in chagallu
-
ముగిసిన బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
చాగల్లు : స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర జిల్లాల అండర్–17 స్కూల్ గేమ్స్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు శనివారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ప్రథమస్థానంలో తూర్పు గోదావరి జిల్లా జట్టు, ద్వితీయస్థానంలో విశాఖపట్టణం, తృతీయస్థానంలో గుంటూరు, నాలుగోస్థానంలో విజయనగరం జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో విశాఖపట్టణం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లా జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే కేఎస్ జవహర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఏఎంసీ చైర్మన్ ఆళ్ల హరిబాబు, ఎంపీపీ కోడూరి రమామణి, సర్పంచ్‌లు జొన్నకూటి వెంకాయమ్మ, ఓబా దుర్గ, స్కూల్ గేమ్స్ జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శి సాయి శ్రీనివాస్, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి సీహెచ్ సతీష్‌కుమార్, కె.రామ్‌కుమార్, పీఈటీలు పాల్గొన్నారు. -
చాగల్లు షుగర్స్‌పై కొరడా
కొవ్వూరు : చాగల్లులోని జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను రాబట్టేందుకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించిన అధికారులు ఈనెల 15న ఉదయం 11 గంటలకు కర్మాగారాన్ని బహిరంగ వేలంలో విక్రయించాలని నిర్ణయిం చారు. రైతుల నుంచి చెరకు సేకరిస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం రెండేళ్లుగా వారికి సొమ్ము చెల్లించడం లేదు. 2014–15, 2015–16 సంవత్సరాలకు సంబంధించి రూ.70.44 కోట్లమేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రైతులు అనేకసార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఎదుట నెల రోజులకు పైగా ఆందోళన చేశారు. అయినప్పటికీ యాజమాన్యం స్పందించలేదు. రైతు సంఘం నాయకులు, ఆర్డీవో, అసిస్టెంట్ కేన్ కమిషనర్ యాజమాన్య ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. చివరకు ఆర్డీవో బి.శ్రీనివాసరావు సారధ్యంలో రైతు ప్రతిని ధులు, అసిస్టెంట్ కేన్ కమిషనర్‌తో సంఘాన్ని ఏర్నాటు చేశారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసిన పంచదార నిల్వలను విక్రయించడం ద్వారా రైతుల బకాయిలు చెల్లించాలని సంఘం నిర్ణయించింది. అందుకు యాజమాన్యం సానుకూలత వ్యక్తం చేయడంతో 12 విడతలుగా పంచదారను విక్రయించగా వచ్చిన రూ.34.61 కోట్లను 9,640 మంది రైతులకు చెల్లించారు. అయినా, బకాయిలు పూర్తిగా తీరకపోవడంతో అసిస్టెంట్ కేన్ కమిషనర్ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగించారు. యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా సరైన స్పందన రాకపోవడంతో రైతు ప్రతినిధుల బృందం జూన్ మొదటి వారంలో చెన్నై వెళ్లి యాజమాన్యంతో చర్చించింది. అనంతరం యాజమాన్యం రూ.6.50 కోట్లను చెల్లించింది. ఈ సొమ్మును 3,300 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ.28.04 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు ఫ్యాక్టరీని బహిరంగ వేలంలో విక్రయించాలని నిర్ణయించి వేలం ప్రకటన జారీ చేశారు. 15న వేలం వేస్తున్నాం చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం చాగల్లులోని జైపూర్ షుగర్స్‌ను ఈనెల 15న వేలం వేస్తున్నాం. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఫ్యాక్టరీ ఆవరణలోనే ఈ కార్యక్రమం నిర్వహించారు. వేలం నిర్థారణకు 30 రోజుల గడువు ఉంటుంది. ఈలోగా యాజమాన్యం ఏదైనా అప్పీల్ వస్తే స్వీకరిస్తాం. –బి.శ్రీనివాసరావు, ఆర్డీవో, కొవ్వూరు రూ.28.04 కోట్లు చెల్లించాలి చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతులకు ఇంకా రూ.28.04 కోట్లు బకాయిపడింది. 2014–15లో చెల్లించాల్సిన బకాయిలను పంచదార విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును, యాజమాన్యం సర్ధుబాటు చేసిన సొమ్మును రైతులకు చెల్లించాం. మిగిలిన బకాయిల కోసం యాజమాన్యంతో రైతు సంఘం ప్రతినిధులతో పలుసార్లు చర్చించినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను అనుసరించి రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. – ఎ.సీతారామారావు, అసిస్టెంట్ కేన్ కమిషనర్, తణుకు -
ప్రేక్షకుల ఆదరాభిమానాలే నిజమైన గుర్తింపు
చాగల్లు : ప్రేక్షకుల ఆదరభిమానాలే సినీ నటులకు నిజమైన గుర్తింపు అని సినీ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ జగపతిబాబు అన్నారు. చాగల్లు తెలగా సంఘం ఆధ్వర్యంలోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సోమవారం రాత్రి ఆయన ఇక్కడకు విచ్చేశారు. తొలుత వినాయకస్వామికి పూజలు, ఆభిషేకాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో సుమారు 130 చిత్రాల వరకు నటించానని అన్నారు. ఇటీవల కాలంలో లెజండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాల్లో నటనకు మంచి పేరు వచ్చిందన్నారు. హీరోనా, విలనా అన్నది ముఖ్యం కాదని, విజయవంతమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందడం ముఖ్యం అని అన్నారు. తెలుగు,తమిళం, మాళయాళం, కన్నడ భాషా చిత్రాల్లోనూ నటిస్తున్నట్టు చెప్పారు. ‘సినిమాల్లో నేను నటించే పాత్రలపై నేను, నా అభిమానులు అనందంగా ఉన్నాం’ అని తెలిపారు. జగపతి ఆర్ట్స్‌పై త్వరలో సినిమాలు నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ తండ్రి ఆశయం మేరకు గండ్రోతు కృష్ణారావు పేరిట చాగల్లులో ఆడిటోరియం నిర్మించడం అభినందనీయమన్నారు. అలాగే వినాయక్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులను చదివించడం ప్రశంసనీయమన్నారు. వినాయక చవితి సందర్భంగా కళలను, కళాకారులను గౌరవించడం సంతోషదాయకం అని, 60 ఏళ్లుగా ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. వీవీ వినాయక్ నివాసంలో జగపతిబాబు విలేకరులతో మాట్లాడుతుండగానే అభిమానులు ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, జుట్టా కొండలరావు, పిండి మంగరాజు, గండ్రోతు విజయ్, గవర సర్వారాయుడు, తెలగా సంఘం పెద్దలు పాల్గొన్నారు. -
ఖైదీ నెం.150 అభిమానులకు పండుగ
కొవ్వూరు రూరల్/ చాగల్లు : చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెం.150వ సినిమా గురించి ఆ చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం ఆయన చాగల్లు విచ్చేశారు. చాగల్లుతో పాటు ఐ.పంగిడి గ్రామంలోని గణపతి పందిళ్లలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీ పేరుతో చిరంజీవికి సూపర్ హిట్ చిత్రాలు లభించాయని, ప్రస్తుత సినిమా కూడా సూపర్, డూపర్ హిట్ అవుతుందని ఘంటా పథంగా చెప్పారు. అభిమానులు పండుగ చేసుకునేలా పూర్తి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా ఆయనతో చేసిన ఇంటర్వూ్య ఇలా బోలెడు విషయాలు తెలిపారు. ప్ర : చిరంజీవి 150వ సినిమా ఎలా ఉండబోతోంది? జ : అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది. సందేశంతో పాటు కామెడీ, డ్యాన్స్, ఫైట్లు ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. ప్ర:సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ఏమిటి? జ: ముఖ్యంగా తారాగణం. హీరోయిన్గా కాజల్, సీనియర్ నటులు బ్రహ్మానందం, రఘుబాబు వంటి వారు ఆకర్షణగా నిలుస్తారు. ప్ర: చిత్రీకరణలో ప్రత్యేక జాగ్రత్తలు ఏమి తీసుకుంటున్నారు? జ: చిరంజీవి ఓల్డేజ్ హోంలో పనిచేస్తారు. ఈ సీన్లు రియల్‌గా ఉండాలన్న ఉద్దేశంతో నిజమైన ఓల్డ్ ఏజ్ హోం నుంచి నటనపై ఆసక్తి ఉన్న వద్ధులను సినిమా కోసం తీసుకువచ్చాం. అంత జాగ్రత్తగా చిత్రీరణ చేస్తున్నాం. ప్ర: సినిమా చిత్రీకరణ ఎంతవరకూ పూర్తయ్యింది? జ: అరవై శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఇంకా పాటల చిత్రీకరణ జరగాల్సి ఉంది. రెండు పాటలు మాత్రం ఇతర దేశాల్లో చిత్రీకరిస్తాం. వచ్చే ఏడాది భోగి నాడు సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్ర: ఈ సినిమాలో చిరంజీవి చాలా యంగ్‌గా కన్పిస్తున్నారు. దానికి కారణం? జ: చిరంజీవి సినిమాను ఎంతగా ప్రేమిస్తారో మన అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం ఆయన ఎంతగానో కష్టపడుతున్నారు. ప్రతి సీనులోను ఆయనలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఫైట్స్, డ్యాన్సుల్లో వారం రోజులు షెడ్యూల్ ప్లాన్ చేస్తే ఆయన మూడు రోజుల్లోనే చేసేస్తున్నారు. అంత ఉత్సాహంగా ఉన్నారు. దీంతో ఈ సినిమాలో ఫైట్లు డూప్ లేకుండా చిత్రీకరించాం. పాత చిరంజీవిని అభిమానులు మళ్లీ చూస్తారు. ప్ర: మీ సినిమాకు ఖైదీ నెం.150 పేరు పెట్టడానికి కారణం? జ: ఈ సినిమాలో ఖైదీ నెం.150 అనే డైలాగ్ ఉంది. దీంతో ఎవరో నెట్లో ఇదే సినిమా పేరుగా పెట్టారు. దర్శకుడు దాసరి నారాయణ లాంటి పెద్దలు ఈ పేరైతేనే బాగుంటుంది అని చెప్పడంతో దానిని ఖరారు చేశాం. ప్ర: షూటింగు బిజీలో ఉండగా ఇక్కడకు రావడం? జ: షూటింగుకు ఒక రోజు స్వల్ప విరామం వచ్చింది. చిరంజీవి కేరళ వెళ్లడంతో కొంత ఖాలీ దొరికింది. ప్రతి వినాయక చవితికి మా సొంత ఊరు చాగల్లు రావడం అలవాటు. దీంతో రెక్కలు కట్టుకుని వాలిపోయా. ఇక్కడకు వచ్చిన తరువాత నా స్నేహితులు, బంధువులు, ఇక్కడి పెద్దలన కలిసిన తరువాత వెళ్లాలనిపించడం లేదు. అయినా తప్పదుగా... వీలు చూసుకుని చవితి ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు మళ్లీ వస్తా.