కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ శాఖలో 8 మంది డిప్యూటీ తహశీల్దార్లకు (డీటీలకు) పదోన్నతులు ఖరారయ్యాయి. ఈ మేరకు విజయవాడలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జరిగిన డీపీసీ ఆమోదం తెలిపింది. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నేతలు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్లకు జోనల్ పరిధిలో పదోన్నతులు కల్పిస్తారు. జిల్లాలో 8 మందిలో 7 మందిని తహసీల్దార్లుగా కర్నూలు జిల్లాకు కేటాయించారు. ఒకరు మాత్రం వైఎస్‌ఆర్ జిల్లాకు అలాట్ అయినట్లుగా అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన వారిలో కలెక్టరేట్‌లోని బి.సెక్షన్ సూపరింటెండెంటు వెంకటేశ్వర్లు, వసుంధర (జిఎన్‌ఎస్‌ఎస్), లక్ష్మీదేవి(డీఎస్‌ఓ), యూనస్‌బాషా ( నంద్యాల టిజిపి), తిరపతిసాయి (కర్నూలు ఆర్డీఓ ఆఫీసు), సుబ్రమణ్యం (లీగల్‌సెల్), నాగమునీశ్వరప్రసాద్ (డీటి బనగానపల్లి), శేషారాంసింగ్( వెల్దుర్తి)లు ఉన్నారు. శేషారాంసింగ్ మాత్రం వైఎస్‌ఆర్ జిల్లాకు అలాట్ అయ్యారు. రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కృషి వల్లే ఏడుగురు జిల్లాకే అలాట్ అయినట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌బాబు, గిరికుమార్‌రెడ్డిలు తెలిపారు.