
అవి విలాసాల బార్‌లు
బీచ్‌లో మద్యం అమ్మకాలకు సన్నాహాలు
470 జీవోతో గేట్లు తెరిచిన ప్రభుత్వం
నిన్న బీచ్ లవ్.. నేడు బీర్ లవ్ పేరుతో తీరం విషతుల్యం
అడ్డగోలు నిర్ణయాలపై సర్వత్రా ఆగ్రహం
ఆరిలోవలో ఐద్వా ఆధ్వర్యంలో రాస్తారోకో
ఆందోళన బాటలో ప్రజా సంఘాలు
నిన్న బీచ్ లవ్ ఫెస్టివల్ అన్నారు.. నేడు బీచ్‌లో బార్‌లకు గేట్లు బార్లా తెరుస్తున్నారు.. వీటన్నింటికీ సర్కారు పెట్టుకున్న ముద్దుపేరు.. పర్యాటక రంగ అభివృద్ధి..సంప్రదాయాలను కాలరాసే.. ప్రమాదాలకు హేతువులయ్యే ఇటువంటివి వద్దని ప్రజాసంఘాలు, పార్టీలు మొత్తుకుంటున్నా.. ఉద్యమాలు చేస్తున్నా సర్కారు చలించడంలేదు.. పైగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. ఆదాయా మార్గాలను అణగదొక్కుతున్నారని ఎదురుదాడికి తెగబడుతోంది. విదేశీ విధానాల దిగుమతికే మొగ్గుచూపుతోంది.
బీచ్ లవ్ ఫెస్టివల్‌ను ఆపేదిలేదని తెగేసి చెప్పిన పాలకులు.. తాజాగా ఎక్సైజ్ చట్టంలో సవరణలతో బీచ్‌లలో బార్‌ల పేరుతో మద్యం అమ్మకాలకు గేట్లు తెరుస్తోంది. అసలే సముద్రతీరాన్ని చూస్తే నగరవాసులే కాకుండా.. పర్యాటకులు అలలతోఆడుకోవాలని సంబరపడటం సహజం. ఆ సంబరంలో మునిగి.. కడలికి బలవుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు..అలాంటిది ఇప్పుడు తీరంలోనే మద్యం అందుబాటులోకి వస్తే.. తాగిన మైకంలో మరెంత మంది బలవుతారో.. ఊహిస్తేనే భయమేస్తుంది. మరి సంక్షేమ సర్కారుకు మాత్రం ఆదాయం తప్ప.. ఇంకేమీ కనిపించడం లేదు.. ఆలోచించడం లేదు.
విశాఖపట్నం:ఆదాయం సమకూర్చుకోవడానికి టీడీపీ సర్కారు యువతను ఫణంగా పెట్టడమే పనిగా పెట్టుకుంది. విశాఖ మహా నగరంలో విష సంస్కృతికి దారులు వేస్తోంది. పాశ్చాత్య పోకడలను రుద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు విశాఖలో ఏ చోట చూసినా ఇదే చర్చ. ఫిబ్రవరిలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేలాది విదేశీ ప్రేమ జంటలను తెచ్చి ఇక్కడ తీరంలో తాగినంత మందు పోసి చిందులేయించడానికి రంగం సిద్ధం చేసింది. దీనిపై నగర ప్రజ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ప్రజా, మహిళా సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలూ, టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ మండిపడుతున్నాయి. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. ఇంకా ఆ వేడి చల్లారకముందే ప్రభుత్వం బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలు, ఫుడ్ పార్లర్లలో మద్యం, బీర్ల అమ్మకాలకు లెసైన్సులు మంజూరు చేస్తామంటూ మరో వివాదానికి తెరలేపింది.
ఇప్పటికే పెరిగిన ఆగడాలు
ఇప్పటికే బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, నగర శివార్ల మందుబాబుల ఆగడాలకు అడ్డాగా మారిపోయింది. ఆయా ప్రాంతాల్లో ఉంటున్న వారు వీరి చేష్టలతో పడుతున్న అవస్థలన్నీ ఇన్నీ కావు. కళాశాల విద్యార్థులు పెడదారి పడుతున్నారు. వీరిని ఆ దారి నుంచి తప్పించేందుకు పాటుపడాల్సిన ప్రభుత్వమే విచ్చలవిడిగా పార్లర్లు, బీచ్‌లు, పర్యాటక కేంద్రాల్లో స్వేచ్ఛగా మద్యం తాగే ఏర్పాట్లు చేస్తుండడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రభుత్వం ఇంతలా బరి తెగిస్తోందంటూ నిప్పులు చెరుగుతున్నారు. ప్రశాంతతకు మారుపేరైన విశాఖను విషతుల్యం చేయవద్దని, ఆదాయం కోసం పాడు చేయవద్దని వేడుకుంటున్నారు. ‘మద్యాన్ని అందుబాటులోకి తెస్తే అక్కడికి వచ్చిన వారు అదుపు తప్పి అఘాయిత్యాలకు పాల్పడితే విశాఖ ఏమవుతుంది? దానికుున్న మంచి పేరు ఏమవుతుంది? శాంతిభద్రతల సమస్య తలెత్తితే పరిస్థితి ఏమిటి? విదేశీయులు మన సంస్కృతిని గొప్పగా అనుసరిస్తుంటే.. పాశ్చాత్య సంస్కృతిని ఇక్కడ పెంచి పోషించడానికి ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహం చూపిస్తుంది?’ ఇవన్నీ విశాఖ వాసులు, విశాఖను ప్రేమించే వారి నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్నలు. పర్యాటకరంగం అభివృద్ధికి ఇలాంటి అడ్డగోలు అనుమతులిస్తారా? అంటూ నిలదీస్తున్నారు. రోజూ వేలాదిగా బీచ్‌లకు, పర్యాటక ప్రాంతాలకు వచ్చే స్థానికులు వెనక్కి పోయే ప్రమాదం కూడా ఉందని వీరు హెచ్చరిస్తున్నారు.
మరో ఉద్యమానికి సన్నద్ధం
విశాఖ వాసులు మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బీచ్ లవ్ ఫెస్టివల్‌ను రద్దు చేసే దాకా విశ్రమించబోమని వివిధ వర్గాలు ఆందోళన పథంలో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం బార్, బీర్లు అందుబాటులో ఉంచడానికి వీలుగా జారీ చేసిన 470 నంబరు జీవోను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని మహిళా, ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే శుక్రవారం ఆరిలోవలో ఐద్వా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించాయి. శనివారం జగదాంబ జంక్షన్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నాయి.