కష్టాలుంటాయ్‌...భరించాల్సిందే..! | problems are there | Sakshi
Sakshi News home page

కష్టాలుంటాయ్‌...భరించాల్సిందే..!

Published Sat, Nov 26 2016 6:10 PM | Last Updated on Tue, Aug 14 2018 2:09 PM

problems are there

 సాక్షి, కడప :

పెద్దనోట్లను రద్దు చేస్తూ మోదీ ఒక నిర్ణయం తీసుకున్నారు. నల్లధనం వెలికితీతలో వేసిన అడుగు. అయితే ప్రజలకు కష్టాలు ఉంటాయి...తప్పదు భరించాల్సిందే! భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి...చిన్ననోట్ల సమస్య ఇప్పట్లో తీరదు...ప్రతి సమస్యకు పరిష్కారం వెతుకుతున్నాం...అందులో భాగంగానే డిసెంబరు మొదటి నుంచి నగదు రహిత చెల్లింపులు చేసేలా ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అందుకు సంబందించి రాజంపేటలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు వనం–మనం, జనచైతన్య యాత్రలో భాగంగా పాదయాత్రగా వచ్చిన అనంతరం పాత బస్టాండులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. ప్రతి ఇంటిలో ఖచ్చితంగా సెల్‌ఫోన్‌ ఉంటుందని....అదేవిధంగా బ్యాంకులో అకౌంట్‌ ఉంటుందని, కేవలం చిన్న అవగాహనతోనే చెల్లింపులు, ఇతరులకు మనీ ట్రాన్స్‌ఫర్‌ వంటివి అనేక సదుపాయలు పొందవచ్చన్నారు. ఇకనుంచి బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంటి వద్దనుంచే ఒక పాస్‌వర్డ్‌ ద్వారా ఆపరేట్‌ చేయవచ్చని, లేకపోతే వేలిముద్ర ద్వారా కూడా చెల్లింపులు చేసుకోవచ్చన్నారు. ఎక్కడికి వెళ్లినా కేవలం కార్డు ద్వారానే సరుకులు కొనుగోలు చేయవచ్చు...డబ్బులు తీసుకోవచ్చు...ప్రయాణాలు చేయవచ్చు...ఇలా ఏ పనైనా చేయవచ్చని, అందుకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులతోపాటు పలువురిని ఇళ్ల వద్దకు పంపి ప్రజలకు నేర్పిస్తామన్నారు.
ప్రతి కుటుంబానికి ఆదాయం
        సుమారు 15 సూత్రాల ద్వారా ప్రత్యేక పథక రచన చేశానని, దాని ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 10 వేల ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పేదరికాన్ని పారద్రోలడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నానని, శాశ్వతంగా డబ్బులు కుటుంబానికి అందేలా చూస్తానని తెలిపారు. ఎక్కడ సమస్య ఉన్నా తాను ముందుటానని, నేడు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకు రావడం ద్వారానే సీమలో కరువు లేకుండా పోయిందని...లేకుంటే ఈసారి సీమ రాళ్ల సీమగా మారేందన్నారు.
గండికోటకు, బ్రహ్మంసాగర్‌కు నీళ్లు తెచ్చా!
        ఎన్నో ఏళ్లుగా 'సీమ'లో కడప ప్రజలు తాగు, సాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా శ్రీశైలంకు నీరు తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా గండికోటకు తీసుకొచ్చాను. అంతేకాదు బ్రహ్మంసాగర్‌కు తొలిసారిగా నీళ్లు తీసుకొచ్చాను. తొమ్మిది టీఎంసీలు నీళ్లు తీసుకొచ్చా...జిల్లాను సస్యశ్యామలం చేశా...చివరికి పులివెందులలో చెట్లు ఎండిపోకుండా నేనే కాపాడా...ప్రతి అంశంలోనూ జిల్లాను అన్ని రంగాలలో రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే కడపజిల్లాను అధికంగా అభివృద్ది చేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ కాపు రుణాలను ఎంతోమందికి అందించా..
  కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్,
కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎంపీ సాయిప్రతాప్, మాజీ మంత్రి బ్రహ్మయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి, మల్లెల శ్రీవాణి, కస్తూరి విశ్వనాథరెడ్డి, ఎద్దల సుబ్బరాయుడు, ఇతర పలువురు నేతలు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement