టీడీపీ పాలనలో పెరిగిన అరాచకాలు
విజయవాడ (గాంధీనగర్) :
తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక నగరంలో అరాచకాలు పెరిగాయని, అధికార పార్టీ నాయకులు చట్టాలను తమ చుట్టాలుగా వాడుకుంటున్నారని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. కోగంటి సత్యం అక్రమ అరెస్ట్, పౌరహక్కుల ఉల్లంఘన, సేవా కార్యక్రమాల్లో రాజకీయ జోక్యానికి నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష మంగళవారం మూడో రోజుకు చేరుకుంది. మూడో రోజు దీక్షను శంకర్ ప్రారంభించి మాట్లాడారు. నగరంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల్లో టీడీపీ నాయకులకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం, పోలీసులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కాల్‌మనీ కేసులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండడంతో ఆ కేసును నీరు గార్చారని చెప్పారు. టీడీపీ నాయకులు శ్మశానాలు, కల్యాణ æమండపాలతో పాటు దేవుడి కార్యక్రమాలను కబ్జా చేస్తున్నారని, అడ్డువచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌లు చేయిస్తున్నారని విమర్శించారు. పారిశ్రామికవేత్త కోగంటి సత్యంపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నగర మాజీ డెప్యూటీ మేయర్ సిరిపురపు గ్రిటన్, సీపీఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో పౌరహక్కులను ఉల్లంఘిస్తున్నారన్నారు. నిరసన దీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపాధ్యక్షులు పోతిన వెంకట రామారావు, మహేంద్రసింగ్ సహానీ, ఫణిరాజు, ప్రగతి ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు బి. శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ నాయకులు బొక్కా ప్రభాకర్, బుద్దె రాజా, ఆర్. క్రాంతి, వాడపల్లి నానాజీ, పత్తిపాటి సోమేశ్వరరావు పాల్గొన్నారు.