విద్యార్థులపై ప్రిన్సిపల్ బెల్టుతో దాడి
-
ఓ విద్యార్థికి రక్త గాయాలు
-
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
వెంకటాచలం:
స్టడీ అవర్‌కు కొంచం ఆలస్యంగా వెళ్లిన విద్యార్థులపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అంతటితో ఆగకుండా తన బెల్టుతీసుకుని నలుగురు విద్యార్థులపై ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు. వీరిలో ఒకరికి రక్తగాయాలు కావడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా వెంకటాచలం సరస్వతీనగర్‌లోని రవీంద్ర భారతి స్కూల్లో మంగళవారం జరిగింది. గాయపడిన విద్యార్థి తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు పట్టణానికి చెందిన పుచ్చలపల్లి వెంకటేశ్వర్లు కుమారుడు ఫనీష్ వెంకటాచలంలోని రవీంద్రభారతి ప్రైవేటు స్కూల్‌లో 10వ తరగతి హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం ఆ విద్యార్థితోపాటుగా మరో ముగ్గురు కాస్త ఆలస్యంగా స్టడీ అవర్‌కు వెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఆ నలుగురు విద్యార్థులను తన బెల్టుతీసి ఇష్టానుసారంగా కొట్టారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వీరిలో గూడూరుకు చెందిన ఫనీష్‌కు రక్తగాయాలయ్యాయి. చెవిపైనా, చేతిపైన రక్తం గడ్డకట్టింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం 11గంటలకు స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపల్‌ను నిలదీశారు. విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొట్టడం ఏమిటని వాగ్వాదానికి దిగారు. స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది తల్లిదండ్రులకు సర్దిచెప్పారు. మరోసారి ఇలా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. విద్యార్థి ఫనీష్ తండ్రి వెంకటాచలం పోలీస్‌స్టేషన్లో స్కూల్ ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేశారు.