ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలి
ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలి
Published Tue, Jul 26 2016 11:41 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM
గన్నవరం :
విజయవాడలో కూల్చివేసిన దేవాలయలను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చి 20 రోజులు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని, హామీని నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విశ్వహిందూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీఎస్ నాయుడు, అఖిల భారత సంయుక్త కార్యదర్శి గరిమెళ్ల సత్యం పిలుపునిచ్చారు. కేసరపల్లి శివారు శ్రీభువనేశ్వరి పీఠంలో మంగళవారం పీఠాధిపతులు సత్యానంద భారతీ స్వామి అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. నాయుడు, సత్యం మాట్లాడుతూ ఆలయాలు, సేవా కేంద్రాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. త్రేతాయుగం నాటి సీతమ్మవారి పాదాలను కూడా తొలగించడం ప్రభుత్వ అమానుషత్వానికి నిదర్శనమని చెప్పారు. మరో 90 ఆలయాలను కూడా కూల్చివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. పుష్కరాలలోగా ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని, లేకుంటే మహా ఉద్యమ రూపంలో హిందూ శక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు.
పుష్కరాల్లో 500 మందితో సేవలు
రానున్న కృష్ణా పుష్కరాల్లో వీహెచ్‌పీకి చెందిన 500మంది కార్యకర్తలతో సేవలందించనున్నామని చెప్పారు. పుష్కరాల్లో రోజుకు ఐదు వేల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. వీహెచ్‌పీతో పాటు శివస్వామి ఆశ్రమ భక్తులు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని వివరించారు.
Advertisement