ప్రొద్దుటూరులోని కామిశెట్టి సుబ్బారావు చెన్నమ్మ కళాశాల విద్యార్థులను కర్ణాటక రాష్ట్రంలోని మృదేశ్వర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని కామిశెట్టి సుబ్బారావు చెన్నమ్మ కళాశాల విద్యార్థులను కర్ణాటక రాష్ట్రంలోని మృదేశ్వర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని ఎస్‌కేఎస్‌సీ విద్యార్థులు దసరా సెలవులు కావడంతో సుమారు 150 మందికి పైగా 3 బస్సుల్లో కర్ణాటక రాష్ట్రానికి ఈ నెల 4న విహార యాత్రకు వెళ్లారు. విహారయాత్ర అనంతరం వీరు 9న ఉదయం ప్రొద్దుటూరు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో శుక్రవారం మృదేశ్వర్‌లో ఉన్న ఆలయానికి వెళ్లారు. రాత్రి భోజనం చేశాక వారిలో కొందరు విద్యార్థులు స్థానికంగా ఇద్దరు యువకులతో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. దీంతో మృదేశ్వర్ గ్రామానికి చెందిన సుమారు 75 మంది దాకా విద్యార్థుల బస్సులను చుట్టుముట్టారు. దాడికి కారణమైన 10 మంది విద్యార్థులను వారు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. మిగతా విద్యార్థులు, అధ్యాపకులు రాత్రి నుంచి స్టేషన్‌లోనే ఉండి పోయారు. గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున కేకలు వేస్తుండటంతో విద్యార్థులందరూ బిక్కుబిక్కు మంటూ ఉండి పోయారు.
సమాచారం అందించిన విద్యార్థి
వారిలో ఆసిఫ్ అనే విద్యార్థి అక్కడ జరిగిన ఘటన గురించి తన సెల్‌ఫోన్ ద్వారా కౌన్సిలర్ రఫిక్‌కు మెసేజ్ పెట్టాడు. కౌన్సిలర్ వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ రామకృష్ణకు, డీఎస్పీ పూజితానీలంకు తెలిపారు. దీంతో ఎస్పీ మృదేశ్వర్ సీఐ, ఎస్‌ఐలతో మాట్లాడి అక్కడ పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రొద్దుటూరు పోలీసులు కూడా అక్కడి పోలీసులతో మాట్లాడారు. కాగా అక్కడి గ్రామ పెద్దలు, కళాశాల అధ్యాపకులు స్టేషన్‌లో పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు. కేసులు పెడితే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని వారు ప్రాధేయ పడ్డారు. అయితే గ్రామస్తులు మాత్రం కచ్చితంగా కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలా శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ స్టేషన్‌లోనే మంతనాలు జరిపారు. ఈ విషయం ప్రొద్దుటూరులోని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెంద సాగారు.