ప్రేక్షకుల ఆదరాభిమానాలే నిజమైన గుర్తింపు
చాగల్లు : ప్రేక్షకుల ఆదరభిమానాలే సినీ నటులకు నిజమైన గుర్తింపు అని సినీ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ జగపతిబాబు అన్నారు. చాగల్లు తెలగా సంఘం ఆధ్వర్యంలోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సోమవారం రాత్రి ఆయన ఇక్కడకు విచ్చేశారు. తొలుత వినాయకస్వామికి పూజలు, ఆభిషేకాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో సుమారు 130 చిత్రాల వరకు నటించానని అన్నారు. ఇటీవల కాలంలో లెజండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాల్లో నటనకు మంచి పేరు వచ్చిందన్నారు. హీరోనా, విలనా అన్నది ముఖ్యం కాదని, విజయవంతమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందడం ముఖ్యం అని అన్నారు. తెలుగు,తమిళం, మాళయాళం, కన్నడ భాషా చిత్రాల్లోనూ నటిస్తున్నట్టు చెప్పారు. ‘సినిమాల్లో నేను నటించే పాత్రలపై నేను, నా అభిమానులు అనందంగా ఉన్నాం’ అని తెలిపారు.
జగపతి ఆర్ట్స్‌పై త్వరలో సినిమాలు నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ తండ్రి ఆశయం మేరకు గండ్రోతు కృష్ణారావు పేరిట చాగల్లులో ఆడిటోరియం నిర్మించడం అభినందనీయమన్నారు. అలాగే వినాయక్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులను చదివించడం ప్రశంసనీయమన్నారు. వినాయక చవితి సందర్భంగా కళలను, కళాకారులను గౌరవించడం సంతోషదాయకం అని, 60 ఏళ్లుగా ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. వీవీ వినాయక్ నివాసంలో జగపతిబాబు విలేకరులతో మాట్లాడుతుండగానే అభిమానులు ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, జుట్టా కొండలరావు, పిండి మంగరాజు, గండ్రోతు విజయ్, గవర సర్వారాయుడు, తెలగా సంఘం పెద్దలు పాల్గొన్నారు.