సైకో దాడుల్లో ముగ్గురి మృతి
Published Thu, Dec 24 2015 1:33 PM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. చేతిలో ఉన్న ఇనుప రాడ్డుతో సొంత వదినతో సహా దారిన పోయే వాళ్లపై దాడి చేశాడు. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న ఏడిద ఆనంద్(35) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంటి ఎదుట పని చేసుకుంటున్న వదిన విజయలక్ష్మి(38)పై ఇనుపరాడ్డుతో ఒక్కసారిగా దాడి చేయడంతో.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఇది గుర్తించిన స్థానికుడు గడ్డం నాగభూషణం అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతని తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలిపోయాడు. అడ్డొచ్చిన మరొకరిపై కూడా దాడి చేసి గాయపరిచాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీటీసీ కండవల్లి కుమారి అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేసి గాయపరిచాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సైకోను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. గాయపడిన వారిలో ఎంపీటీసీ కుమారి, నాగభూషణం చికిత్స పొందుతూ మరణించగా..మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కోరుకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనంద్ నిన్ననే జైలు నుంచి విడుదలైనట్లు తెలుస్తుంది.
Advertisement