- వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సంజీవయ్య
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు
Published Wed, Jul 27 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
పరకాల : ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా మెరుగైన వైద్యంతో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సంజీవయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు నెలవారీగా టార్గెట్లుగా 30 కాన్పులు చేయాల్సి ఉండగా, అన్ని లక్ష్యాన్ని దాటాయన్నారు. రాష్ట్రంలోనే మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు ఏ గ్రేడ్‌లో ఉన్నాయన్నారు. ఆస్పత్రుల్లో డెలివరీ కోసం ఆధునిక పరికరాలతో ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని ఆస్పత్రులకు 10 కేవీ జనరేటర్ల అందిస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.
శిశువు మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదు..
పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో ఈనెల 24వ తేదీన మృతి చెందిన శిశువు మృతి విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మ నీరు తాగడంతోనే శిశువు మృతి చెందిందన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్‌రెడ్డి, డాక్టర్లు పద్మజ, స్వప్నలత, సిరంగి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement