ఎంపీడీవోలకు హోదా
Published Thu, Jan 26 2017 1:30 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
ఏలూరు (మెట్రో) : ఏళ్లు కాదు.. దశాబ్దాల నాటి కల సాకారమయ్యింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) చాలా ఏళ్లుగా ఒకే రకమైన విధులతో విసుగెత్తిపోయారు. ఉద్యోగరీత్యా ఎదుగూ బొదుగూ లేక వారిలో నిరుత్సాహం అలముకుంది. వారితోపాటు ఉద్యోగాలు పొందిన మిగతా శాఖల ఉద్యోగులు మాత్రం పదోన్నతులు పొంది ఉన్నతాధికారులు కావడంతో ఎంపీడీవోల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో 6 నుంచి 18 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి వివిధ కేడర్లలో హోదాలు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలోని ఎంపీడీవోల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పెరగనున్న హోదా
జిల్లాలో 48 మండలాలకు గాను 46 మండలాలకు పూర్తిస్థాయిలో ఎంపీడీవోలు ఉన్నారు. కామవరపుకోట ఎంపీడీవో మరణంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడగా దెందులూరు ఎంపీడీవో ఇటీవల పదవీ విరమణ పొందారు. సాధారణంగా ఎంపీడీవోలకు జెడ్పీ డెప్యూటీ సీఈవో, ఏవోగా పదోన్నతులు కల్పిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదోన్నతి ఇచ్చేందుకు పంచాయతీరాజ్‌శాఖ ప్రయత్నించినప్పుడల్లా సీనియార్టీని నిర్ణయించడంపై వివాదాలు ఏర్పడి కోర్టులను ఆశ్రయించేవారు. దీంతో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం జిల్లాలో 42 మంది ఎంపీడీవోలకు హోదా లభించనుంది.
మూడు రకాల క్యాడర్లు
ఎంపీడీవోల సర్వీసు ఆధారంగా ప్రభుత్వం హోదాలను నిర్ణయించింది. ఆరేళ్లు పూర్తిచేసిన ఎంపీడీవోలకు సహాయ సంచాలకుడు (ఏడీ), 12 ఏళ్లు పూర్తిచేసిన వారికి ఉప సంచాలకుడు (డీడీ), 18 ఏళ్లు పూర్తిచేసిన వారికి సంయుక్త సంచాలకుడు (జేడీ) హోదాలను ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో ఏడీ క్యాడర్‌లో 8 మంది, డీడీ క్యాడర్‌లో 27 మంది, జేడీ క్యాడర్‌లో ఏడుగురు పదోన్నతులు పొం దారు. మిగిలిన ఆరుగురికి ఆరేళ్ల సర్వీసు పూర్తికాలేదు.
జేడీలుగా అందరూ మహిళలే..
ఇప్పటివరకూ మండలస్థాయిలో విధులు నిర్వహించిన మహిళా ఎంపీడీవోలు ప్రస్తుతం జిల్లా స్థాయిలో జాయింట్ డైరెక్టర్ హోదా పొందారు. వీరిలో గణపవరం ఎంపీడీవో జి.పద్మ, ఇరగవరం ఎంపీడీవో జి.విజయలక్ష్మి, మొగల్తూరు రమాదేవి, పెనుగొండ పద్మిని, ఉంగుటూరు జె.రేణుకమ్మ, వీరవాసరం పి.జగదాంబ, జీలుగుమిల్లి ఎంపీడీవో పీకే నిర్మలాదేవి జిల్లా స్థాయి పోస్టులు సాధించనున్నారు.
Advertisement
Advertisement