కళ్లముందున్న రెక్కల కష్టం.. రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన ఆనందం కళ్లముందే ఆవిరవుతోంది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రోజులు, వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయక.. పగలూరాత్రి కాపలా కాయాల్సి వస్తోంది. అటు యాసంగి పంటల పనులు చేసుకోలేక.. ఇటు భార్యాబిడ్డలతో గడపలేక.. ఆవేదనలో కొట్టుమిట్టాడాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ఇదే. మంగళవారం రాత్రి ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో రైతుల ఇబ్బందులెన్నో వెలుగుచూశాయి. దీనిపై ప్రత్యేక కథనం..
ఈ ఫొటోలో ధాన్యం బస్తాల వద్ద గొంగళి కప్పుకుని కూర్చున్న రైతు పేరు గట్టన్న. వనపర్తి జిల్లా మదనాపురంలోని కొనుగోలు కేంద్రానికి 15 రోజుల కింద ధాన్యం తీసుకొచ్చాడు. ఐదు రోజుల క్రితం తూకం వేశారు. కానీ ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు రాలేదు. ధాన్యం మిల్లుకు చేరేదాకా రైతుదే బాధ్యత అని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో.. పగలు, రాత్రి ధాన్యం బస్తాల వద్దే కాపలా ఉంటున్నాడు.
కారు చీకట్లో రెక్కల కష్టం
మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా లింగారెడ్డిపేటలోని కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలపై పడుకున్న రైతులు వీరు. తాము ధాన్యం తెచ్చి సుమారు 20 రోజులు అవుతోందని, రోజూ ఇలా కాపలా కాయాల్సి వస్తోందని వారు వాపోయారు. ఇంటిదగ్గర భార్యాపిల్లలు ఆందోళన చెందుతున్నారని, త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడే కాదు.. జిల్లాలోని చాలా కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి. ‘‘పోయిన నెల 15న వడ్లను కొనుగోలు కేంద్రానికి తెచ్చిన. అప్పుడు పడ్డ వానలతో వడ్లు తడిసినయి. ఆరబెడుతూనే ఉన్నం. ఎప్పుడు కాంటా వేస్తారో’’ అని సదాశివనగర్‌కు చెందిన పోలబోయిన నర్సింలు వాపోయాడు.
ధాన్యం కుప్పల వద్దే తిండీతిప్పలు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి రోజులు గడుస్తున్నా తూకం వేయక.. తూకం వేసినా మిల్లులకు తరలించక.. ఆందోళన చెందుతున్నారు. పొద్దున కోతుల నుంచి, మధ్యాహ్నం–సాయంత్రం పశువుల నుంచి, రాత్రిపూట దొంగల నుంచి, కురిసే మంచు నుంచి ధాన్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో.. చలికి గజగజ వణుకుతూ వరికుప్పల వద్దే పడిగాపులు పడుతున్నారు. నిద్రకూడా పట్టక చలి మంటలు వేసుకుని కునికిపాట్లు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంగళవారం రాత్రి ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో రైతుల అవస్థలెన్నో వెలుగుచూశాయి. –సాక్షి నెట్‌వర్క్
15 రోజులుగా.. నిండు చలిలో..
మహబూబాబాద్ జిల్లా మైలారంలోని కొనుగోలు కేంద్రంలో మంగళవారం రాత్రి నిద్రిస్తున్న రైతులు వీరు. ఇక్కడ గ్రామానికి కిలోమీటర్ దూరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 15 రోజుల క్రితం సుమారు 70 మంది రైతులు ధాన్యం తెచ్చిపోశారు. ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదు. రోజూ ధాన్యాన్ని ఆరబెట్టడం, తిరిగి టార్పాలిన్లు కప్పిపెట్టడం, రాత్రిళ్లు కాపలా కాయడంతోనే సరిపోతోంది. ‘‘మూడెకరాల్లో పండిన ధాన్యాన్ని తెచ్చిపోశాను. మొదట తేమశాతం ఎక్కువగా ఉందన్నారు. తర్వాత దుబ్బ ఉందన్నారు. 15రోజులుగా రాత్రిళ్లు చలిలో కాపలా ఉంటున్నాం. ఎప్పుడు కొంటారనేది ఇంకా తేలడం లేదు’’ అని మైలారం గ్రామానికి చెందిన బానోత్ రమాకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ, బచ్చన్నపేట మండలం బండనాగారంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
60 ఏళ్ల వయసులో అరిగోస
నిండు చలిలో ధాన్యం కుప్ప దగ్గర నిద్రిస్తున్న ఈ రైతు పేరు బోళ్ల పాపిరెడ్డి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం నారాయణపురానికి చెందిన ఆయన.. పదిరోజుల కింద కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చాడు. ఇంకా కాంటా వేయలేదు. 60 ఏళ్ల వయసు దాటిన ఆయన.. పగలు ధాన్యం ఆరబెడుతూ, రాత్రిళ్లు కాపలాగా పడుకుంటూ అవస్థ పడుతున్నాడు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణిలోనూ 264 మంది రైతులు 50రోజుల క్రితం ధాన్యం తెచ్చారు. కొనుగోళ్లు మొదలై నెల గడుస్తున్నా.. 52 మంది వద్ద ధాన్యాన్ని తీసుకున్నారు. మిగతా రైతులకు పగలు, రాత్రి కాపలా తప్పట్లేదు.
దొరికింది తిని..
కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలోని చిన్న హోటల్ వద్ద మంగళవారం రాత్రి అల్పాహారం తింటున్న రైతులు వీరు. కొనుగోళ్లలో జాప్యంతో నెల రోజుల నుంచి రైతులు పగలూరాత్రి అక్కడే పడిగాపులు పడుతున్నారు. దీనితో స్థానిక మహిళ ఒకరు తోపుడు బండిపై చిన్నపాటి హోటల్ పెట్టారు. ఇక్కడే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో చాలా చోట్ల రైతులు కొనుగోలు కేంద్రాల్లో అవస్థలు పడుతున్నారు.
పది రోజులుగా...
మంగళవారం రాత్రి ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఎల్కపల్లిలో ధాన్యానికి కాపలా ఉన్న రైతులు వీరు. కొనుగోళ్ల కోసం పది రోజులుగా ఎదురుచూస్తున్నామని, రాత్రిపూట ఇలా ధాన్యానికి కాపలా ఉంటున్నామని వారు చెప్పారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, లక్ష్మణచాంద మండలం రాచాపూర్, వడియల్ కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి.
55 రోజుల్నుంచి కావలి ఉన్నా..
ధాన్యం కుప్ప పై నిద్రిస్తున్న ఈ రైతు సంగారెడ్డి జిల్లా అందోలు గ్రామానికి చెందిన చాకలి బేతయ్య. 55 రోజుల క్రితం పంట కోతలు పూర్తయ్యాయి. ఆయనతోపాటు మరో 40 మంది రైతులు ఇక్కడ గతేడాది కొనుగోలు కేంద్రం పెట్టిన స్థలంలో ధాన్యాన్ని కుప్పపోశారు. కానీ ఇటీవలి వరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో ధాన్యానికి కాపలా కోసం అవస్థలు పడుతూ వచ్చారు. ‘‘55 రోజులుగా పగలూ రాత్రి కాపలా ఉంటున్నాం. రాత్రిళ్లు చలికి వణికిపోతున్నాం.’’ అని బేతయ్య వాపోయాడు. మెదక్ జిల్లా రేగోడ్ మండలం రేగోడ్, కొత్వాన్‌పల్లి గ్రామాల్లో రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
కరెంట్ లేక చీకట్లో ఇక్కట్లు..
సిద్దిపేట జిల్లా బండచెర్లపల్లిలో మంగళవారం అర్ధరాత్రి ధాన్యాన్ని జల్లి పడుతున్న రైతులు వీరు. జల్లి యంత్రాలు తక్కువగా ఉండటం, ఉన్నవి పాడైపోవడంతో.. రైతులు తమకు అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. రాత్రిపూట కూడా ఇలా తా లు తీస్తున్నారు. విద్యుత్ సౌకర్యం సరిగా లేక చీకట్లోనే పని చేసుకోవాల్సిన పరిస్థితి.
రాత్రిపగలూ ధాన్యం వద్దే..
ఈ ఫొటోలో ధాన్యం కుప్పల పక్కనే నిద్రిస్తున్న మహిళా రైతు పేరు మనెమ్మ. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్గొండకు చెందిన ఆమె.. వారం కింద ధాన్యాన్ని కొను గోలు కేంద్రానికి తెచ్చింది. రెండు రోజుల కిందే కొనుగోళ్లు మొదలయ్యాయి. తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఆ మహిళా రైతు వేచిచూస్తోంది. రాత్రిళ్లు ధాన్యం వద్దే నిద్రపోతున్నానని వాపోయింది. జోగుళాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్.. 23 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. రోజూ కాపలా ఉండాల్సి వస్తోందని వాపోయాడు.
రైతులు చెప్పిన సమస్యలేంటి?
- ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి వారా లు గడుస్తున్నా తూకం వేయట్లేదు. కొన్నిచోట్ల నెల రోజులకుపైగా వేచి చూస్తూనే ఉన్నారు.
- చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సౌకర్యాలు లేవు. మంచినీళ్లు, విద్యుత్ వంటివేవీ లేవు. రైతులు నీళ్లు, తిండి తెచ్చుకుంటున్నా.. రాత్రిపూట చీకట్లోనే గడపాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో చాలా వరకు ఊరవతల ఉండటంతో పాములు, విష పురుగుల భయంతో గడుపుతున్నారు.
- చలికాలం కావడంతో రాత్రిపూట మంచుకురుస్తోంది. ధాన్యంలో తేమ శాతం పెరిగే పరిస్థితి. దీనితో రైతులు పగలంతా ధాన్యాన్ని ఆరబోసి, సాయంత్రానికి కుప్పలు చేయాల్సి వస్తోంది.
- గన్నీ సంచులు లేక, మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాక.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయలేని పరిస్థితి ఉందని నిర్వాహకులు చెప్తున్నారు.
- ధాన్యాన్ని తూకం వేశాక కూడా రైతులకు తిప్పలు తప్పడం లేదు. ధాన్యాన్ని మిల్లులకు తరలించి, అక్కడి నుంచి ట్రాక్‌షీట్ వచ్చేవరకు రైతులే బాధ్యత వహించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. దీనితో రైతులు బస్తాలకు కాపలా ఉండాల్సి వస్తోంది.
ధాన్యం అమ్ముకునేదెలా?
ఈ చిత్రంలో ధాన్యానికి కాపలాగా ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు రైతు తాళ్లూరి నరసింహారావు. కొద్దిరోజుల క్రితమే పంటకోతలు పూర్తయినా.. ధాన్యాన్ని పొలంలోనే ఉంచుకుని కాపలా కాస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలా? ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాలా అన్న సందిగ్ధంలో ఉన్నట్టు చెప్తున్నాడు.
కొనుగోళ్లు ఎలా ఉన్నాయి?
నల్లగొండ రైతులతో గవర్నర్ మాటామంతి
నల్లగొండ రూరల్/రామగిరి (నల్లగొండ): ‘‘ఎంత ధాన్యం పండింది? ఎన్నిరోజుల కింద తెచ్చారు?’’ అంటూ గవర్నర్ తమిళిసై రైతులను అడిగారు. ఏవైనా సమస్యలుంటే చెప్పాలని కోరారు. రైతులు చెప్పిన అంశాలు, చేసిన విజ్ఞప్తులను విని.. సానుకూలంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బుధవారం నల్లగొండ శివారులోని ఆర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గవర్నర్ సందర్శించారు. చర్లపల్లికి చెందిన రైతు మధుసూదన్‌రెడ్డి, పాన్‌గల్‌కు చెందిన మహిళా రైతు మల్లమ్మను పలకరించారు. పది రోజుల కింద కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చామని వారు గవర్నర్‌కు వివరించారు. యాసంగిలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment