పదోన్నతుల రగడ
పదోన్నతుల రగడ
Published Fri, Feb 3 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
ఎంఈవో పోస్టుల భర్తీకి సంబంధించి జీవోల జారీ
జీవో 10, 11లపై ప్రభుత్వ ఉపాధ్యాయుల అభ్యంతరాలు
సీనియార్టీ, పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని ఆవేదన
భీమవరం టౌన్ : విద్యాశాఖలో ఎంఈవో పోస్టుల భర్తీపై జారీ చేసిన జీవోలు చిచ్చు రేపుతున్నాయి. విద్యారంగంపై ఇది తీవ్ర ప్రభావం కనబర్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఏళ్ల తరబడి రెగ్యులర్ ఎంఈవో పోస్టుల స్థానంలో ఇన్‌చార్జిలను నియమిస్తూ ప్రభుత్వం నెట్టుకొస్తోంది. సుమారు 18 ఏళ్లుగా బీఈడీ స్కూల్ అసిస్టెంట్‌లను ఇన్‌చార్జి ఎంఈవోలుగా నియమిస్తుండటంతో ఒకవైపు ప్రధానోపాధ్యాయులుగా మరోవైపు విద్యాశాఖాధికారులుగా ద్విపాత్రాభినయం చేయాల్సి వస్తోంది. జెడ్పీ, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉమ్మడి సర్వీసు రూల్స్‌లో నెలకొన్న వివాదం విద్యారంగానికి శాపంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 10, 11 జీవోలు జారీ చేసింది. మండల విద్యాశాఖాధికారుల పోస్టులను రెండు భాగాలుగా చేస్తూ ఈ జీవోలు జారీ చేశారని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. జీవో 10 ప్రకారం జెడ్పీ ఉపాధ్యాయులకు, జీవో 11 ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈవోలుగా పదోన్నతులు కల్పిస్తారని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. దీనిపై జెడ్పీ ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వ ఉపాధ్యాయవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవోలపై న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికే సీనియార్టీ, పదోన్నతుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే జీవోల జారీ
రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవోలు 10, 11 జారీ చేసింది. పదోన్నతులపై అనేక ఏళ్లుగా న్యాయస్థానంలో పోరాడుతున్నాం. ఉమ్మడి సీనియార్టీపై విద్యాశాఖలో పదోన్నతులు కల్పించడాన్ని 2003లో హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు స్టేటస్‌కో ఇచ్చింది. 2015 సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే జెడ్పీ ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు కల్పించాలనుకుంటే సాంకేతిక పరమైన అభ్యంతరాలు లేకుండా రాష్ట్రపతి ఉత్తర్వులకు ప్రయత్నించాలని సూచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న జీవోలు 10, 11 జారీ చేయడం సరికాదు. దీనిపై న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తాం.
మద్దూరి సూర్యనారాయణమూర్తి, ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు
Advertisement
Advertisement