podupu groups
-
టీడీపీ ప్రచారానికి పెద్దపీట!
-పేరుకే పొదుపు మహిళల సమ్మేళనం - సీఎం సభలో టీడీపీ నాయకులకే ప్రాధాన్యం – 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుపైనే నాయకుల ప్రసంగాలు – ప్రతిపక్షాన్ని విమర్శించడమే లక్ష్యంగా సాగిన ప్రభుత్వ కార్యక్రమం నంద్యాల: నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్లు తయారైంది అధికార పార్టీ తీరు. ప్రభుత్వ కార్యక్రమాన్ని కాస్త తెలుగుదేశం కార్యక్రమంగా మార్చి ప్రతిపక్షాన్ని విమర్శించడమే లక్ష్యంగా సీఎం, మంత్రులు ప్రసంగాలు చేశారు. నంద్యాలలో మంగళవారం పొదుపు మహిళలతో ముఖాముఖి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి పొదుపు మహిళలను మెప్మా, ఐకేపీ అధికారులు గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులలో భారీగా తరలించారు. పొదుపు మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నారని, పొదుపు మహిళలు కచ్చితంగా హాజరు కావాలని చెప్పి వారిని తీసుకొచ్చారు. ఈ సభ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సభ స్టేజ్‌పైన మహిళలతో ముఖాముఖి కార్యక్రమం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్ పెట్టారు. అయితే, ఒక్క మహిళతో కూడా సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడకపోవడం గమనార్హం. కార్యక్రమం ఆద్యంతం తెలుగుదేశం పార్టీ సమావేశంగా జరిగింది. ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ నాయకులకు చోటు... ప్రభుత్వం ఆధ్వర్యంలో నంద్యాలలో నిర్వహించిన మహిళల సమావేశంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు సీఎం పక్కనే సీట్లు వేసి కూర్చోబెట్టారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులను మాత్రమే స్టేజ్‌పైన కూర్చోనే అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ చోటా నాయకులకు కూడా స్టేజ్‌పైన కూర్చొనే అవకాశం ఇవ్వడాన్ని చూసి ఔరా రాజకీయాలు ఎలా దిగజారి పోయాయంటూ స్థానికులు చర్చించుకున్నారు. టీడీపీ ప్రచార కార్యక్రమంలా సమావేశం... ప్రభుత్వ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీపీ ప్రచారానికి వాడుకున్నారు. ఈ సమావేశంలో అధికారపార్టీ చేసిన అభివృద్ధి పనులు, చేయబోయే పనుల గురించి ప్రజలు చెప్పాలి. అయితే, తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలో ఎలా గెలవాలి అన్నదానిపైనే సమావేశంలో సీఎంతో సహా మంత్రులు, అధికారులు మాట్లాడటం చూసి అందరూ నవ్వుకున్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పదేపదే కాకినాడ, నంద్యాల ఉప ఎన్నిక, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా గెలిపించాలి అన్నదానిపైనే ప్రసంగించారు. ఆయనదారిలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది.. రేపు ఎలా గెలవబోతుందో మాట్లాడారే తప్ప నంద్యాల అభివృద్ధి ఊసే ఎత్తలేదు. ప్రతిపక్షమే లక్ష్యంగా ప్రసంగాలు.. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా చేసుకొని నాయకులు సమావేశంలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుంటే బాగుంటుందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరడం తీవ్ర చర్చనీయాంశమైంది. మూడున్నర తెలుగుదేశం పార్టీ పాలనలో ఆ పార్టీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడటానికి ఏమీ లేక ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారానే గుసగుసలు సమావేశంలో ప్రజల నుంచి వినిపించాయి. ఎంచక్క పార్టీ నాయకులకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వ నిధులతో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారనే చర్చ జరిగింది. -
పొదుపు మహిళలందరికీ రూపే కార్డులు
కర్నూలు(హాస్పిటల్): నగదు కొరత నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ రూపే కార్డులు యాక్టివేట్ చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు వెలుగు సీఈఓ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. జిల్లాలో ఎంత మంది పొదుపు మహిళలకు జనధన్ఖాతాలున్నాయి, ఎంత మందికి ఎస్బీ అకౌంట్లున్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. జనధన్ ఉన్న వారికి రూపే కార్డులున్నాయా..?, ఉంటే ఎన్ని యాక్టివ్‌లో ఉన్నాయి, యాక్టివ్‌లో లేని వాటికి ఎలా అమలులోకి తీసుకురావాలనే విషయాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనధన్ ఖాతా లేని వారికి సాధారణ ఏటీఎంలు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 4లక్షలకు పైగా పొదుపు మహిళలు ఉన్నారు. వీరందరికీ ఒకటో తేది నాటికి రూపే, ఏటీఎం కార్డులు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
రుణమాఫీ పేరుతో మోసం
