్తిస్థాయిలో పంటల సాగు ఊపందుకోకున్నా..ఈ కోతలెందుకోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్‌కో బాధ్యులు స్పందించాలని రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఎన్‌పీడీసీఎల్ అధికారులు కొద్దిరోజులుగా ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. మరమతుల పేరిట గంటల కొద్దీ సరఫరా ఆపేస్తున్నారు. రోజుకో ప్రాంతంలో కోత విధిస్తున్నారు. సాగు పనులు చేపట్టిన రైతులు వరి, పత్తి, మిర్చి, ఇతర పంటలకు సాగునీరు పెట్టలేక ఇబ్బంది పడుతున్నారు. బావులు, బోర్లపై ఉన్న విద్యుత్ మొటర్లను ఒకేసారి వినియోగించడంతో పెరిగిన అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా లేక అదనపు లోడ్‌పడి ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఎప్పుడు విద్యుత్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటోంది.
-
కనీసం గంట..వచ్చేది చెప్పలేమంట
ఒక వైపు వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేస్తన్నామని అధికారులు చెబుతున్నా..వాస్తవానికి జిల్లాలో ప్రతిరోజూ అన్ని చోట్లలో కరెంట్ కోత విధిస్తున్నారు. కొత్తలైన్లు వేయడం, విద్యుత్ సబ్ స్టేషన్లలో రిపేర్ల కోసం..ప్రతి శనివారం గంటల కొద్దీ సరఫరాను నిలిపేస్తున్నారు. ఇక మిగతా రోజుల్లో కోతలు అనధికారమన్నమాట. ప్రధానంగా ఖమ్మం నగరంలో గతంలో కంటే..ఈ షాక్ ఇటీవల ఎక్కువైంది. పాలేరు, మధిర, ఇల్లెందు డివిజన్లలో తరుచూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కరెంట్ పోయిందంటే కనీసం గంట వరకు రాదని, కొన్నిసార్లు ఎన్ని గంటల తర్వాత ఇస్తారో తెలియదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
మరమ్మతు..జాప్యంమస్తు
తరుచూ లైన్లపై ట్రిప్ కావడంతో మరమ్మతు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే..విద్యుత్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులు సరిపడా లేక రిపేర్‌కు జాప్యం నెలకొంటోంది. మరమతు చేసేందుకు గంటల కొద్దీ సమయం పడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత నెలరోజుల వ్యవధిలోనే జిల్లాలో 440కి పైగా ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై ఇటీవల జిల్లా అధికారులతో ఎన్‌పీడీసీఎస్ సీఎండీ వెంకటనారాయణ సమీక్షించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు విఫలం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కూడా.
-
పెరిగిన వాడకం..సరఫరాలో విఫలం
ప్రస్తుతం జిల్లాలో వరినాట్లు పడుతుండడం, పత్తి పంట పూత, కాత దశలో ఉండటంతో సాగునీటి అవసరం పెరిగింది. మరోపక్క మిర్చి నార్లు పోయడం, తోటలు వేసే సీజన్ కావడంతో సాగునీటి కోసం బోర్లు, బావులపై విద్యుత్ మోటార్లను వినియోగిస్తుండడంతో..కరెంట్ వాడకం డిమాండ్ పెరిగింది. అయితే ఈ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం, ఎన్‌పీడీసీఎల్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ప్రజల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఒక వైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లు, లైన్లట్రిప్ పేరిట గంటల కొద్దీ విద్యుత్ తీసివేస్తున్నారు. ఫలితంగా మిర్చి తోటలు, మిరుపనారు, పత్తి పంట వాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల వద్ద ఉన్న ప్రజలు కూడా..అప్రకటిత కోతలతో అవస్థలు పడుతున్నారు.
-
పెరిగిన కరెంట్ వాడకం ఇలా..
– జిల్లాలో రోజుకు సగటు వినియోగం 5.865 మిలియన్ యూనిట్లు
– ఈనెల 15న 6.667 మిలియన్ యూనిట్లు
– 16న 6.96 మిలియన్ యూనిట్ల డిమాండ్
– అంటే రోజుకు 1.2 మిలియన్ యూనిట్లు అధికం.
– గత రెండు మూడు రోజుల్లో 372, 424 మెగావాట్ల మేరకు డిమాండ్