అవకతవకలకు పాల్పడితే చర్యలు
Published Tue, Jul 19 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
మానవపాడు: విద్యార్థులకు అందించే భోజనం విషయంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా పీఓ గోవిందరాజులు అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. కస్తూర్బాలో చాలీచాలని భోజనం పెడుతున్నారని, మంచినీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు పేర్కొంటూ ఎస్‌ఓ, టీచర్లను గదిలో బంధించి ధర్నా చేసిన విషయం విధితమే. ఈమేరకు పీఓ కస్తూర్బాను తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఎస్‌ఓ శ్రీదేవి, టీచర్లను ఎందుకు నిర్బంధించాల్సి వచ్చిందో అడిగి రాతపూర్వకంగా సమస్యలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం చోటుచేసుకున్న సంఘటన కేవలం టీచర్ల సమన్వయం లేకపోవడమే తప్ప విద్యార్థులకు అందించే ఆహారంలో కాదన్నారు. మరుగుదొడ్లు, బాత్‌రూంలు సరిగాలేనట్లు మా పరిశీలనలో తేలిందని వాటిపై కాంట్రాక్టర్‌ను మందలించి మరమ్మతులు చేయిస్తామన్నారు. ఇదిలాఉండగా, జిల్లా అధికారులు వస్తే మా సమస్యలు తీరతాయనుకున్నామని, కానీ పైపై రిపోర్టు తీసుకొని పోవడంపై కొందరు విద్యార్థులు ‘సాక్షి’తో అసంతృప్తి వ్యక్తంచేశారు.
Advertisement
Advertisement