– ఎమ్మెల్యే ఎదుట పొదుపుగ్రూపు మహిళల ఆవేదన ఆలూరు రూరల్ : పొదుపు సంఘాలు రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీచ్చి తమను మోసం చేశారని ఆలూరు నియోజకవర్గంలోని ఆయా మండలాల పొదుపుగ్రూపు మహిళలు నాగవేణమ్మ, కుమారి తదితరులు శనివారం ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఎదుట వాపోయారు. శనివారం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో పొదుపుగ్రూపు మహిళలకు పసుపు–కుంకుమ కార్యక్రమ నిర్వహించారు. ఐకేపీ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ రామకృష్ణ, అడిషనల్ పీడీ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆయా మండలాల పొదుపుమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, తేదేపా ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వీరభద్రగౌడ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. 3,626 పొదుపు గ్రూపులకు పొదుపు రెండు విడత మాఫీ, అలాగే బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను ఆయా సంఘాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఆయా మండలాల పొదుపుగ్రూపులు తమకు రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండోదఫా రుణమాఫీ కింద రూ.3 వేలు చొప్పున మా ఖాతాల్లో నగదును జమ చేస్తున్నామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారని, అయితే ఎప్పుడు పడుతాయో చెప్పడం లేదని మహిళలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందు తాము చంద్రబాబునాయుడు మాటలను నమ్మి ఆయనకు ఓట్లు వేసి మోసపోయామని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే మాటా్లడుతూ పొదుపుగ్రూపు మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని తమపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని చెప్పారు. త్వరలో బాబు మోసాలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందుకు పొదుపుగ్రూపు సభ్యులు అండగా ఉండాలని కోరారు. అంతకముందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను పొదుపుగ్రూపు సభ్యులు, ఐకేపీ సిబ్బంది పూలమాలలు వేసి అభినందించారు. ఎమ్మెల్యే వెంట ఆయన సోదరుడు గుమ్మనూరు శ్రీను, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చిన్నరన్న, పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు. -
ఎస్సీ పొదుపు గ్రూపులకు నేరుగా రుణాలు
– బ్యాంకుల ప్రమేయం లేకుండా ఒక్కో గ్రూపునకు రూ.5 లక్షలు – పరిశ్రమల ఏర్పాటుకు రూ.1 కోటి వరకు రుణం – భూమి కొనుగోలుకు అధిక ప్రాధాన్యత – ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ కర్నూలు (అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఎస్సీ వర్గాలకు చెందిన మహిళా పొదుపు గ్రూపులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కో గ్రూపుకు రూ.5 లక్షల వరకు నేరుగా రుణాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ' స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం ' కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేషన్ ఈడీ ఎస్ సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజయకుమార్ మాట్లాడుతూ మహిళా గ్రూపులకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారానే రుణాలు అందిచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎస్సీ వర్గాలకు చెందిన యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూడా కార్పొరేషన్ అన్ని విధాల ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రూ.1 కోటి వరకు రుణాలు అందిస్తామన్నారు. ఇందులో రూ.35 లక్షల వరకు సబ్సిడీ ఉంటుందన్నారు. జిల్లాలో రూ.400 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ఎస్సీ వర్గాలకు భూములు కొని ఇప్పించేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. ప్రతి ఎస్సీ లబ్ధిదారునికి మూడు ఎకరాలు మెట్ట లేక ఒక తడి పండే భూమి అయితే రెండు ఎకరాలు, రెండు తడులు పండే భూమి అయితే ఒక ఎకరా ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమానికి ముందు హాజరైన పొదుపు సంఘాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధికి సంబంధించి పలు అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. అనంతరం జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఎంపీడీఓ, తహసీల్దార్లు, బ్యాంకు మేనేజర్లకు ఓబీఎంఎంఎస్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారి కార్యాలయం ఈఓలు పులిచేరి సారయ్య, రవి, స్థానిక కార్యాలయం ఈఓ సుశేశ్వరరావు, ఏఈఓ సుంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.