ఆ రైతులకు ఇచ్చేది లక్షన్నరే: ప్రత్తిపాటి
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు మాటతప్పింది. కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారంలో భారీగా కోత విధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీసినపుడు.. రూ.5లక్షలు ఇస్తామని వ్యవసాయమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, జిల్లాలోని 33 మంది రైతులకు రూ.లక్షన్నర మాత్రమే పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రత్తిపాటి పుల్లారావు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19 ముందు మరణించినందున ఐదు లక్షల ప్యాకేజీ వర్తించదని మంత్రి చెప్పారు. వారంతా 2013 - 14 మధ్య చనిపోయిన వారు.. కానీ, అసెంబ్లీలో అధికారులు సరైన సమాచారం అందించలేదని.. అందుకే అలా ప్రకటించాల్సి వచ్చిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.