
ఈతపై అప్రమత్తత.. లేకుంటే గుండెకోత
చిత్తూరు ఎడ్యుకేషన్/తిరుపతి మంగళం: బయట భానుడు ఉగ్రరూపం.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. పైగా వేసవి సెలవులు. దీంతో ఎండ నుంచి ఉపశమనం కోసం యువకులు, విద్యార్థులు చెరువులను, స్విమింగ్ పూళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈత సరదా వారి ప్రాణాలను తీస్తోంది. చెరువుల్లో, స్విమింగ్ పూళ్లలో, కుంటల్లో లోతును అంచనా వేయలేక మృత్యువాత పడుతున్నారు. ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది ఇప్పటి వరకు చనిపోయారు. అయినా అధికారుల్లో చలనం రావడం లేదు. చెరువుల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు.
ప్రమాదాల నివారణ ఇలా..
చిన్నారులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, వాగులు, కాలువలు, కుంటల్లోకి వెళ్తామంటే తల్లిదండ్రులు అనుమతించకూడదు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలకు ఈత నేర్పాలి. స్నేహితులు, బంధువులు, ఇతరులతో ఈతకు పంపకూడదు. ప్రాక్టీసు లేకుండా స్విమ్మింగ్ పూల్‌లో దూకకూడదు. ఒంటరిగా ఈతకు వెళ్లకూడదు. నీటి అడుగు భాగంలోకి వెళ్లి మట్టిని తీసుకురావడం వంటి çపనులు చేయకూడదు. స్విమ్మింగ్ పూళ్లలో సురక్షితుడైన ఈతగాడి ఆధ్వర్యంలోనే ఈత నేర్చుకోవాలి. పిల్లల వెంట తప్పకుండా పెద్దలు ఉండాలి. తీర్థయాత్రలకు, ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఈత వచ్చినప్పటికీ నీటి లోపలికి పిల్లలను పంపకూడదు.
వీటిని పాటిస్తే మంచిది..
ఈత కొట్టేటప్పుడు శరీర నిర్మాణానికి అనువైన స్విమ్మింగ్ సూట్ వేసుకోవాలి. తల వెంట్రుకలు తడవకుండా మాస్క్ ధరించాలి. వాతావరణానికి అనుకూలంగా డార్క్, క్లియర్ కళ్లజోళ్లను వాడాలి. చెవిలోకి నీరు వెళ్లి ఇన్‌ఫెక్షన్ కాకుండా సిలికాన్ ఇయర్ ఫ్లగ్స్‌ను వాడాలి. నీటిలో తడవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా వాజిలిన్ వంటిది పూయాలి. ముఖాన్ని పైకి ఉంచి ఈదాలి. ఊపిరీ పీల్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
⇒దూకేటప్పుడు కాళ్లు మొదట నీళ్లను తాకేలా చూసుకోవాలి. డైవింగ్ చేయవద్దు. తలకిందులుగా దూకొద్దు.
⇒క్వారీ గుంతల అడుగుభాగంలో బండలు, రాళ్లు ఉంటాయి. లోతును ముందుగానే అంచనా వేయకపోతే ప్రమాదం.
⇒ఈతలో ఎంతటి నిపుణుడైనా ఇతరులు మునిగిపోతున్నప్పుడు వారిని రక్షించేందుకు నీళ్లలోకి దూకొద్దు. కర్రలు, తాడు, ఇతర పరికరాలను ఉపయోగించాలి.
⇒ఒకే సారి ఇద్దరు, ముగ్గురిని రక్షించకూడదు. ఎంతటి గజ ఈతగాడైనా సరే వారితోపాటే మునిగిపోయే ప్రమాదం ఉంది.
∙అరగంట కంటే ఎక్కువ సేపు ఈత కొట్టకూడదు. గంటల కొద్దీ ఈదడం వల్ల ఊపిరాడదు.
నీటిలో మునిగిన వారిని రక్షించే విధానం
ఆకస్మికంగా నీటిలో ఎవరైనా మునిగిపోతే వారిని రెండు పద్ధతుల్లో రక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రత్యక్ష పద్ధతి మొదటిది. ఈ పద్ధతిలో రక్షించే వారికి ఈత వచ్చి ఉండాలి. మునిగిపోతున్న వ్యక్తి వెనుక నుంచి మాత్రమే వెళ్లాలి. మునిగిపోతున్న వ్యక్తి మొలతాడు లేదా జట్టు పట్టుకుని బయటకు తీసుకురావాలి.
రెండవది పరోక్ష పద్ధతిః ఈ పద్ధతిలో ఈతరాని వారు కూడా రక్షించవచ్చు. ఒడ్డుకు దగ్గరగా ఉండే కర్ర, టవల్, ప్యాంట్‌లను వారికి అందించి బయటకు లాగాలి. బుర్రకాయ, థర్మాకోల్, మూతబిగించిన నీటి క్యాన్ వంటి నీటిపై తేలే వస్తువులను బాధితుడి వద్దకు చేర్చాలి.
అవగాహన అవసరం..
ఈతకు వెళ్లే వారికి చెరువులు, కుంటలు, స్విమింగ్ పూళ్లలో నీటి మట్టంపై అవగాహన ఉండాలి. నీటిలో సంభవించే ప్రమాదాల బారి న నుంచి బయటపడేందుకు అవసరమైన మెళకువలను కూడా నేర్చుకోవా లి. అలా కాకుండా నీళ్లు చూడగానే లోతు ఎంత ఉందని తెలుసుకోకుండా దూకడం వల్లే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
– బి.చక్రవర్తి (ఆది), స్విమ్మింగ్ కోచ్