టీడీపీ ప్రచారానికి పెద్దపీట! | priority for publicity | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రచారానికి పెద్దపీట!

Published Wed, Sep 20 2017 12:11 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM

టీడీపీ ప్రచారానికి పెద్దపీట! - Sakshi

టీడీపీ ప్రచారానికి పెద్దపీట!

-పేరుకే పొదుపు మహిళల సమ్మేళనం
- సీఎం సభలో టీడీపీ నాయకులకే ప్రాధాన్యం
– 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుపైనే నాయకుల ప్రసంగాలు
– ప్రతిపక్షాన్ని విమర్శించడమే లక్ష్యంగా సాగిన ప్రభుత్వ కార్యక్రమం
 
నంద్యాల: నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్లు తయారైంది అధికార పార్టీ  తీరు. ప్రభుత్వ కార్యక్రమాన్ని కాస్త తెలుగుదేశం కార్యక్రమంగా మార్చి ప్రతిపక్షాన్ని విమర్శించడమే లక్ష్యంగా సీఎం, మంత్రులు ప్రసంగాలు చేశారు.   నంద్యాలలో మంగళవారం పొదుపు మహిళలతో  ముఖాముఖి ప్రభుత్వ కార్యక్రమం  నిర్వహించారు. ఈ సమావేశానికి పొదుపు మహిళలను మెప్మా, ఐకేపీ అధికారులు గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులలో భారీగా తరలించారు. పొదుపు మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నారని, పొదుపు మహిళలు కచ్చితంగా హాజరు కావాలని చెప్పి వారిని తీసుకొచ్చారు. ఈ సభ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.  సభ స్టేజ్‌పైన మహిళలతో ముఖాముఖి కార్యక్రమం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్‌ పెట్టారు. అయితే, ఒక్క మహిళతో కూడా సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడకపోవడం  గమనార్హం. కార్యక్రమం ఆద్యంతం తెలుగుదేశం పార్టీ సమావేశంగా జరిగింది.
 
ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ నాయకులకు చోటు...
ప్రభుత్వం ఆధ్వర్యంలో నంద్యాలలో నిర్వహించిన మహిళల సమావేశంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు సీఎం పక్కనే సీట్లు వేసి కూర్చోబెట్టారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులను మాత్రమే స్టేజ్‌పైన కూర్చోనే అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ చోటా నాయకులకు కూడా స్టేజ్‌పైన కూర్చొనే అవకాశం ఇవ్వడాన్ని చూసి ఔరా రాజకీయాలు ఎలా దిగజారి పోయాయంటూ స్థానికులు చర్చించుకున్నారు. 
 
టీడీపీ ప్రచార కార్యక్రమంలా సమావేశం...
ప్రభుత్వ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీపీ ప్రచారానికి వాడుకున్నారు. ఈ సమావేశంలో అధికారపార్టీ చేసిన అభివృద్ధి పనులు, చేయబోయే పనుల గురించి ప్రజలు చెప్పాలి. అయితే, తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలో ఎలా గెలవాలి అన్నదానిపైనే సమావేశంలో సీఎంతో సహా మంత్రులు, అధికారులు మాట్లాడటం చూసి అందరూ నవ్వుకున్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పదేపదే కాకినాడ, నంద్యాల ఉప ఎన్నిక, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా గెలిపించాలి అన్నదానిపైనే  ప్రసంగించారు. ఆయనదారిలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు  తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది.. రేపు ఎలా గెలవబోతుందో మాట్లాడారే తప్ప నంద్యాల అభివృద్ధి ఊసే ఎత్తలేదు.
 
ప్రతిపక్షమే లక్ష్యంగా ప్రసంగాలు..
ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా చేసుకొని నాయకులు సమావేశంలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుంటే బాగుంటుందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరడం తీవ్ర చర్చనీయాంశమైంది. మూడున్నర తెలుగుదేశం పార్టీ పాలనలో ఆ పార్టీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడటానికి ఏమీ లేక ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారానే గుసగుసలు సమావేశంలో ప్రజల నుంచి వినిపించాయి. ఎంచక్క పార్టీ నాయకులకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వ నిధులతో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారనే చర్చ జరిగింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement