Growth Centre
-
కనిపించని గ్రోత్
‘‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు పోటీలు పడుతున్నారు.. వేలాది మందికి ఉపాధి కల్పించాం..వందలాది పరిశ్రమలు తీసుకొచ్చామంటూ’’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వేదిక ఎక్కినా ఊకదంపుడు ఉపన్యాసాలతో హోరెత్తిస్తుంటారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సరైన ప్రోత్సాహకాలు లేక, పరిశ్రమలు నెలకొల్పేందుకు తగినన్ని వసతులు లేక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలెవరూ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రాకపోగా..ప్రభుత్వ విధానాలతో నిర్వహణ భారమై ఉన్న పరిశ్రమలూ ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి. జిల్లాలోని పారిశ్రామిక గ్రోత్ సెంటర్లలో గత నాలుగేళ్లలో చెప్పుకోదగిన ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో జిల్లాలోని పారిశ్రామికవాడలకు ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు చాలా వరకు మూతబడ్డాయి. పారిశ్రామిక రాయితీల్లేకపోవడం, విద్యుత్ చార్జీల పెంపు, జీఎస్టీ భారం పరిశ్రమలను దాదాపు నిర్వీర్యం చేసింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువు కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ వద్ద 1992 ప్రాంతంలో గ్రోత్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏపీఐఐసీ ఇక్కడ పారిశ్రామికవాడకు ఏర్పాట్లు చేసింది. పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో 131.6 ఎకరాలు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో 32.6 ఎకరాలు చొప్పున 164 ఎకరాలు భూములను కేటాయించింది. 2007లో వీటికి సంబంధించి 110 ప్లాట్లు వేశారు. వైఎస్ హయాంలో ఇక్కడ 45 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా సిమెంట్, ఇటుకల ఫ్యాక్టరీలు, పొగాకు ఫ్యాక్టరీలు, పండ్లు కూలింగ్ యూనిట్లు, పచ్చిపండ్లను మాగపెట్టే యూనిట్లు, ఐస్ ఫ్యాక్టరీలు, చిన్న చిన్న మెకానిక్ షెడ్లు ఏర్పాటయ్యాయి. వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్ల పాలనలో సింగరాయకొండ గ్రోత్ సెంటర్లో ఒక్క పరిశ్రమ రాలేదు. పసుపు, కారం పొడి ప్యాకింగ్ ఎక్స్‌పోర్ట్స్ యూనిట్లతో పలు పరిశ్రమలు ఇక్కడకు వస్తున్నట్లు అధికార పార్టీ నేతలు పలుమార్లు ప్రకటించారు. కానీ ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. మరోవైపు గతంలో ఎకరం లక్ష రూపాయలకు కేటాయించిన అధికారులు ఇప్పుడు ఎకరం రూ.50 లక్షలు చెబుతున్నారు. మరోవైపు పారిశ్రామిక రాయితీల్లేకపోవడం, విద్యుత్ చార్జీల పెంపు, జీఎస్టీ భారంతో ఇక్కడ పరిశ్రమ నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. మరోవైపు ఇక్కడ గ్రోత్ సెంటర్లో భూముల వివాదం పరిశ్రమలు రాకపోవడానికి తెలుస్తోంది. ఇక్కడి భూములు తమవేనంటూ తొలుత ఎండోమెంట్ విభాగం వివాదం లేవనెత్తింది. ఇందు కోసం ఏపీఐఐసీ పోరాటం చేయాల్సి వచ్చింది. ఇక్కడ పారిశ్రామికవేత్తల పోరాటంతో ఎట్టకేలకు ఎండోమెంట్ విభాగం వెనక్కు తగ్గింది. ఆ తర్వాత రెవెన్యూ భూములు తమవేనంటూ మరో వివాదం లేవనెత్తింది. వరుస వివాదాలతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. సమస్యలను పరిష్కరించి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు బాబు ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ కనబరచడం లేదు. గుండ్లాపల్లిదీ ఇదే పరిస్థితి: సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో గ్రోత్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1271 ఎకరాల భూములు కేటాయించారు. 644 ప్లాట్లు వేసి పరిశ్రమల పేరుతో పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. వైఎస్ హయాంలోనే ఇక్కడే 400 పరిశ్రమలు నెలకొల్పారు. ప్రధానంగా 250 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లతో పాటు పలు రకాల పరిశ్రమలు నెలకొల్పారు. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత ఇక్కడకు పరిశ్రమలు రాలేదు. చంద్రబాబు సర్కారు ఏర్పాటైన నాలుగేళ్లలో ఇక్కడ చిన్న చిన్న గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు 10 వరకు ఏర్పాటైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే గత నాలుగేళ్లలో 40 పరిశ్రమలు గ్రోత్ సెంటర్లో మూతబడటం గమనార్హం. జీఎస్టీ 28 శాతానికి పెంచటం, విద్యుత్ చార్జీలు మరింతగా పెంచటంతో పాటు పారిశ్రామిక రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు మూతబడే పరిస్థితి నెలకొంది. వైఎస్ హయాంలో రాయల్టీలో 40 శాతం రాయితీ ఇస్తే చంద్రబాబు సర్కారు పైసా ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు. మొత్తంగా అటు సింగరాయకొండ, గుండ్లాపల్లి పారిశ్రామికవాడలు పరిశ్రమల్లేక వెలవెలబోతున్నాయి. ఉన్న పరిశ్రమలు మూతబడే పరిస్థితి నెలకొనడంపై పారిశ్రామికవేత్తలతో పాటు ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జీఎస్టీతో ఇబ్బందులు జీఎస్టీ అమలులోకి రావటంతో నాలాంటి చిరు వ్యాపారులు దెబ్బతిన్నారు. గతంలో మార్కింగ్ చేసుకుని లోకల్ గా అమ్ముకుంటే కొద్దిగా డబ్బు మిగిలేది. కుటుం బాలు జరుపుకోవటానికి వీలుగా ఉండేది. ప్రస్తుతం జీఎస్టీ వలన చిరు వ్యాపారులు పూర్తిగా దెబ్బతిన్నారు. దీంతో ఏదో ఒక ఫ్యాక్టరీలలో స్కిల్డ్ వర్కర్లుగా చేరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో చాలా మంది స్కిల్డ్ వర్కర్లు ఉండటంతో అందరికీ సరిపడా ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉంది. – శ్యాం, స్కిల్డ్ వర్కర్, వ్యాపారి ప్రోత్సాహకాలు కరువు గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో పలు సమస్యలు పేరుకుపోయాయి. ముఖ్యంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జీఎస్టీ వలన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. గ్రానైట్ పరిశ్రమ మీద జీఎస్టీ ప్రభావం ఎక్కువగా ఉంది. బ్యాంకులు వ్యాపారస్తులకు సహకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వకపోవటంతో భారంగా మారుతోంది. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో గుండ్లకమ్మ రిజర్వాయర్ పక్కనే ఉన్నా తాగునీరు, వాడుక నీరు లేకపోవటం దారుణం. గ్రానైట్ వ్యర్థాలను రోడ్లపైనే వేస్తుండటంతో 60 అడుగుల రోడ్లు కూడా 15 అడుగులకు కుంచించుకుపోతున్నాయి. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఒక సమయం సందర్భం లేకుండా విద్యుత్ నిలిపి వేస్తుండటంతో మిషనరీ రన్నింగ్ కష్టంగా మారుతోంది. గ్రోత్‌సెంటర్ మొత్తంలో డ్రైనేజి వ్యవస్థ లేకపోవటం మరీ దారుణం. పబ్లిక్ టాయిలెట్లు లేకపోవటంతో రోడ్లపైనే మల విసర్జన చేస్తున్నారు. జంగిల్ క్లియరెన్స్ లేదు. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్యాక్టరీలు పెట్టడానికి ఎలా వస్తారు. – టీవై రెడ్డి, ఎండీ , లిఖిత ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ -
తప్పువారిది... చిక్కులు వీరికి!
కొంపముంచిన అధికారుల అత్యుత్సాహం గ్రోత్ సెంటర్ భూముల్ని ల్యాండ్‌సీలింగ్‌లో చేర్చిన రెవెన్యూ శాఖ ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు నోచుకోని వైనం లబోదిబో మంటున్న పారిశ్రామిక వేత్తలు పరిష్కారంపై దష్టి సారించిన కొత్త కలెక్టరు బొబ్బిలి : సర్కారుకు ఏదైనా ఆలోచన వస్తే అది అమలయ్యేవరకూ అధికారుల్ని ఊపిరి సలపనివ్వట్లేదు. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోనివ్వట్లేదు. పైగా వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు లేనిపోని ఒత్తిళ్లు తీసుకువస్తోంది. ఆ సందర్భంలోనే తప్పిదాలు జరిగిపోతున్నాయి. ఫలితంగా ఎంతోమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రోత్‌సెంటర్‌లోని భూములూ ఈ విధంగానే ల్యాండ్‌సీలింగ్‌లో చేరడంతో ఇప్పుడా భూములపై రుణాలు రావట్లేదు. అమ్ముకుంటే... రిజిస్ట్రేషన్ కావట్లేదు. ఆ సమస్య జఠిలమవుతుండటంతో పరిష్కారానికి జిల్లా కలెక్టర్ దష్టిసారించారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రాగానే మొదట చేసిన పని ప్రతి మండలంలోనూ ల్యాండ్‌బ్యాంకు ఏర్పాటు. ప్రభుత్వ భూమి ఎక్కడుందో అవన్నీ రికార్డుల్లోకి ఎక్కించి... మిగులుభూముల లెక్కలు తేర్చాలని సూచించింది. ఆభూమి క్రయ విక్రయాలు జరగకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సర్వే నంబర్లతో సహా వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. బొబ్బిలి మండల రెవెన్యూ అధికారులు వందల ఎకరాల్లో మిగులు భూములు చూపించాలన్న అత్యుత్సాహంతో గతంలో ప్రభుత్వం ఏపీఐఐసీకి ఇచ్చిన భూముల్నీ దానిలో కలిపేశారు. ఇప్పుడు ఆ భూములకు రిజిస్ట్రేషన్లు అవ్వక, బ్యాంకుల్లో అప్పు పుట్టక పారిశ్రామికవేత్తలు లబోదిబో మంటున్నారు. పాతికేళ్ల క్రితమే ఏపీఐఐసీకి ప్రభుత్వ భూములు బొబ్బిలిలో అతి పెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో 1100 ఎకరాల భూమిని సేకరించాలని అప్పట్లో నిర్ణయించారు. బొబ్బిలి పట్టణ శివారున గొల్లపల్లి, మెట్టవలస, పణుకువలస, కొత్తపెంట, నారాయణప్పవలస, కాశిందొరవలస పంచాయతీ పరిధిలో 1992లో భూసేకరణ చేపట్టారు. పారిశ్రామికవాడకు సేకరిస్తున్న భూముల్లో ప్రభుత్వానికి చెందిన డిపట్టా, పోరంబోకు, అసైన్డ్భూములు కూడా ఉన్నాయి. అలా ఉన్న దాదాపు 5 వందల ఎకరాల భూమిని ఆ నాడే ఏపీఐఐసీకి బదలాయించారు. భూసేకరణ ముగిశాక 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గ్రోత్‌సెంటర్ పనులకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే పారిశ్రామిక వేత్తలకు సేల్‌డీడ్ ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనే వారికి ఏపీఐఐసీ ద్వారా భూములను కేటాయిస్తున్నారు. భూములు తీసుకున్న పారిశ్రామిక వేత్తలు వాటిలో నిర్మాణాలు పూర్తి చేసి రెండేళ్ల పాటు ఉత్పత్తి చేస్తే ఆ భూములపై వారికే సేల్ డీడ్ రాసి ఇచ్చేస్తారు. అలా ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తోంది. మూడేళ్ల కిందట గ్రోత్‌సెంటర్‌కు ఇచ్చిన భూములు ప్రభుత్వానికే చెందుతాయని రెవెన్యూ అధికారులు వాదిస్తే ఉమ్మడి రాష్ట్రాల్లోని మౌలిక సదుపాయాల సంస్థ, రిజిష్ట్రేషను శాఖ ఉన్నతాధికారులు అందరూ స్పందించి ఒకసారి ప్రభుత్వం ఏపీఐఐసీకి భూములిస్తే ఇక అవి వారికే చెందుతాయని నిర్థారించి ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో మూడేళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారవేత్తలకు ఏపీఐఐసీ అధికారులు సేల్ డీడ్ ఇస్తున్నారు.. ల్యాండ్ బ్యాంకుతో మళ్లీ రిజర్వులోకి.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ల్యాండ్ బ్యాంకు తయారు చేయడానికి ప్రభుత్వ భూముల వివరాలు సేకరించింది. ఇక్కడి రెవెన్యూ అధికారులు గ్రోత్‌సెంటర్‌లో ఉండే ఆనాటి ప్రభుత్వ డిపట్టా భూమి దాదాపు 3 వందల ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్లు ఇచ్చేశారు. ఆ భూముల్ని రిజిష్ట్రేషను చేయవద్దని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వివరాలు అందించారు. అప్పటినుంచి దాదాపు 30 యూనిట్లకు సంబంధించిన పారిశ్రామిక వేత్తలకు రిజిస్ట్రేషన్లు కావడం లేదు. అంతేగాదు... బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వట్లేదు. ఈ సమస్యను ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఏపీఐఐసీ అధికారుల దష్టికి సంబంధిత అధికారులు, వ్యాపార వేత్తలు తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. గొర్లెసీతారాంపురం రెవెన్యూ పరిధిలో 86 సర్వే భూములు, పణుకువలస పరిధిలో 277 సర్వే భూములు, మెట్టవలస పరిధిలో 96 సర్వే నంబర్లకు రిజిష్ట్రేషన్లు జరగడం లేదు.. కనిపించని రికార్డులు పారిశ్రామికవేత్తలు పడుతున్న ఇబ్బందులపై ఇటీవల బొబ్బిలి వచ్చిన ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ కష్ణయ్య స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. జిల్లాకు కొత్తగా వచ్చిన కలñ క్టర్ వివేక్ యాదవ్ గ్రోత్‌సెంటర్ భూముల వ్యవహారంపై పూర్తిస్థాయి వివరాలు కావాలని అడుగుతున్నా అవి రెవెన్యూ కార్యాలయంలోఅందుబాటులో లేకపోవడంతో ఏం చెప్పాలో ఇప్పుడున్న అధికారులకు తెలియట్లేదు. 1992 నుంచి 95 వరకూ జరిగిన భూసేకరణలో ప్రభుత్వ భూమి ఏది? ఎంత ఉంది? రైతుల నుంచి సేకరించింది ఎంత? అప్పట్లో ఎంత చెల్లించారు? వంటి వివరాలేవీ ప్రస్తుతం మండల తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో లేదు. ల్యాండ్ బ్యాంకుకు ఇచ్చిన వివరాలు తరువాత ప్రభుత్వంతో జరిపిన ఉత్తర ప్రత్యురాలు కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. అయితే కలెక్టర్ దీనిపై దష్టిసారించినంతున తమ సమస్య పరిష్కారమవుతుందని పారిశ్రామిక వేత్తలు ఆశతో ఉన్నారు. -
100 గ్రామాలకు నగర శోభ!
ఏపీ రాజధాని చుట్టూ భూములిచ్చే రైతులకు అభివృద్ధిలో భాగస్వామ్యం విజయవాడ బ్యూరో: రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు రాజధానిగా మాత్రమే కాకుండా అన్ని రంగాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ‘గ్రోత్ సెంటర్’గా బెజవాడ నగరాన్ని అభివృద్ధి పర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఐటీ, పరిశోధన, కార్పొరేట్ సంస్థల ఏర్పాటుకు అవసరమైన కోట్లాది రూపాయల పెట్టుబడులు రావడానికి అనుగుణంగా.. రాజధాని నగర రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం నిపుణులతో చర్చించి నగర నిర్మాణం, అందులో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, నిర్మించాల్సిన భవన సముదాయాలు, సేకరించాల్సిన భూములపై కసరత్తు మొదలు పెట్టింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశమైన రాజధాని సలహా కమిటీ వివిధ అంశాలపై సమగ్రంగా సమీక్షించినట్లు సమాచారం. నాలుగు రోజుల కిందట ఛత్తీస్‌గఢ్ రాష్టంలోని నయా రాయ్‌పూర్ నగరాన్ని సందర్శించిన కమిటీ నగర రూపకల్పన, వివిధ నిర్మాణాలకు జరిగిన వ్యయంపై వివరాలను సేకరించారు. విజయవాడ చుట్టూ చేపట్టాల్సిన నిర్మాణాలు, సమీకరించాల్సిన భూములపై స్పష్టతకు వచ్చారు. దీన్నిబట్టి చూస్తే విజయవాడ, దాని పరిసరాల్లో నిర్మితమయ్యే రాజధాని చుట్టూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న సుమారు వందకు పైగా గ్రామ పంచాయతీలు నగర శోభను సంతరించుకోనున్నాయి. ఆయా గ్రామాల చుట్టూ ఉన్న భూములను సేకరించిన తర్వాత రైతుల భాగస్వామ్యంతో రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలను మెరుగుపర్చి నగరంతో అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అమల్లోకి వస్తే.. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ, అమరావతి మండలాల్లోని గ్రామాలు, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, కొండపల్లి, పరిటాల, గుంటుపల్లి, గొల్లపూడి, కొటికలపూడి, కొత్తపేట, దాములూరు, నున్న పరిసర గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలుస్తోంది. రెండు జిల్లాల్లోనూ (ప్రకాశం బ్యారేజీకి ఎగువన) నదికి ఇరువైపులా 12,500 ఎకరాల భూములను గుర్తించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 4 దశల్లో భూసేకరణ సాగుతుందని అధికారుల అంచనా.