అక్రమాలకు పాల్పడితే పోరాటం
-
ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక
నెల్లూరు, సిటీ: ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనులకు మంజూరైన సబ్‌ప్లాన్ నిధుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడితే పోరాటం తప్పదని ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలకు తెలుసన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ అజీజ్, అధికారులు దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎస్సీ సబ్‌ప్లాన్ కాంట్రాక్ట్ పనులను ఎస్సీ, ఎస్టీ, వడ్డెర కులాల వారికి 15 శాతం కేటాయించాల్సి ఉందని, అయితే కార్పొరేషన్‌లో మేయర్,అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వేదిక జిల్లా అధ్యక్షులు పరుశు మస్తానయ్య, లాలాకృష్ణ, మామిడి శ్రీనివాసులు, సత్యనారాయణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.