కిరోసిన్‌ కోటా కట్‌! | price of liter has been raised from Rs 19 to Rs 21 per liter | Sakshi
Sakshi News home page

కిరోసిన్‌ కోటా కట్‌!

Published Wed, May 3 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

కిరోసిన్‌ కోటా కట్‌!

కిరోసిన్‌ కోటా కట్‌!

మున్సిపల్‌ ప్రాంతాల్లో 4 నుంచి 2 లీటర్లకు కుదింపు
లీటరు ధర రూ.19 నుంచి రూ.21కి పెంపు
జిల్లాలో లబ్ధిదారులపై నెలకు రూ.12 లక్షలపైనే భారం
నిన్న పామాయిల్, చక్కెర.. నేడు కిరోసిన్‌


ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : పేదలకు సబ్సిడీ రూపంలో అందించే కిరోసిన్‌ కోటాలో కోత విధించారు. లీటరు ధరను రూ.21కి పెంచుతూ రాష్ట్ర    ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజలపై తీవ్రంగా భారం పడనుంది. మున్సిపల్‌ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు    ఇప్పటివరకు అందించిన 4 లీటర్ల కిరోసిన్‌ను 2 లీటర్లకు కుదించగా.. మండల కేంద్రాల్లోని లబ్ధిదారులకు గ్యాస్‌ సిలిండర్‌ ఉంటే ఒక లీటరు, లేకుంటే రెండు లీటర్లను ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు సిలిండర్‌ ఉన్నా.. లేకున్నా ఒక లీటరు మాత్రమే సబ్సిడీ కిరోసిన్‌ను ఇవ్వనుంది. అలాగే కిరోసిన్‌ను ఇది వరకు లీటరుకు రూ.19కి అందించగా, ప్రస్తుతం లీటరుపై అదననంగా రూ.3 లకు పెంచి లీటరు కిరోసిన్‌ను రూ.21కి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పేద లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కుదింపెంత? భారమెంత?
జిల్లాలో 3,76,656 రేషన్‌ కార్డులున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ కిరోసిన్‌ కోటాను తగ్గించడం, ధర పెంచడానికి ముందు 4,93,130 లీటర్ల కిరోసిన్‌ను జిల్లాకు కోటాగా పంపేది. ప్రస్తుతం తీసుకున్న కుదింపు నిర్ణయంతో 92,679 లీటర్లు తగ్గి 4,00,451 లీటర్లకు చేరుకుంది. అంటే దాదాపు లక్షల లీటర్లు జిల్లా సబ్సిడీ కిరోసిన్‌ కోటాలో కోత పడింది. అత్యధికంగా మున్సిపల్‌ ప్రాంతాల్లో ఉంటున్న లబ్దిదారులకు 4 నుంచి 2 లీటర్లకు కుదించడంతో ఇక్కడే అత్యధికంగా జిల్లా కోటా కోతకు గురైంది. అదే విధంగా రూ.19 ఉన్న లీటరు కిరోసిన్‌ ధరను రూ.3లు అదనంగా పెంచి రూ.21కి చేర్చడంతో జిల్లా రేషన్‌ కిరోసిన్‌ లబ్ధిదారులపై నెలకు రూ.12,01,353 భారం పడుతోంది.

ఒక్కోటి ఎత్తేస్తున్నారు..
వివిధ రకాల రేషన్‌ పొందే పేద లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటి తొలగిస్తూ వస్తోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చక్కెరపై సబ్సిడీని ఎత్తివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారి చక్కెర పంపిణీని ఎత్తేసింది. అలాగే పామాయిల్‌ సరఫరాను కూడా ఇదే కారణంతో రాష్ట్ర సర్కారు ఎత్తివేసింది. ఫలితంగా రేషన్‌ పొందే పేద ప్రజలు భారమైన అధిక ధరను వెచ్చించి వంట నూనె, చక్కెరను దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు.

ప్రస్తుతం కిరోసిన్‌ కోటాను తగ్గించడం, «లీటరు ధరను పెంచడాన్ని చూస్తే ఏదో ఒక రోజు క్రమ క్రమంగా కిరోసిన్‌ను కూడా ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా రేషన్‌ దుకాణాల్లో అందించే సబ్సిడీ సరుకులను ఒక్కోటి ఎత్తివేస్తూ ప్రజా పంపిణీ వ్యస్థను క్షిణింపజేస్తోంది. ఈ విషయమై డీఎస్‌ఓ కృష్ణప్రసాద్‌ను అడుగగా.. సబ్సిడీ కిరోసిన్‌ కోటాలో కోత విధిస్తూ.. లీటరు ధరను పెంచుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు అందాయని తెలిపారు. దీనిపై జిల్లాలోని సంబంధిత సివిల్‌ సప్లయి అధికారులకు, రేషన్‌ డీలర్లకు సమాచారం అందించడం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement