కనిపించని గ్రోత్‌ | Growth Centres Not Useful In Prakasam | Sakshi
Sakshi News home page

కనిపించని గ్రోత్‌

Published Sun, Apr 22 2018 9:46 AM | Last Updated on Sun, Apr 22 2018 9:46 AM

Growth Centres Not Useful In Prakasam - Sakshi

గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ ముఖద్వారం

‘‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు పోటీలు పడుతున్నారు.. వేలాది మందికి ఉపాధి కల్పించాం..వందలాది పరిశ్రమలు తీసుకొచ్చామంటూ’’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వేదిక ఎక్కినా ఊకదంపుడు ఉపన్యాసాలతో హోరెత్తిస్తుంటారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సరైన ప్రోత్సాహకాలు లేక, పరిశ్రమలు నెలకొల్పేందుకు తగినన్ని వసతులు లేక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలెవరూ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రాకపోగా..ప్రభుత్వ విధానాలతో నిర్వహణ భారమై ఉన్న పరిశ్రమలూ ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి. జిల్లాలోని పారిశ్రామిక గ్రోత్‌ సెంటర్లలో గత నాలుగేళ్లలో చెప్పుకోదగిన ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో జిల్లాలోని పారిశ్రామికవాడలకు ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు చాలా వరకు మూతబడ్డాయి. పారిశ్రామిక రాయితీల్లేకపోవడం, విద్యుత్‌ చార్జీల పెంపు, జీఎస్‌టీ భారం పరిశ్రమలను దాదాపు నిర్వీర్యం చేసింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువు కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ వద్ద 1992 ప్రాంతంలో గ్రోత్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏపీఐఐసీ ఇక్కడ పారిశ్రామికవాడకు ఏర్పాట్లు చేసింది. పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో 131.6 ఎకరాలు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో 32.6 ఎకరాలు చొప్పున 164 ఎకరాలు భూములను కేటాయించింది.

2007లో వీటికి సంబంధించి 110 ప్లాట్లు వేశారు. వైఎస్‌ హయాంలో ఇక్కడ 45 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా సిమెంట్, ఇటుకల ఫ్యాక్టరీలు, పొగాకు ఫ్యాక్టరీలు, పండ్లు కూలింగ్‌ యూనిట్లు, పచ్చిపండ్లను మాగపెట్టే యూనిట్లు, ఐస్‌ ఫ్యాక్టరీలు, చిన్న చిన్న మెకానిక్‌ షెడ్లు ఏర్పాటయ్యాయి. వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్ల పాలనలో సింగరాయకొండ గ్రోత్‌ సెంటర్లో ఒక్క పరిశ్రమ రాలేదు. పసుపు, కారం పొడి ప్యాకింగ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ యూనిట్లతో పలు పరిశ్రమలు ఇక్కడకు వస్తున్నట్లు అధికార పార్టీ నేతలు పలుమార్లు ప్రకటించారు. కానీ ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. మరోవైపు గతంలో ఎకరం లక్ష రూపాయలకు కేటాయించిన అధికారులు ఇప్పుడు ఎకరం రూ.50 లక్షలు చెబుతున్నారు.

మరోవైపు పారిశ్రామిక రాయితీల్లేకపోవడం, విద్యుత్‌ చార్జీల పెంపు, జీఎస్‌టీ భారంతో ఇక్కడ పరిశ్రమ నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. మరోవైపు ఇక్కడ గ్రోత్‌ సెంటర్లో భూముల వివాదం పరిశ్రమలు రాకపోవడానికి తెలుస్తోంది. ఇక్కడి భూములు తమవేనంటూ తొలుత ఎండోమెంట్‌ విభాగం వివాదం లేవనెత్తింది. ఇందు కోసం ఏపీఐఐసీ పోరాటం చేయాల్సి వచ్చింది. ఇక్కడ పారిశ్రామికవేత్తల పోరాటంతో ఎట్టకేలకు ఎండోమెంట్‌ విభాగం వెనక్కు తగ్గింది. ఆ తర్వాత రెవెన్యూ భూములు తమవేనంటూ మరో వివాదం లేవనెత్తింది. వరుస వివాదాలతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. సమస్యలను పరిష్కరించి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు బాబు ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ కనబరచడం లేదు. 

గుండ్లాపల్లిదీ ఇదే పరిస్థితి: 
సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో గ్రోత్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1271 ఎకరాల భూములు కేటాయించారు. 644 ప్లాట్లు వేసి పరిశ్రమల పేరుతో పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. వైఎస్‌ హయాంలోనే ఇక్కడే 400 పరిశ్రమలు నెలకొల్పారు. ప్రధానంగా 250 గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లతో పాటు పలు రకాల పరిశ్రమలు నెలకొల్పారు. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత ఇక్కడకు పరిశ్రమలు రాలేదు. చంద్రబాబు సర్కారు ఏర్పాటైన నాలుగేళ్లలో ఇక్కడ చిన్న చిన్న గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లు 10 వరకు ఏర్పాటైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అయితే గత నాలుగేళ్లలో 40 పరిశ్రమలు గ్రోత్‌ సెంటర్లో మూతబడటం గమనార్హం. జీఎస్‌టీ 28 శాతానికి పెంచటం, విద్యుత్‌ చార్జీలు మరింతగా పెంచటంతో పాటు పారిశ్రామిక రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు మూతబడే పరిస్థితి నెలకొంది. వైఎస్‌ హయాంలో రాయల్టీలో 40 శాతం రాయితీ ఇస్తే చంద్రబాబు సర్కారు పైసా ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు. మొత్తంగా అటు సింగరాయకొండ, గుండ్లాపల్లి పారిశ్రామికవాడలు పరిశ్రమల్లేక వెలవెలబోతున్నాయి. ఉన్న పరిశ్రమలు మూతబడే పరిస్థితి నెలకొనడంపై పారిశ్రామికవేత్తలతో పాటు ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.  

జీఎస్‌టీతో ఇబ్బందులు
జీఎస్‌టీ అమలులోకి రావటంతో నాలాంటి చిరు వ్యాపారులు దెబ్బతిన్నారు. గతంలో మార్కింగ్‌ చేసుకుని లోకల్‌ గా అమ్ముకుంటే కొద్దిగా డబ్బు మిగిలేది. కుటుం బాలు జరుపుకోవటానికి వీలుగా ఉండేది. ప్రస్తుతం జీఎస్‌టీ వలన చిరు వ్యాపారులు పూర్తిగా దెబ్బతిన్నారు. దీంతో ఏదో ఒక ఫ్యాక్టరీలలో స్కిల్డ్‌ వర్కర్లుగా చేరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో చాలా మంది స్కిల్డ్‌ వర్కర్లు ఉండటంతో అందరికీ సరిపడా ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉంది. 
– శ్యాం,  స్కిల్డ్‌ వర్కర్, వ్యాపారి

ప్రోత్సాహకాలు కరువు
గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో పలు సమస్యలు పేరుకుపోయాయి. ముఖ్యంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జీఎస్‌టీ వలన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. గ్రానైట్‌ పరిశ్రమ మీద జీఎస్‌టీ ప్రభావం ఎక్కువగా ఉంది. బ్యాంకులు వ్యాపారస్తులకు సహకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్‌ ఇవ్వకపోవటంతో భారంగా మారుతోంది. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో  గుండ్లకమ్మ రిజర్వాయర్‌ పక్కనే ఉన్నా తాగునీరు, వాడుక నీరు లేకపోవటం దారుణం.

గ్రానైట్‌ వ్యర్థాలను రోడ్లపైనే వేస్తుండటంతో 60 అడుగుల రోడ్లు కూడా 15 అడుగులకు కుంచించుకుపోతున్నాయి. విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఒక సమయం సందర్భం లేకుండా విద్యుత్‌ నిలిపి వేస్తుండటంతో  మిషనరీ రన్నింగ్‌ కష్టంగా మారుతోంది. గ్రోత్‌సెంటర్‌ మొత్తంలో డ్రైనేజి వ్యవస్థ లేకపోవటం మరీ దారుణం. పబ్లిక్‌ టాయిలెట్లు లేకపోవటంతో రోడ్లపైనే మల విసర్జన చేస్తున్నారు. జంగిల్‌ క్లియరెన్స్‌ లేదు. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్యాక్టరీలు పెట్టడానికి ఎలా వస్తారు.
– టీవై రెడ్డి, ఎండీ , లిఖిత ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement