రుణమాఫీ పేరుతో మోసం
రుణమాఫీ పేరుతో మోసం
Published Sun, Nov 20 2016 12:40 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
– ఎమ్మెల్యే ఎదుట పొదుపుగ్రూపు మహిళల ఆవేదన
ఆలూరు రూరల్ : పొదుపు సంఘాలు రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీచ్చి తమను మోసం చేశారని ఆలూరు నియోజకవర్గంలోని ఆయా మండలాల పొదుపుగ్రూపు మహిళలు నాగవేణమ్మ, కుమారి తదితరులు శనివారం ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఎదుట వాపోయారు. శనివారం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో పొదుపుగ్రూపు మహిళలకు పసుపు–కుంకుమ కార్యక్రమ నిర్వహించారు. ఐకేపీ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ రామకృష్ణ, అడిషనల్ పీడీ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆయా మండలాల పొదుపుమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, తేదేపా ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. 3,626 పొదుపు గ్రూపులకు పొదుపు రెండు విడత మాఫీ, అలాగే బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను ఆయా సంఘాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఆయా మండలాల పొదుపుగ్రూపులు తమకు రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండోదఫా రుణమాఫీ కింద రూ.3 వేలు చొప్పున మా ఖాతాల్లో నగదును జమ చేస్తున్నామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారని, అయితే ఎప్పుడు పడుతాయో చెప్పడం లేదని మహిళలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందు తాము చంద్రబాబునాయుడు మాటలను నమ్మి ఆయనకు ఓట్లు వేసి మోసపోయామని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే మాటా్లడుతూ పొదుపుగ్రూపు మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని తమపార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారని చెప్పారు. త్వరలో బాబు మోసాలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందుకు పొదుపుగ్రూపు సభ్యులు అండగా ఉండాలని కోరారు. అంతకముందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను పొదుపుగ్రూపు సభ్యులు, ఐకేపీ సిబ్బంది పూలమాలలు వేసి అభినందించారు. ఎమ్మెల్యే వెంట ఆయన సోదరుడు గుమ్మనూరు శ్రీను, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చిన్నరన్న, పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు.
Advertisement
Advertisement