కష్టాల ఖాతా | problems list | Sakshi
Sakshi News home page

కష్టాల ఖాతా

Published Thu, Dec 15 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

కష్టాల ఖాతా

కష్టాల ఖాతా

సాక్షి ప్రతినిధి, ఏలూరు : భీమవరం.. నరసాపురం.. జంగారెడ్డిగూడెం.. ఏలూరు.. కొవ్వూరు.. దెందులూరు.. ఊరు ఏదైనా.. వృద్ధుల కష్టాలు తీరడం లేదు. ప్రతినెలా 5వ తేదీలోగా అందాల్సిన పింఛను సొమ్ము.. 15వ తేదీనాటికీ అందకపోవడంతో వారు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. పెద్దనోట్ల రద్దు అనంతరం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛను సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వివిధ కారణాలరీత్యా జిల్లావ్యాప్తంగా సుమారు 15వేల మంది ఖాతాల్లో నేటికీ పింఛను సొమ్ము జమ కాలేదు. బ్యాంకులకు వెళితే.. సొమ్ము రాలేదని, సంబంధిత మునిసిపాలిటీ లేదా పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్నారు. ఆ కార్యాలయాలకు వెళుతుంటే.. సొమ్ము జమ చేశామని సమాధానమిస్తున్నారు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో వృద్ధులు 15 రోజులుగా అటు బ్యాంకులు, ఇటు స్థానిక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 
నగదు పరిమితి పెంచరేం!
బ్యాంకుల్లో తమ ఖాతాల నుంచి నగదు తీసుకునే పరిమితి పెంచాలని ఖాతాదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌బీఐ నిబంధనలను సైతం బ్యాంకర్లు అమలు చేయకపోవడంపై మండిపడుతున్నారు. వారానికి రూ.24 వేలు ఇవ్వాలని ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా.. ఎక్కడా అమలు కావడం లేదు. గురువారం బ్యాంకుల్లో  నగదు తక్కువగా ఉండటతో ఖాతాదారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్లపూడి ఆంధ్రాబ్యాంక్, ప్రక్కిలంక స్టేట్‌బ్యాంక్‌ వద్దకు అధిక  సంఖ్యలో ఖాతాదారులు రావడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. నగదు లేకపోవడంతో తాళ్లపూడి మం డలం ప్రక్కిలంక ఎస్‌బీఐలో రూ.6 వేల చొప్పున అందజేశారు. దీంతో ఖాతాదారులు మేనేజర్‌ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. తాడేపల్లిగూడెం ఎస్‌బీఐలో రూ.6 వేలు, యాక్సిస్‌ బ్యాంక్‌లో రూ.24 వేల చొప్పున ఇచ్చారు. అత్తిలి ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీఐ శాఖల్లో తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అక్కడకు చేరుకుని ఖాతాదారులకు సంఘీభావం తెలి పారు. బ్యాంక్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా నగదు పంపిణీ చేయాలని కోరారు. రూ.2 వేల చొప్పున ఇచ్చిన ఎస్‌బీఐ అధికారులు ఆ మొత్తాన్ని రూ.4 వేలకు, ఆంధ్రాబ్యాంక్‌ రూ.8 వేలకు పెంచి ఖాతాదారులకు ఇచ్చాయి. చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్‌ ఏటీఎంలు పనిచేశాయి. లింగపాలెం, కామవరపుకోట మండలాల్లో ఏటీఎంలు పని చేయలేదు.  బ్యాంకుల్లోనూ నగదు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నానికే ‘నో క్యాష్‌’ బోర్డులు దర్శనమిచ్చాయి. జంగారెడ్డిగూడెం ఆంధ్రాబ్యాంక్‌లో రైతులకు మాత్రం రూ.24 వేల చొప్పున నగదు అందజేశారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో బ్యాంకుల ఎదుట ‘నో క్యాష్‌’ బోర్డులు పెట్టారు. ఎక్కడా ఏటీఎంలు పనిచేయలేదు. భీమవరంలో వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంలు ఇప్పటికీ షట్లర్లు మూసి ఉన్నాయి. కొయ్యలగూడెంలో 9 బ్యాంకులు, జీలుగుమిల్లి, టి.నర్సాపురంలోని నాలుగు బ్యాంకుల్లో నగదులేక ఖాతాదారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. కొయ్యలగూడెంలో క్యూలైన్లలో నిలబడిన ఖాతాదారులను పోలీసులు నచ్చచెíప్పి వెనక్కి పంపించాల్సి వచ్చింది. బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడులలో ఉదయం ఒక గంట మాత్రమే నగదు ఇచ్చి, అనంతరం ‘నో క్యాష్‌’ బోర్డులు పెట్టారు. 20 ఏటీఎంలలో ఎక్కడా నగదులేక పోవటంతో మూతపడ్డాయి. చిల్లర నోట్లు కూడా ఎక్కడా ఇవ్వలేదు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement