'మోదీ పునాది వేస్తే మంచి జరగదు'
విజయవాడ: 'రాజధానికి అమరావతి అని పేరుపెట్టారు. తీరా చూస్తే భారీ ఎత్తున పూజలు, హోమాలు చేస్తున్నారు. బుద్ధుడికి పూజలు ఉండవు. ఒక వేళ పూజలే చేయాలనుకుంటే రాజధానికి బుద్ధుడి పేరుకాకుండా రాముడి పేరుపెట్టాలి. అమరావతికి గౌతమబుద్ధుడి పునాదులున్నాయి. కానీ ఇక్కడ బుద్ధుడి విగ్రహమే కనపడడంలేదు. నిజం చెప్పాలంటే బుద్ధుడి పేరు పెట్టినందువల్లే బీజేపీ రాష్ట్రానికి పైసలు ఇవ్వడంలేదు. నిధులు ఇవ్వాల్సిన మోదీ రాజధానికి ఏమిచ్చారు? పవిత్ర నదీజలాలు, పుణ్యభూమి అని పెద్ద మట్టి కుప్ప తప్ప! నరేంద్రమోదీ ఎక్కడ పునాది వేసినా మంచి జరగదు' అంటూ ఏపీ, కేంద్ర ప్రభుత్వాధినేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు 'మనూ' ప్రొఫెసర్ కంచె ఐలయ్య. సీఐటీయూ, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో జరిగిన సీఐటీయూ వ్యవస్థాపకులు పర్సా సత్యనారాయణ- నండూరి ప్రసాదరావు స్మారక సెమినార్‌లో 'దేశభక్తి- భిన్న దృక్పథాలు' అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
భారతీదాసన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేశ్ ఆత్రేయ మాట్లాడుతూ.. స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకోని ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్‌పరివార్, బీజేపీలు ఇప్పుడు దేశంలో కార్పొరేట్ హిందుత్వవాదాన్ని నడిపిస్తున్నాయని, విద్యార్థుల మెదళ్లలోకి మతతత్వమనే విషాన్ని చొప్పిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ హెచ్‌సీయూలో చనిపోయిన రోహిత్ బీసీ అని నిరూపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు నెలలుగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అనంతరం ఆర్థిక రంగంలో విదేశీ పెట్టుబడులు- దేశ స్వావలంబన’ అంశంపై సెమినార్ జరిగింది. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.పుణ్యవతి, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు అమానుల్లాఖాన్, బెఫీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ బిశ్వాస్ తదితరులు పాల్గొన్నారు.