ప్రోటోకాల్‌పై మాటామాటా | protocol issue zp meeting | Sakshi
Sakshi News home page

ప్రోటోకాల్‌పై మాటామాటా

Published Tue, Oct 4 2016 2:53 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

ప్రోటోకాల్‌పై మాటామాటా

ప్రోటోకాల్‌పై మాటామాటా

  • అరుపులు, కేకలతో దద్దరిల్లిన జెడ్పీ సమావేశం 
  • చర్చించాలన్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి  
  • అక్కర్లేదన్న హోంమంత్రి రాజప్ప 
  • ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు 
  • సమస్యలు పరిష్కారం కానప్పుడు మేము రావడమెందుకన్న జెడ్పీటీసీలు
  • కాకినాడ రూరల్‌ :నిధులు, విధులు, ప్రొటోకాల్‌ అంశాలపై జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం అరుపులు, కేకలతో దద్ధరిల్లింది. సోమవారం జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు అధ్యక్షతన జీఎంసీ బాలయోగి సమావేశ హాలులో జరిగింది. ప్రధాన సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అవి అలాగే మిగిలిపోతున్నాయని, తమను మండలాల్లో ఏ అధికారులూ లెక్క చేయడంలేదని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరు సమస్యలు ప్రస్తావిస్తుంటే ఇంకొకరు లేచి మాట్లాడడంతో ఒక దశలో సమావేశం గందరగోళంగా మారింది. జెడ్పీటీసీ సభ్యులు తమ గ్రామాల్లో సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలని యత్నించగా ఉపముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప వారిపై కన్నెర్ర చేసి కూర్చోండంటూ కేకలు వేసి మరీ కూర్చోబెట్టారు. సమస్యలు పరిష్కారం కానప్పుడు, ఇబ్బందులు చెప్పుకునే అవకాశం లేనప్పుడు తాము సమావేశాలకు రావడం ఎందుకంటూ పలువురు మహిళా జెడ్పీటీసీ సభ్యులు అధికారులను, జెడ్పీ చైర్మన్‌ను నిలదీశారు.
     
    అమరవీరులకు నివాళి
    సభ ప్రారంభానికి ముందుగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్‌ ఉగ్రవాద దాడిలో అమరులైన సైనికులకు సంతాపం తెలపాలని కోరడంతో సభ ఏకగ్రీవంగా అంగీకరించింది. దీంతో అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు మాట్లాడుతూ గతంలో 13వ ఆర్థిక సంఘం గ్రాంటు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలకు వేరువేరుగా కేటాయించినట్టు కాకుండా 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామపంచాయతీలకే కేటాయించడం, ఇసుక నూతన విధానం వల్ల సీనరేజ్‌ ఆదాయం లేకపోవడం వల్ల జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల అభివృద్ధి పనులకు నిధుల కొరత ఎదురైందన్నారు. గతంలో మాదిరిగానే జిల్లాపరిషత్, మండల పరిషత్‌లకు నిధులు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.

    గ్రామపంచాయతీల్లో మరణించిన, పదవీ విరమణ చేసిన నాన్‌ ప్రావిన్షలైజుడ్‌ సిబ్బంది పింఛన్లు, ఇతర సహాయాల కోసం జిల్లా పరిషత్‌ 2016 వరకు రూ.59కోట్ల 11 లక్షలు ఖర్చు చేయగా ఈ ఏడాది రూ.6కోట్ల 20 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. మొత్తం రూ.65.11 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించింది. జెడ్పీ రోడ్లు, గెస్ట్‌హౌస్‌ల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసేందుకు పంచాయతీరాజ్‌ మంత్రిని కోరుతూ చేసిన ప్రతిపాదనలను కూడా సభ ఆమోదించింది. 
     
    అధికారులు ప్రజాప్రతినిధులను అగౌరపరుస్తున్నారు : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
    కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రొటోకాల్‌ అంశాన్ని లేవనెత్తి అధికారులు కావాలని ప్రజాప్రతినిధులను అగౌరపరిచే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులను గౌరవిస్తూ తమను అవమాన పరుస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రొటోకాల్‌ అంశం పెద్ద విషయం కాదని, అభివృద్ధిపై చర్చించాలని అన్నారు. దీనిపై సభలో మాటా మాటా పెరిగింది.  వ్యవసాయ యంత్రపరికరాలకు సంబంధించి అధికారులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించడంలేదని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు చర్చ లేవనెత్తారు.

    కొత్తపేట జగ్గిరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోనూ రైతులకు వ్యవసాయ యంత్రపరికరాలు అందించే విషయంతో అన్యాయం జరుగుతోందన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం కల్పించుకుంటూ జగ్గిరెడ్డి యంత్రపరికరాలు అందించే విషయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతోనే లిస్టు తయారు చేసి అధికారులకు ఇచ్చారనడంతో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షనేత శాఖా ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ యంత్ర పరికరాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ రైతులు వేరువేరు అనే భేదాలుంటాయా అని ప్రశ్నించారు. కౌలు రైతులకు రుణాలు, సొసైటీలు రైతుల నుంచి వడ్డీలు వసూలు తదితర అంశాలు ఒకదాని వెంట ఒకటి చర్చకు రావడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.  దీంతో సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరగడంతో మంత్రి చినరాజప్ప కల్పించుకుని ఎవరికి ఏం చేయాలో మాకు తెలుసు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గదమాయించి చర్చ కొనసాగించకుండా ఆపేశారు.
     
    కాళ్ల వాపు వ్యాధిపై నిర్ధిష్టత లేకుండా ఎవరికి తోచినట్టు వారు ప్రకటనలు ఇస్తున్నారని, దీనిపై చర్యలు చేపట్టాలని ఏజెన్సీ మండలాలకు చెందిన జెడ్పీటీసీలు కోరారు. చింతూరులోనే ప్రత్యేక ఆసుపత్రిని అభివృద్ధి చేసి అక్కడ ప్రజలకు వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ వివరించారు. విద్యాశాఖ, ఎస్సీ కార్పొరేషన్, సోషల్‌ వెల్ఫేర్, వైద్య ఆరోగ్య, స్త్రీశిశుసంక్షేమశాఖ, విద్యుత్, సాగునీరు, బీసీ కార్పొరేషన్, పశుసంవర్ధక శాఖలపై చర్చించారు. జెడ్పీ సీఈవో కె.పద్మ,  ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, పిల్లి అనంతలక్ష్మి, ఎ.ఆనందరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement