
ఆదిమ మానవుని గుహ
కామారెడ్డి : ప్రాచీన శిలాయుగానికి చెందిన ఆనవా ళ్లు మాచారెడ్డి మండలం ఎల్లంపేట అటవీ ప్రాంతంలోని మఠంరాళ్లతండాలో వెలుగుచూసాయి. ఈ ప్రాంతంలో క్రీ.పూ. 10 వేల నుంచి 5 వేల సంవత్సరాల కాలం నాటి ఆదిమ మానవుడు నివసించిన గుహను కాకతీయ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో పరిశోధన చేస్తున్న తూ ము విజయ్‌కుమార్ కనుగొన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’ కి వివరాలు అందజేశారు. 6వ శతాబ్దంలో జనప దం ఏర్పడడానికి ఇక్కడ పూర్వం నుంచి మానవ సంచా రం ఉన్నదని శిలాయుగం నాటి కుడ్య చిత్రాల ద్వారా తెలుస్తుందన్నారు. అటవీ ప్రాంతం కావడం వల్ల నాటి మానవులు అక్కడే నివసిస్తూ, ఆహార సేకరణ చేసి ప్రాచీన శిలాయుగానికి ఇక్కడ గుహాలయం ఏర్పాటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతం చారిత్రాత్మకమైనటువంటి ఆనవాళ్లు కలది బాహ్య ప్రపంచంలోకి రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. మానవ పరిణామ క్రమంలో చరి త్ర రచనకి ఆధారంగా మన ప్రాంతం చెప్పవచ్చన్నారు. ఈ ఆదిమ మానవుని నివాస ప్రాంతం, (గుహ) నాటి సంస్కృతికి సంబంధించినటువంటి కుడ్య చిత్రాలు ఎరుపు వర్ణం తో వేసిన చిత్రాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
ఇక్కడ జీవనం సాగించిన ఆదిమ మానవులు వారి జీవనశైలి, వారి భావాలు, వారు వాడిన వస్తువులు, జంతువుల చిత్రాలు, గణితశాస్త్ర గుర్తులు, గుహ గోడలపై కలవు. జింక, దుప్పి, కొమ్ములు, దుప్పి, కుక్క, చేప, మనిషి కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలను పరిశీలించినట్టయితే ఆదిమ మానవుడు తాను అడవిలో జంతువులతో సంచారం చేస్తూ వాటితో సహజీవనం చేయడం, వాటిని ఎర్రని వర్ణంతో చిత్రాలుగా గీయడం చేశారు. ఈ గుహలో 4 వందలకు పైగా చిత్రాలు ఉన్నాయి. ఎంతో నైపుణ్యంతో కుడ్య చిత్రాల్ని గీశారు. గుహ పెద్ద బండరాయి కింద ఉంది. దీనిని ఆవాస కేంద్రంగా చేసుకుని గుహకి కుడి, ఎడమ వైపుల నుంచి ప్రహరీ లాంటి రాళ్లతో గోడ నిర్మించారు. ఆదిమ మానవునికి నిర్మాణం కూడా తెలుసని అర్థమవుతోంది.