డీఎస్పీ రాజశేఖర్ రాజుకు రాష్ట్రపతి మెడల్
– అభినందించిన డీఐజీ రమణ కుమార్, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని జాతీయ స్థాయిలో పోలీసులకు ప్రదానం చేసే రాష్ట్రపతి మెడల్‌కు డీఎస్పీ సాళ్వ రామరాజుగారి రాజశేఖర రాజు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా పోలీసు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఇతనికి.. కర్నూలు రెంజ్ డీఐజీ రమణ కుమార్, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, అడిషనల్ ఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఉక్కుపాదంతో ఫ్యాక‌్షనిజం అణిచివేత
చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన సుబ్బమ్మ రామరాజు దంపతుల కుమారుడైన రాజశేఖరరాజు ఎస్‌ఐగా పోలీసు శాఖలో చేరారు. కడప జిల్లాలో ఫ్యాక‌్షనిజాన్ని ఉక్కుపాదంతో అణిచి వేశారు. ప్రొద్దుటూరు సీఐగా పదోన్నతి పొంది విజయవంతంగా తన విధులను నిర్వహించారు. అక్కడి నుంచి కర్నూలులో ఐదేళ్ల పాటు ఆర్టీసీలో స్పెషల్ డ్రైవ్ ఇన్‌స్పెక్టర్‌గా, మరో ఐదేళ్ల పాటు ట్రాన్స్‌కోలో విజిలెన్స్ ఆఫీసర్‌గా పని చేసి కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేలా చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో అల్లర్లను సమస్ఫూర్తిగా అదుపులోకి తెచ్చారు. అత్యంత సమస్యాక్మమైన మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహించడం ఆయన ప్రత్యేకమని పోలీసులు చెప్పుకుంటారు. ఐదేళ్ల నుంచి కర్నూలు జిల్లా పోలీసు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.
అవార్డుల రారాజు...
విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన అధికారిగా రాజశేఖరరాజుకు మంచిపేరు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009లో సేవా మెడల్, ఉత్తమ సేవలకు 2014లో ముఖ్యమంత్రి ప్రశంసాపత్రం, 2016లో పోలీసు ఉత్తమ సేవా మెడల్, బెస్టు ట్రాన్స్‌కో విజిలెన్స్ ఆఫీసర్‌గా పలు అవార్డులు అందుకున్నారు. అంతేకాక సర్వీసులో 225 రివార్డులు, 3 క్యాష్ రివార్డులు, 72 ప్రశంసాపత్రాలు, 62 కమాండేషన్లు, ఒక్క బంగారుపతం, పోలీసు డ్యూటీ మీట్‌లో ఆల్ రౌండ్ చాంపియన్ షిప్, బెస్టు ఎస్‌ఐ, బెస్టుసీఐ అవార్డులను అందుకొని మంచి పేరు తెచ్చుకున్నారు.
చాలా సంతోషంగా ఉంది: రాజశేఖరరాజు, రాష్ట్రపతి పోలీసు మెడల్ అవార్డు గ్రహీత
జాతీయ స్థాయిలో బెస్టు పోలీసు మెడల్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. రాష్ట్రపతితో అవార్డు అందుకోవడం కోసం ఎదురుచూస్తున్నాను. ఫ్యాక‌్షన్ ప్రభావిత పోలీసు స్టేషన్లలో ఎక్కువగా పనిచేసి ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నించా. ఈ అవార్డు మా తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామరాజులకు అంకితం చేస్తున్నా.