ఎస్సీ పొదుపు గ్రూపులకు నేరుగా రుణాలు
ఎస్సీ పొదుపు గ్రూపులకు నేరుగా రుణాలు
Published Wed, Nov 16 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
– బ్యాంకుల ప్రమేయం లేకుండా ఒక్కో గ్రూపునకు రూ.5 లక్షలు
– పరిశ్రమల ఏర్పాటుకు రూ.1 కోటి వరకు రుణం
– భూమి కొనుగోలుకు అధిక ప్రాధాన్యత
– ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్
కర్నూలు (అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఎస్సీ వర్గాలకు చెందిన మహిళా పొదుపు గ్రూపులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కో గ్రూపుకు రూ.5 లక్షల వరకు నేరుగా రుణాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక వీజేఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ' స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం ' కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేషన్ ఈడీ ఎస్ సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజయకుమార్ మాట్లాడుతూ మహిళా గ్రూపులకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారానే రుణాలు అందిచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎస్సీ వర్గాలకు చెందిన యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూడా కార్పొరేషన్ అన్ని విధాల ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రూ.1 కోటి వరకు రుణాలు అందిస్తామన్నారు. ఇందులో రూ.35 లక్షల వరకు సబ్సిడీ ఉంటుందన్నారు. జిల్లాలో రూ.400 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ఎస్సీ వర్గాలకు భూములు కొని ఇప్పించేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. ప్రతి ఎస్సీ లబ్ధిదారునికి మూడు ఎకరాలు మెట్ట లేక ఒక తడి పండే భూమి అయితే రెండు ఎకరాలు, రెండు తడులు పండే భూమి అయితే ఒక ఎకరా ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమానికి ముందు హాజరైన పొదుపు సంఘాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధికి సంబంధించి పలు అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. అనంతరం జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఎంపీడీఓ, తహసీల్దార్లు, బ్యాంకు మేనేజర్లకు ఓబీఎంఎంఎస్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారి కార్యాలయం ఈఓలు పులిచేరి సారయ్య, రవి, స్థానిక కార్యాలయం ఈఓ సుశేశ్వరరావు, ఏఈఓ సుంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement