కొంపముంచిన అధికారుల అత్యుత్సాహం
గ్రోత్ సెంటర్ భూముల్ని ల్యాండ్‌సీలింగ్‌లో చేర్చిన రెవెన్యూ శాఖ
ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు నోచుకోని వైనం
లబోదిబో మంటున్న పారిశ్రామిక వేత్తలు
పరిష్కారంపై దష్టి సారించిన కొత్త కలెక్టరు
బొబ్బిలి : సర్కారుకు ఏదైనా ఆలోచన వస్తే అది అమలయ్యేవరకూ అధికారుల్ని ఊపిరి సలపనివ్వట్లేదు. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోనివ్వట్లేదు. పైగా వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు లేనిపోని ఒత్తిళ్లు తీసుకువస్తోంది. ఆ సందర్భంలోనే తప్పిదాలు జరిగిపోతున్నాయి. ఫలితంగా ఎంతోమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రోత్‌సెంటర్‌లోని భూములూ ఈ విధంగానే ల్యాండ్‌సీలింగ్‌లో చేరడంతో ఇప్పుడా భూములపై రుణాలు రావట్లేదు. అమ్ముకుంటే... రిజిస్ట్రేషన్ కావట్లేదు. ఆ సమస్య జఠిలమవుతుండటంతో పరిష్కారానికి జిల్లా కలెక్టర్ దష్టిసారించారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రాగానే మొదట చేసిన పని ప్రతి మండలంలోనూ ల్యాండ్‌బ్యాంకు ఏర్పాటు. ప్రభుత్వ భూమి ఎక్కడుందో అవన్నీ రికార్డుల్లోకి ఎక్కించి... మిగులుభూముల లెక్కలు తేర్చాలని సూచించింది. ఆభూమి క్రయ విక్రయాలు జరగకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సర్వే నంబర్లతో సహా వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. బొబ్బిలి మండల రెవెన్యూ అధికారులు వందల ఎకరాల్లో మిగులు భూములు చూపించాలన్న అత్యుత్సాహంతో గతంలో ప్రభుత్వం ఏపీఐఐసీకి ఇచ్చిన భూముల్నీ దానిలో కలిపేశారు. ఇప్పుడు ఆ భూములకు రిజిస్ట్రేషన్లు అవ్వక, బ్యాంకుల్లో అప్పు పుట్టక పారిశ్రామికవేత్తలు లబోదిబో మంటున్నారు.
పాతికేళ్ల క్రితమే ఏపీఐఐసీకి ప్రభుత్వ భూములు
బొబ్బిలిలో అతి పెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో 1100 ఎకరాల భూమిని సేకరించాలని అప్పట్లో నిర్ణయించారు. బొబ్బిలి పట్టణ శివారున గొల్లపల్లి, మెట్టవలస, పణుకువలస, కొత్తపెంట, నారాయణప్పవలస, కాశిందొరవలస పంచాయతీ పరిధిలో 1992లో భూసేకరణ చేపట్టారు. పారిశ్రామికవాడకు సేకరిస్తున్న భూముల్లో ప్రభుత్వానికి చెందిన డిపట్టా, పోరంబోకు, అసైన్డ్‌భూములు కూడా ఉన్నాయి. అలా ఉన్న దాదాపు 5 వందల ఎకరాల భూమిని ఆ నాడే ఏపీఐఐసీకి బదలాయించారు. భూసేకరణ ముగిశాక 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గ్రోత్‌సెంటర్ పనులకు శంకుస్థాపన చేశారు.
రెండేళ్లలోనే పారిశ్రామిక వేత్తలకు సేల్‌డీడ్
ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనే వారికి ఏపీఐఐసీ ద్వారా భూములను కేటాయిస్తున్నారు. భూములు తీసుకున్న పారిశ్రామిక వేత్తలు వాటిలో నిర్మాణాలు పూర్తి చేసి రెండేళ్ల పాటు ఉత్పత్తి చేస్తే ఆ భూములపై వారికే సేల్ డీడ్ రాసి ఇచ్చేస్తారు. అలా ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తోంది. మూడేళ్ల కిందట గ్రోత్‌సెంటర్‌కు ఇచ్చిన భూములు ప్రభుత్వానికే చెందుతాయని రెవెన్యూ అధికారులు వాదిస్తే ఉమ్మడి రాష్ట్రాల్లోని మౌలిక సదుపాయాల సంస్థ, రిజిష్ట్రేషను శాఖ ఉన్నతాధికారులు అందరూ స్పందించి ఒకసారి ప్రభుత్వం ఏపీఐఐసీకి భూములిస్తే ఇక అవి వారికే చెందుతాయని నిర్థారించి ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో మూడేళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారవేత్తలకు ఏపీఐఐసీ అధికారులు సేల్ డీడ్ ఇస్తున్నారు..
ల్యాండ్ బ్యాంకుతో మళ్లీ రిజర్వులోకి..
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ల్యాండ్ బ్యాంకు తయారు చేయడానికి ప్రభుత్వ భూముల వివరాలు సేకరించింది. ఇక్కడి రెవెన్యూ అధికారులు గ్రోత్‌సెంటర్‌లో ఉండే ఆనాటి ప్రభుత్వ డిపట్టా భూమి దాదాపు 3 వందల ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్లు ఇచ్చేశారు. ఆ భూముల్ని రిజిష్ట్రేషను చేయవద్దని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వివరాలు అందించారు. అప్పటినుంచి దాదాపు 30 యూనిట్లకు సంబంధించిన పారిశ్రామిక వేత్తలకు రిజిస్ట్రేషన్లు కావడం లేదు. అంతేగాదు... బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వట్లేదు. ఈ సమస్యను ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఏపీఐఐసీ అధికారుల దష్టికి సంబంధిత అధికారులు, వ్యాపార వేత్తలు తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. గొర్లెసీతారాంపురం రెవెన్యూ పరిధిలో 86 సర్వే భూములు, పణుకువలస పరిధిలో 277 సర్వే భూములు, మెట్టవలస పరిధిలో 96 సర్వే నంబర్లకు రిజిష్ట్రేషన్లు జరగడం లేదు..
కనిపించని రికార్డులు
పారిశ్రామికవేత్తలు పడుతున్న ఇబ్బందులపై ఇటీవల బొబ్బిలి వచ్చిన ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ కష్ణయ్య స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. జిల్లాకు కొత్తగా వచ్చిన కలñ క్టర్ వివేక్ యాదవ్ గ్రోత్‌సెంటర్ భూముల వ్యవహారంపై పూర్తిస్థాయి వివరాలు కావాలని అడుగుతున్నా అవి రెవెన్యూ కార్యాలయంలోఅందుబాటులో లేకపోవడంతో ఏం చెప్పాలో ఇప్పుడున్న అధికారులకు తెలియట్లేదు. 1992 నుంచి 95 వరకూ జరిగిన భూసేకరణలో ప్రభుత్వ భూమి ఏది? ఎంత ఉంది? రైతుల నుంచి సేకరించింది ఎంత? అప్పట్లో ఎంత చెల్లించారు? వంటి వివరాలేవీ ప్రస్తుతం మండల తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో లేదు. ల్యాండ్ బ్యాంకుకు ఇచ్చిన వివరాలు తరువాత ప్రభుత్వంతో జరిపిన ఉత్తర ప్రత్యురాలు కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. అయితే కలెక్టర్ దీనిపై దష్టిసారించినంతున తమ సమస్య పరిష్కారమవుతుందని పారిశ్రామిక వేత్తలు ఆశతో ఉన్నారు.